గ్రంథచౌర్యం
వేరొక కర్త భాష, ఆలోచనలు, భావాలు లేదా వ్యక్తీకరణలను తమ స్వంత రచనగా సూచించడాన్ని గ్రంథచౌర్యం అంటారు. ఈ చర్యలను ఆంగ్లంలో ప్లేజియరిజం అని పేర్కొంటారు. శబ్ధకోష్ ఆంగ్ల-తెలుగు భాషా నిఘంటువు ప్లేజియరిజం అనే పదానికి కావ్యచోరత్వము, పదచోరత్వము, భావచౌర్యము, గ్రంథచౌర్యం అను అర్థాలున్నాయి. గ్రంథచౌర్యం అనేమాట గ్రంథాన్ని చౌర్యం చేయడమని అర్థం సూచిస్తున్నా, ప్లేజియరిజం పదం వలె ఈ పదాన్ని కూడా విస్తృతమైన పరిథిలో ఉపయోగిస్తారు. చలనచిత్రాలు, కథలు, పాటలు, స్వర రచనలు, కళాఖండాలు, మందుల సూత్రాలు నకలు చేయడము, ఇంకా పరిశోధనా వ్యాసాలు/సిద్ధాంత గ్రంథాలు పరిశోధనా ఫలితాల పూర్తిగా కానీ, కొంత భాగం కానీ చౌర్యం చేయడాన్ని గ్రంథచౌర్యంగా పరిగణిస్తారు. ఈ రకమైన చౌర్య కార్యకలాపాలు రచయితలు, కళాకారులు, పరిశోధకులకు నష్టం కలిగిస్తాయి.

హె.ఎం. పాల్, సాహిత్యంలో మూడు రకాల చౌర్యచర్యలను గమనించాడు- అబద్ధపు ప్రతులను సృష్టించటం (ఫోర్జరీ); బందిపోటుతనం; మూడవది గ్రంథచౌర్యం. ఈ చర్యలను కొందరు కీర్తికోసం, మరికొందరు ధనాశతోటీ చేస్తారని పేర్కొన్నాడు.
(ఇంకా…)