పి.వి. సింధు
పూసర్ల వెంకట సింధు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ కీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.

2012 సెప్టెంబరు 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2013 ఆగస్టు 10 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. 2016 ఆగస్టు 18 న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. 2012 ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించిన సైనా నెహ్వాల్ తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది.
(ఇంకా…)