వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 53వ వారం
బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి |
---|
బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగుదంతపు కళాకృతి ఒకే ఏనుగు దంతంపై అంతర్భాగాలతో చెక్కిన కళాఖండం, ప్రస్తుతానికి న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంలోని అలంకరణ కళల గాలరీలో ప్రదర్శింపబడుతోంది. ఈ ఏనుగు దంతం ప్రదర్శనశాలకు వితరణగా లభించింది. దాదాపు ఐదు అడుగుల పొడవు ఉన్న ఈ ఏనుగు దంతపు కళాకృతిపై బుద్ధుని జీవితానికి సంబంధించిన 43 ఘట్టాలను చెక్కారు. దీనిని 20వ శతాబ్ది తొలినాళ్లలో ఢిల్లీ ప్రాంతానికి చెందిన కళాకారుడు తయారుచేసినట్టు భావిస్తున్నారు. పొడవైన, పూర్తి ఏనుగు దంతాలను చెక్కేందుకు ఉపయోగించడం 18, 19 శతాబ్దాలలోని భారతదేశంలో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ శైలి బర్మాలో కాక మళ్ళీ ఢిల్లీప్రాంతాల్లోనే ప్రాచుర్యం పొందింది. ఇలాంటి పూర్తి ఏనుగు దంతాల కళాకృతులు కాంగోకు చెందిన ఐవరీ కోస్టు ప్రాంతంలో, బెనిన్లోనూ కనిపిస్తాయి. ఐతే అవి ఆఫ్రికన్ ఏనుగుల దంతాలతో చేసినవి కావడం భేదం. ఏనుగుదంతాలు చెక్కి కళాకృతులు తయారుచేసే కళ భారతదేశంలో చాలా ప్రాచీనతరమైనది. కాళిదాసు రాసిన మేఘదూతంలోకూడా ఈ కళ గురించిన వివరాలు దొరుకుతాయి. లభ్యమవుతున్న పురాతన ఏనుగు దంతం కళాకృతుల్లో తక్షశిలలో దొరికిన క్రీ.శ.2వ శతాబ్దానికి చెందిన దంతపు దువ్వెన ఉంది. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండి, కళకు మహారాజుల పోషణ లభించిన అస్సాం, మైసూర్ ప్రాంతాల్లో ఏనుగు దంతాలను చెక్కే కళ పరిఢవిల్లింది. (ఇంకా…) |