వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 47వ వారం

మంగళూరు

మంగళూరు నగరం కర్ణాటక రాష్ట్ర ప్రధాన నగరాలలో ఒకటి. ఇందులో ఒక నౌకాశ్రయము కూడా ఉంది. ఈ నగరం భారత దేశ పశ్చిమాన అరేబియా సముద్ర తీరంలో పశ్చిమ కనుమలకు పశ్చిమాన ఉంది. మంగళూరు దక్షిణ కన్నడ జిల్లా రాజధాని, అధికార పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి, దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైరుతి దిక్కులో ఉంది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి, గుర్‌పుర్‌ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్‌ తీరంలో మంగళూరు ఒక భాగము. మంగళూరు దేవాలయాలకు, సముద్ర తీరాలకు, పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, విద్యాసంస్థలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంగళూరు పట్టణంలో బహు భాషలు వాడుకలో ఉంటాయి. రాష్ట్ర భాషైన కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాషైన తుళు, కేరళకు సరిహద్దులో ఉండడం వల్ల మళయాళం, కొంకణి జనాభా కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంకణి భాషలు వాడుకలో ఉంటాయి. ఈ ప్రాంతీయ భాషలే కాకుండా, దేశ భాష హిందీ, ఆంగ్లం కూడా ప్రజలు మాట్లాడగలరు. నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో ఉంది.
(ఇంకా…)