దక్షిణ భారతదేశం
దక్షిణ భారతదేశం భారత ద్వీపకల్పంలో వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రాంతం. దీనికి సంస్కృత పదం దక్షిణం నుండి డెక్కన్ అనే పేరు కూడా వచ్చింది. దీనికి ఉత్తరాన నర్మదా నది, మహానది పడమటన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలున్నాయి.

తూర్పు కనుమలు, పడమటి కనుమలు మధ్య గల దక్కన్ పీఠభూమితో దక్షిణ భారతదేశం భౌగోళికంగా కూడా వైవిధ్యమైనది. తుంగభద్ర, కావేరి, కృష్ణ, గోదావరి ఇచ్చటి ముఖ్యనదులు. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, చోళులు, పాండ్యులు, చేరులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయసల, విజయనగర రాజులు మొదలైన రాజులు పరిపాలించారు. ఈ రాజవంశాలలో కొన్ని శ్రీలంక, శ్రీవిజయలను జయించడం వలన ఇప్పటికీ వారి జీవన విధానాలలో దక్షిణ భారత సాంస్కృతిక ప్రభావం కనిపిస్తుంది.
(ఇంకా…)