వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 13వ వారం

మ్యూనిక్ ఒప్పందం

మ్యూనిక్ ఒప్పందం జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రెంచి థర్డ్ రిపబ్లిక్, ఇటలీ రాజ్యాల మధ్య 1938 సెప్టెంబరు 30 న మ్యూనిక్‌లో ముగిసిన ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం చెకోస్లోవేకియా లోని సుడేటన్‌ల్యాండ్ భూభాగం జర్మనీకి ధారాదత్తమైంది. ఫ్రాన్స్, చెకోస్లోవాక్ రిపబ్లిక్ ల మధ్య 1924 నాటి కూటమి ఒప్పందం, 1925 నాటి సైనిక ఒప్పందాలు ఉన్నప్పటికీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో చెక్‌ ప్రజలు దీన్ని మ్యూనిక్ ద్రోహం అని అన్నారు. మ్యూనిక్ ఒప్పందం కుదరడంతో ఐరోపాలో చాలా భాగం సంబరాలు జరుపుకుంది. ఈ ఒప్పందం, ఖండంలో ఒక పెద్ద యుద్ధాన్ని నివారించిందని భావించారు. చెకొస్లవేకియా సరిహద్దు ప్రాంతంలో, 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు - ముఖ్యంగా జర్మన్లు - నివసించే సుడేటన్‌ల్యాండ్‌ను జర్మనీ ఆక్రమించేందుకు నాలుగు దేశాలూ అంగీకరించాయి. ఐరోపాలో భూభాగాల గురించి ఇదే తన చివరి దావా అని హిట్లర్ ప్రకటించాడు.

1938 సెప్టెంబరు 17 న చెకోస్లోవేకియాపై జర్మనీ స్వల్ప స్థాయి అప్రకటిత యుద్ధాన్ని ప్రారంభించింది. ప్రతిస్పందనగా, సెప్టెంబరు 20 న యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌లు చెకోస్లోవేకియాను తన భూభాగాన్ని జర్మనీకి అప్పగించమని అధికారికంగా కోరాయి. దీని తరువాత, సెప్టెంబరు 21 న పోలండు, సెప్టెంబరు 22 న హంగరీలూ చెక్‌ భూభాగంపై తమతమ డిమాండ్లను లేవనెత్తాయి. ఇంతలో, జర్మన్ దళాలు చెబ్ జిల్లా, జెసెనక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలనూ జయించాయి. కాని డజన్ల కొద్దీ ఇతర సరిహద్దు కౌంటీల నుండి వారికి ప్రతిఘటన ఎదురై, వెనక్కు తగ్గాల్సి వచ్చింది. పోలాండ్ తన సైనిక విభాగాలను చెకోస్లోవేకియాతో సరిహద్దుకు సమీపంలో సమూహపరిచింది. సెప్టెంబరు 23 న ఒక విఫల కుట్రకు ప్రేరేపించింది. హంగరీ కూడా తన సైనికులను చెకోస్లోవేకియా సరిహద్దు వైపు తరలించింది కానీ దాడి చెయ్యలేదు.

1938 సెప్టెంబరు 29-30 న జర్మనీలోని మ్యూనిక్‌లో ప్రధాన యూరోపియన్ శక్తుల అత్యవసర సమావేశం జరిగింది. ఆ సమయంలో చెకోస్లోవేకియా ప్రతినిధులు పట్టణం లోనే ఉన్నప్పటికీ వాళ్ళు ఆ సమావేశంలో లేరు. ఫ్రాన్స్, చెకోస్లోవేకియాల మిత్రదేశమైన సోవియట్ యూనియన్ కూడా ఆ సమావేశంలో లేదు. హిట్లర్ కోరుకున్న విధంగా తయారైన ఒక ఒప్పంద పత్రంపై జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ నాయకులు ఆ సమావేశంలో సంతకాలు చేసారు. జర్మనీని ప్రసన్నం చేసుకోవడానికి గాను దానికి ధారాదత్తం చేసిన చెకోస్లోవాక్ పర్వత సరిహద్దు భూభాగం మధ్యయుగ కాలం నుండి చెక్, జర్మనీల మధ్య సహజమైన సరిహద్దుగా ఉంది. అంతేకాదు, చెక్‌పై జర్మనీ దాడి చేస్తే, ఇది దానికి సహజమైన అడ్డుగోడగా ఉంది. సరిహద్దు దుర్గాలను నిర్మించి గణనీయంగా బలోపేతం చేసుకున్న సుడటన్లాండ్ ప్రాంతం చెకోస్లోవేకియాకు వ్యూహాత్మకంగా చాలా ప్రముఖమైనది.

జర్మనీ, పోలాండ్, హంగేరీల సైనిక ఒత్తిడికి, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్సుల దౌత్యపరమైన ఒత్తిడికీ చెకోస్లోవేకియా లొంగిపోయి, మ్యూనిక్ నిబంధనల ప్రకారం జర్మనీకి తన భూభాగాన్ని వదులుకోవడానికి సెప్టెంబరు 30 న, అంగీకరించింది. అప్పుడు, అక్టోబరు 1 న, పోలండు చేసిన భూభాగ డిమాండ్లను కూడా చెకోస్లోవేకియా అంగీకరించింది.
(ఇంకా…)