వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 51వ వారం

బ్లాక్ హోల్

బ్లాక్ హోల్ (కాలబిలం) అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్‌టైమ్ ప్రాంతం. ఎంత బలమైన గురుత్వాకర్షణ అంటే, దాని ఆకర్షణ నుండి, ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ, దాని నుండి తప్పించుకోలేవు. ఏదైనా ద్రవ్యరాశి తగినంత సాంద్రతతో ఉంటే, స్పేస్‌టైమ్‌ను వంచి, బ్లాక్ హోల్ ను ఏర్పరుస్తుందని సాధారణ సాపేక్షతా సిద్ధాంతం ఊహించింది. తిరిగి వెనక్కి రాలేని ఆ ప్రాంతపు సరిహద్దును ఈవెంట్ హొరైజన్ అంటారు. ఈవెంట్ హొరైజన్ను దాటిన వస్తువు గతి, దాని పరిస్థితులపై ఈవెంట్ హొరైజన్ విపరీతమైన ప్రభావాన్ని చూపినప్పటికీ, స్థానికంగా గుర్తించదగిన లక్షణాలేమీ గమనించలేం. అనేక విధాలుగా, బ్లాక్ హోల్ కూడా ఒక ఆదర్శవంతమైన బ్లాక్ బాడీ లాంటిదే. బ్లాక్ బాడీ లాగానే ఇది కూడా కాంతిని ప్రతిబింబించదు. అంతేకాకుండా, ఈవెంట్ హొరైజన్లు హాకింగ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయని క్వాంటం ఫీల్డ్ థియరీ ఊహించింది. ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉండే ఉష్ణోగ్రత వద్ద ఉన్న బ్లాక్ బాడీ విడుదల చేసే రేడియేషన్ ఏ స్పెక్ట్రమ్‌లో ఉంటుందో, ఆ స్పెక్ట్రమ్‌లోనే ఈ రేడియేషన్ ఉంటుంది. నక్షత్ర స్థాయి ద్రవ్యరాశి (స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్) ఉండే బ్లాక్ హోల్‌లకు ఈ ఉష్ణోగ్రత ఒక కెల్విన్ లో వందల కోట్ల వంతు ఉంటుంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రత వలన దీన్ని గమనించడం అసాధ్యం.
(ఇంకా…)