వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 21వ వారం

శ్రీకాకుళం ఉద్యమం

శ్రీకాకుళం ఉద్యమం 1958లో ప్రారంభమైనది. ఈ శ్రీకాకుళం గిరిజన సంఘం అనేక పోరాటాల్లో రాటుదేలి అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. పాలకొండ ఏజెన్సీ, సీతంపేటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండ అనే గిరిజన గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పల్లె రాములు మాస్టారు ఆ కాలంలో గిరిజన గ్రామాల్లో ప్రజలపై భూస్వాములు చేస్తున్న దోపిడీని చూసి చలించిపోయాడు. గిరిజనులను చైతన్యపర్చడం ప్రారంభించాడు. అప్పటికే పాలకొండలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న హయగ్రీవరావు, పత్తిరాజుతో కలిసి ఊరూరా గిరిజన సంఘాలు ఏర్పాటు చేశాడు. కమ్యూనిస్టు పార్టీని గిరిజన ప్రాంతానికి విస్తరింప చేశాడు. గిరిజనులను తొలుత సంఘాల్లో చేర్పించేందుకు నీళ్లదార ప్రమాణం చేయించేవారు. గ్రామంలో ఆడ, మగ పిల్లలందరీతో సమావేశపర్చి నీళ్లధార వదిలి, గడ్డిపూచ తుంచి వారిచే ప్రమాణం చేయించేవారు. అప్పటినుండి వాళ్లు సంఘంలో సభ్యులైనట్లే. అలా ప్రారంభమైన గిరిజన సంఘాలు గ్రామగ్రామాన విస్తరించాయి. 1960నాటికి అంటే కేవలం రెండేళ్లకే జిల్లాలోని గిరిజన ప్రాంతమంతా ఎర్రజెండాపై గిరిజన సంఘం అని రాసి ఎగురవేయబడ్డాయి. సుందరయ్య డైరెక్షన్‌, నండూరి ప్రసాదరావు ప్రత్యక్ష సహకరాంతో ఉద్యమం నడిచింది. 1961లో మొట్టమొదటి గిరిజన సంఘం మహాసభను మొందెంఖల్లు లో అత్యంత జయప్రదంగా నిర్వహించారు. 4 వేలమందితో భారీ బహిరంగసభ జరిపారు. ఈ సభకు పార్టీ తరపున నండూరి ప్రసాదరావు హాజరైనాడు.
(ఇంకా…)