వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 41వ వారం

పడమటి కనుమలు

పడమటి కనుమలు భారతదేశపు పశ్చిమ తీరానికి సమాంతరంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పర్వత శ్రేణి. వీటినే సహ్యాద్రి పర్వతశ్రేణులు అని కూడా పిలుస్తారు. 1,40,000 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ పర్వత శ్రేణి, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. జీవ వైవిధ్యానికి సంబంధించి, ప్రపంచంలోని ఎనిమిది ప్రధానకేంద్రాల్లో ఇది ఒకటి. దేశంలోని వృక్షజాలం, జంతుజాలాల్లో చాలా భాగం ఇక్కడ ఉంది. వీటిలో చాలా జాతులు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. యునెస్కో అంచనాల ప్రకారం, పడమటి కనుమలు హిమాలయాల కంటే పాతవి. వేసవి చివరలో నైరుతి దిశలో వచ్చే వర్షాన్ని మోసుకొచ్చే రుతుపవనాలను అడ్డగించడం ద్వారా ఇవి భారతీయ రుతుపవన వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి. పడమటి కనుమల్లో 7,402 జాతుల పుష్పించే మొక్కలు, 1,814 జాతుల పుష్పించని మొక్కలు, 139 క్షీరద జాతులు, 508 పక్షి జాతులు, 179 ఉభయచర జాతులు, 6,000 కీటకాలు, 290 మంచినీటి చేప జాతులూ ఉన్నాయి. ఇప్పటి వరకూ కనుగొనని అనేక జాతులు పడమటి కనుమలలో ఉండవచ్చని భావిస్తున్నారు. పడమటి కనుమలలో కనీసం 325 అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి.
(ఇంకా…)