వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 50వ వారం

నీటి కాలుష్యం
నీటి కాలుష్యం అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చెయ్యడం. సరస్సులు, నదులు, సముద్రాలు, జలాశయాలు, భూగర్భజలాలు అన్నీ నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు, తగినంతగా శుద్ధి చేయని మురుగునీటిని సహజ జలాల్లోకి విడుదల చేయడం జల పర్యావరణ వ్యవస్థల క్షీణతకు దారితీస్తుంది. దీంతో ఈ నీటిపి ఆధారపడి నివసించే వారిలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వారు అదే కలుషితమైన నీటిని తాగడానికి లేదా స్నానం చేయడానికి లేదా నీటిపారుదల కొరకు ఉపయోగించవచ్చు . ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, వ్యాధులకూ నీటి కాలుష్యం ప్రధాన కారణం. సముద్ర కాలుష్యం, పోషకాల కాలుష్యం నీటి కాలుష్యంలోని ఉపసమితులు. నీటి కాలుష్యానికి కారణమయ్యే మూలాలు ఒక్క చోటనే (ఏకమూలం) ఉండవచ్చు, లేదా పలు చోట్ల ఉండే మూలాలూ (అనేక మూలాలు) కావచ్చు. వరద నీటి కాలువ, మురుగునీటి శుద్ధి కర్మాగారం లేదా వాగు వంటివి ఏక మూల కాలుష్య కారకాలు. వ్యవసాయ మురుగు నీరు వంటివి అనేక మూలాలు కలిగినవి. కాలుష్యం అనేది కాలక్రమంలో జరిగే సంచిత ప్రభావం యొక్క ఫలితం. కలుషితమైన నీటి వనరులలో నివసించే లేదా ఆ నీటిని గ్రహించే మొక్కలు, జీవులు అన్నీ ప్రభావితమవుతాయి.
(ఇంకా…)