వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 30వ వారం

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబిదీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచాడు. కలామ్ ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషిచేశాడు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించాడు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచాడు. కలామ్ తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు. భారతదేశపు పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాడు.
(ఇంకా…)