మిఖాయిల్ గోర్బచేవ్
మిఖాయిల్ సెర్గేయివిచ్ గోర్బచేవ్ రష్యన్ రాజకీయ నాయకుడు, మాజీ సోవియట్ యూనియన్ రాజకీయ నాయకుడు. అతను సోవియట్ యూనియన్‌కు ఎనిమిదవ, చివరి నేత. 1985 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. 1988 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ దేశాధినేతగా, 1988 నుండి 1989 వరకు సుప్రీం సోవియట్ ప్రెసీడియం ఛైర్మన్‌గా, 1989 నుండి 1990 వరకు సుప్రీం సోవియట్ ఛైర్మన్‌గా, 1990 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. సైద్ధాంతికంగా, అతడు మొదట్లో మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడి ఉన్నాడు, అయితే 1990 ల ప్రారంభంలో సామ్యవాద ప్రజాస్వామ్యం వైపు వెళ్ళాడు. రష్యన్, ఉక్రేనియన్ మిశ్రమ వారసత్వానికి చెందిన గోర్బచేవ్, స్టావ్రోపోల్ క్రాయ్‌ లోని ప్రివోల్నోయేలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. జోసెఫ్ స్టాలిన్ పాలనలో పెరిగిన అతడు, యవ్వనంలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరడానికి ముందు కొన్నాళ్ళు సమష్టి పొలంలో హార్వెస్టర్లను నడిపాడు. అప్పట్లో మార్క్సిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంతం ప్రకారం సోవియట్ యూనియన్‌ను ఏకపక్షంగా పరిపాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. మాస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి 1955 లో న్యాయ పట్టా పొందాడు.
(ఇంకా…)