హోమీ జహంగీర్ భాభా
హోమీ జహంగీర్ భాభా (1909 అక్టోబరు 30 - 1966 జనవరి 24) భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, వ్యవస్థాపక డైరక్టరు, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు. అతనిని "భారత అణు కార్యక్రమానికి పితామహుడు" అని పిలుస్తారు. అతను భాభా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే కు వ్యవస్థాపక డైరెక్టర్‌. అతని గౌరవార్థం ఆ సంస్థకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భారత అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉన్న "టి.ఐ.ఎఫ్.ఆర్", "ఏ.ఇ.ఇ.టి" అణ్వాయుధాల సంస్థలకు అతను డైరెక్టర్‌గా పర్యవేక్షించాడు. అతనికి ఆడమ్స్ ప్రైజ్ (1942), పద్మభూషణ (1954) పురస్కారాలు లభించాయి. 1951, 1953 –1956లలో అతను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డాడు. యురేనియం నిల్వల కంటే దేశంలోని విస్తారంగా లభ్యమవుతున్న థోరియం నిల్వల నుండి శక్తిని వెలికి తీయడంపై దృష్టి సారించే వ్యూహాన్ని రూపొందించిన ఘనత ఆయనకు ఉంది. ఈ థోరియం కేంద్రీకృత వ్యూహం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భిన్నంగా ఉంది. ఈ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడానికి భాభా ప్రతిపాదించిన విధానం భారతదేశం యొక్క మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమంగా మారింది. 1966 జనవరి 24 న మోంట్ బ్లాంక్ సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 కూలిపోవడంతో హోమి జె. భాభా మరణించాడు.
(ఇంకా…)