బ్రహ్మోస్
బ్రహ్మోస్, మధ్య పరిధి గల, ర్యామ్‌జెట్ ఇంజనుతో పనిచేసే, సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి. నేలపై నుండి, సముద్రంపై నుండి (యుద్ధ నౌకల నుండి), సముద్రం లోపల నుండి (జలాంతర్గాముల నుండి), ఆకాశం నుండి (యుద్ధ విమానాల నుండి) ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. భారత్‌కు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, రష్యాకు చెందిన NPO మషినోస్ట్రోయేనియాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ భారత్‌లో ఈ క్షిపణిని తయారు చేస్తోంది. రష్యా క్రూయిజ్ క్షిపణి P-800 ఓనిక్స్ సాంకేతికతపై ఆధారపడి ఈ క్షిపణిని తయారు చేసారు. భారత దేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యా లోని మోస్క్వా నది - ఈ రెండు పేర్లలోని మొదటి భాగాలను కలపగా ఏర్పడినదే బ్రహ్మోస్. హిందూ పురాణాల్లోని బ్రహ్మాస్త్రం ను ఈ పేరు ధ్వనింప జేస్తుంది.

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నౌకా విధ్వంసక క్షిపణు లన్నిటిలోకీ బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైనది. ఈ క్షిపణి మ్యాక్ 2.8 - 3.0 వేగంతో ప్రయాణిస్తుంది.
(ఇంకా…)