అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం అని పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా రూపుదిద్దుకుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సోవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం, వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరిస్తారు. ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. షికాగోలో 1908 మే 3, న్యూయార్క్ లో 1909 ఫిభ్రవరి 28న జరిగాయి. 1910 ఫిభ్రవరి 27 రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది.
(ఇంకా…)