వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 21వ వారం
ఘట్టమనేని కృష్ణ |
---|
ఘట్టమనేని కృష్ణ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో పద్మాలయా పేరుతో సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.
కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జాన్రాలు పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. |