వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 44వ వారం
ఆంధ్రప్రదేశ్ |
---|
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. 162,970 కి.మీ2 (62,920 చ. మై.) విస్తీర్ణంతో ఇది ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం. 49,386,799 మంది నివాసితులతో పదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. దీనికి వాయువ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. భారతదేశంలో గుజరాత్ తరువాత 974 కి.మీ. (605 మై.) తో రెండవ పొడవైన తీరప్రాంతం కలిగివుంది. 1953 అక్టోబర్ 1న భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు భారతదేశంలో ఒక ప్రధాన బౌద్ధ తీర్థయాత్ర, బౌద్ధ అభ్యాస కేంద్రంగా ఉంది. దీనికి గుర్తుగా రాష్ట్రంలోని అనేక ప్రదేశాలలో శిధిలాలు, చైత్యాలు, స్థూపాల రూపాలున్నాయి. ప్రఖ్యాత వజ్రం కోహినూర్, అనేక ఇతర ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలు రాష్ట్రంలో ని కొల్లూరు గనిలో లభించాయి. రాష్ట్రంలో బియ్యం ప్రధాన ఉత్పత్తికావున దీనిని "రైస్ బౌల్ ఆఫ్ ఇండియా" అని కూడా పిలుస్తారు. భారతదేశ శాస్త్రీయ భాషలలో ఒకటైన తెలుగు దీని అధికార భాష. ఇది అత్యధికంగా మాట్లాడే భాషలలో భారతదేశంలో నాలుగవ స్థానంలో, ప్రపంచంలో పదకొండవ స్థానంలో వుంది. క్రీ.పూ 8 వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరేయ బ్రాహ్మణ ప్రకారం, ఆంధ్రుల చరిత్ర వేదకాలంతో మొదలవుతుంది. ఆంధ్రులు ఉత్తర భారతదేశం లో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలియవస్తుంది. (ఇంకా…) |