వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 29వ వారం

మైకేల్ ఫారడే
మైఖేల్ ఫారడే FRS (1791 సెప్టెంబరు 22 - 1867 ఆగస్టు 25) విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం అధ్యయనానికి కృషి చేసిన ఆంగ్ల శాస్త్రవేత్త . అతని ప్రధాన ఆవిష్కరణలలో విద్యుదయస్కాంత ప్రేరణ, డయామాగ్నెటిజం, విద్యుద్విశ్లేషణ వంటి అంతర్లీన సూత్రాలు ఉన్నాయి.

ఫారడే పెద్దగా చదువుకోనప్పటికీ, చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తలలో ఒకనిగా నిలిచాడు. ఏకముఖ విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్న విద్యుత్ వాహకం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రంపై చేసిన పరిశోధనల ద్వారా భౌతిక శాస్త్రంలో విద్యుదయస్కాంత క్షేత్రం అనే భావనకు ఆధారాన్ని స్థాపించాడు. అయస్కాంతత్వం కాంతి కిరణాలను ప్రభావితం చేస్తుందని, ఆ రెండు దృగ్విషయాల మధ్య అంతర్లీన సంబంధం ఉందనీ ఫారడే నిరూపించాడు. విద్యుదయస్కాంత ప్రేరణ, డయా అయస్కాంత సూత్రాలను, విద్యుద్విశ్లేషణ నియమాలను కనుగొన్నాడు. అతడు చేసిన విద్యుదయస్కాంత రోటరీ పరికరాల ఆవిష్కరణలు విద్యుత్ మోటారు సాంకేతికతకు పునాది వేశాయి.

రసాయన శాస్త్రవేత్తగా ఫారడే, బెంజీన్‌ను కనుగొన్నాడు. క్లోరిన్ యొక్క క్లాథ్రేట్ హైడ్రేట్‌ను పరిశోధించాడు, బున్సెన్ బర్నర్ ప్రారంభ రూపాన్ని, ఆక్సీకరణ సంఖ్యల వ్యవస్థనూ కనుగొన్నాడు. "యానోడ్ ", "కాథోడ్ ", "ఎలక్ట్రోడ్" , "అయాన్" వంటి ప్రాచుర్యం పొందిన పరిభాషను కనుగొన్నాడు. ఫారడే రాయల్ ఇన్‌స్టిట్యూషన్‌లో రసాయన శాస్త్ర మొట్టమొదటి ఫుల్లెరియన్ ప్రొఫెసర్ అయ్యాడు.
(ఇంకా…)