వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 16వ వారం

పాంగోంగ్ సరస్సు

పాంగోంగ్ త్సో లేదా పాంగోంగ్ సరస్సు తూర్పు లడఖ్ లోను, పశ్చిమ టిబెట్ లోనూ విస్తరించి ఉన్న భాష్పీభవన సరస్సు. త్సో అంటే టిబెటన్ భాషలో సరస్సు అని అర్థం. ఇది సముద్ర మట్టం నుండి 4,225 మీటర్ల ఎత్తున ఉన్న ఈ సరస్సు పొడవు 134 కిలోమీటర్లు. ఇది, పాంగోంగ్ త్సో, త్సో న్యాక్, రమ్ త్సో (జంట సరస్సులు), న్యాక్ త్సో అనే ఐదు ఉప సరస్సు‌లుగా విభజించబడి ఉంటుంది. మొత్తం సరస్సు పొడవులో సుమారు 50% టిబెట్ పరిధిలోను, 40% లడఖ్‌లోనూ ఉంది. మిగతాది భారత చైనాల మధ్య వివాదంలో ఉంది ఈ భాగం చైనా నియంత్రణలో ఉంది. ఈ సరస్సు అత్యధిక వెడల్పు 5 కిలోమీటర్లు. మొత్తమ్మీద దీని వైశాల్యం 604 చ.కి.మీ. ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ శీతాకాలంలో ఇది పూర్తిగా గడ్డకడుతుంది. చిన్న శిఖరం దీన్ని సింధు నదీ పరీవాహక ప్రాంతం నుండి వేరు చేస్తుంది. దీని పరీవాహక ప్రాంతం భూ పరివేష్టితమై ఉంటుంది. చరిత్రపూర్వ కాలంలో ఇది సింధు నది పరీవాహక ప్రాంతంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు. రామ్‌సార్ కన్వెన్షన్ కింద ఈ సరస్సును అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన తడి నేలగా గుర్తించే పని జరుగుతోంది. అది పూర్తైతే, ఈ కన్వెన్షన్ కింద దక్షిణ ఆసియాలో సరిహద్దులకు ఇరువైపులా విస్తరించి ఉన్న తడి నేలలో ఇదే మొదటిది అవుతుంది.
(ఇంకా…)