వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 22వ వారం
విల్లార్డ్ విగన్ |
---|
విల్లార్డ్ విగన్ (జ.1957) ఇంగ్లాండుకు చెందిన శిల్పకారుడు. ఈయన సూక్ష్మ శిల్పాలు తయారు చేయుటలో ప్రసిద్ధుడు. అతను తయారుచేసిన శిల్పాలను ఒక సూది బెజ్జంలో అమర్చవచ్చు. సూది చివర నిలబెట్టవచ్చు. ఒక శిల్పం ఎంత చిన్నదంటే 0.005 మి.మీ ఎత్తు ఉంటుంది. జూలై 2007 లో విల్లార్డ్ విగన్ తన కళా నైపుణ్యానికి, కళారంగానికి చేసిన సేవకు గానూ హె.ఆర్.హెచ్ ఛార్లెస్ వేల్స్ చే "ఎం.బి.ఇ" అవార్డు తో గౌరవించబడ్డాడు. అతను చేసిన శిల్పాలలో సూదిబెజ్జంలో తొమ్మిది ఒంటెలు, అంతే స్థలంలో ఒబామా కుటుంబం, ఇసుక రేణువుపై రథం మొదలైన సూక్ష్మ శిల్పాలు ఉన్నాయి.
తన బాల్యంలో పాఠశాలలో పాఠ్యాంశాలను ధారాళంగా చదవలేకపోయేవాడు. ఈ కారణంగా తన తరగతిలో సహచరులు అతన్ని ఎగతాళి చేసేవారు. ప్రాథమిక పాఠశాలలో గురువులు కూడా తన మందబుద్ధి కారణంగా అపహాస్యం చేసేవారు. విగన్ తన ఐదవ సంవత్సరం నుండి శిల్పకళ పట్ల ఆకర్షితుడయ్యాడు. తన పాఠశాలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల ఎగతాళిని తప్పించుకొనుటకు పాఠశాలకు వెళ్ళకుండా శిల్పాలు తయారుచేయుట ప్రారంభించాడు. అతడు ప్రపంచంలో ఏదీ సాధ్యం కానిది లేదని, ప్రజలు తన పనిని చూడలేనంత చిన్నగా ఉండాలని తన శిల్పాలపై విమర్శలు చేయకుండా ఉండాలని అతిచిన్న శిల్పాలను చేయడం ప్రారంభించాడు. శిల్పాలు ఎంత చిన్నవంటే వాటిని సూక్ష్మ దర్శిని ద్వారానే చూడగలము.
|