వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 08వ వారం

మద్రాసు రాష్ట్రం

20 వ శతాబ్దం మధ్యలో మద్రాసు రాష్ట్రం భారతదేశ రాష్ట్రాల్లో ఒకటి. భారత స్వాతంత్ర్యానికి మునుపు బ్రిటిష్ ఏలుబడిలో మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్న ఇది తర్వాత మద్రాస్ ప్రావిన్సుగా మారింది. 1950 లో అది ఏర్పడిన సమయంలో, ప్రస్తుత తమిళనాడు మొత్తం, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర కేరళలోని మలబార్ ప్రాంతం, దక్షిణ కెనరాలోని బళ్లారి ఇందులో భాగంగా ఉండేవి. తీరప్రాంత ఆంధ్ర, రాయలసీమలు విడిపోయి, 1953 లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడగా, దక్షిణ కెనరా, బళ్లారి జిల్లాలను మైసూర్ రాష్ట్రంతో, మలబార్ జిల్లాను ట్రావెన్కోర్-కొచ్చిన్ రాష్ట్రంలో విలీనం చేసి 1956 లో కేరళను ఏర్పాటు చేశారు. 1969 జనవరి 14 న మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చారు.

ఒ.పి. రామస్వామి రెడ్డియార్ మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధానిగా 1949 వరకు ఉన్నాడు. ఈయన నేతృత్వంలో ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం కల్పించే చట్టం చేశాడు. దేవదాసి వ్యవస్థ రద్దుకు కూడా చట్టాన్ని అమలు చేశారు. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడ్డ తర్వాత మద్రాసు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కుమారస్వామి రాజా 1952 దాకా పనిచేశాడు. 1952 ఎన్నికల్లో సి. రాజగోపాలాచారి శాసనసభకు ఎన్నికవకపోయినా శాసనమండలికి నామినేట్ అయి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన హయాంలోనే పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను మొదట్లో వ్యతిరేకించిన జవహర్ లాల్ నెహ్రూ శ్రీరాములు మరణంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఒప్పుకున్నాడు కానీ మద్రాసును అందులో కలపడానికి ఒప్పుకోలేదు. 1953 అక్టోబరు 1 న మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడివడింది. 1954 లో కె. కామరాజ్ మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన తర్వాత వచ్చిన భక్తవత్సలం మొదలియార్ మద్రాస్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి. 1969లో ఇది తమిళనాడు రాష్ట్రంగా మారింది.
(ఇంకా…)