వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 52వ వారం

మార్లిన్ డీట్రిచ్
మార్లిన్ డీట్రిచ్ జర్మన్-అమెరికన్ నటి, గాయని. 1910ల నుంచి 1980ల వరకూ సాగిన ఆమె సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పటికప్పుడు తనని తాను పునర్ అన్వేషించుకుంటూ ప్రాచుర్యాన్ని నిలబెట్టుకునేది. 1920ల్లో మార్లిన్ బెర్లిన్‌లో రంగస్థలంపైనా, నిశ్శబ్ద చిత్రాల్లోనూ నటించింది. ద బ్లూ ఏంజెల్ (1930)లో లోలా-లోలా పాత్రలో ఆమె నటన ఆమెకు అంతర్జాతీయ ప్రాచుర్యం, పారామౌంట్ పిక్చర్స్‌తో ఒప్పందాన్ని సంపాదించిపెట్టింది. మొరాక్ (1930), షాంఘై ఎక్స్‌ప్రెస్ (1932), డిజైర్ (1936) వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది. తన ఆకర్షణీయమైన రూపాన్ని, ఆకట్టుకునే శైలిని ఆధారం చేసుకుని ఆ దశలోకెల్లా అతిఎక్కువ సంపాదన కలిగిన నటిగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినన్నాళ్ళూ అమెరికా వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన తారగా ఆమె అత్యున్నత స్థానంలో నిలిచేవుంది. అడపాదడపా సినిమాల్లో నటించినా 1950ల నుంచి 1970ల వరకూ డీట్రిచ్ తన సమయాన్ని ప్రపంచం అంతా తిరుగుతూ లైవ్-షోల్లో ప్రదర్శనలు చేయడంతో గడిపింది. యుద్ధ సమయంలో జర్మన్, ఫ్రెంచ్ ప్రవాసులకు ఇళ్ళు నిర్మించడం, ఆర్థిక సహకారాన్ని అందించడం, తుదకు అమెరికన్ పౌరసత్వం ఇవ్వాలని ప్రచారం చేయడం వంటి పనులతో డీట్రిచ్ మానవతావాదిగా పేరొందింది.
(ఇంకా…)