వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 04వ వారం

ఆజాద్ హింద్ ఫౌజ్

ఆజాద్ హింద్ ఫౌజ్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆగ్నేయాసియాలో 1942 సెప్టెంబరు 1 న భారతీయ స్వాతంత్ర్య యోధులు, జపాన్ సామ్రాజ్యం కలిసి ఏర్పాటు చేసిన సాయుధ శక్తి. బ్రిటిషు పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం దీని లక్ష్యం. రెండవ ప్రపంచ యుద్ధపు ఆగ్నేయాసియా యుద్ధరంగంలో జరిగిన యుద్ధంలో ఇది జపాను సైనికులతో కలిసి పోరాడింది. ఈ సైన్యాన్ని మొదట 1942 లో రాస్‌ బిహారి బోస్‌ నేతృత్వంలో భారతీయ యుద్ధ ఖైదీలు స్థాపించారు. ఈ యుద్ధఖైదీలు, మలయా, సింగపూర్ యుద్ధాల్లో జపాను వారు పట్టుకున్న బ్రిటిషు భారతీయ సైన్యానికి చెందిన సైనికులు. ఆసియాలో జరిగిన యుద్ధంలో జపాను పాత్రపై ఫౌజు నాయకత్వానికి, జపాను మిలిటరీకీ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఈ మొదటి ఫౌజు కూలిపోయింది. అదే సంవత్సరం డిసెంబరులో దాన్ని రద్దు చేసారు. రాష్ బిహారీ బోసు ఫౌజును సుభాష్ చంద్రబోసుకు అప్పగించాడు. 1943 లో ఆగ్నేయాసియాకు వచ్చిన సుభాష్ చంద్రబోసు, దీన్ని పునరుద్ధరించాడు. సైన్యం బోసు స్థాపించిన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి చెందిన సైన్యంగా ప్రకటించారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, తన పేరు మీదుగా INA బ్రిగేడ్‌లు/రెజిమెంట్‌లకు పేర్లు పెట్టాడు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు మీద ఒక మహిళా రెజిమెంటును కూడా నెలకొల్పాడు. బోసు నాయకత్వంలో, మలయా (ప్రస్తుత మలేషియా), బర్మాలోని భారతీయ ప్రవాస జనాభా నుండి వేలాది మంది పౌర వాలంటీర్లు, మాజీ ఖైదీలూ ఫౌజులో చేరారు. ఈ రెండవ INA బ్రిటిషు, కామన్వెల్త్ దళాలకు వ్యతిరేకంగా ఇంపీరియల్ జపాను సైన్యంతో కలిసి బర్మాలో జరిగిన యుద్ధాల్లో పోరాడింది. తొలుత ఇంఫాల్, కోహిమాల్లోను, ఆ తరువాత మిత్రరాజ్యాలు బర్మాను తిరిగి స్వాధీనం చేసుకున్నపుడు వారికి వ్యతిరేకంగానూ పోరాడింది.
(ఇంకా…)