వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 49వ వారం

బాకు నగరం

బాకు నగరం అజర్‌బైజాన్ దేశ రాజధాని. కాస్పియన్ సముద్ర తీరంలో వున్న ఈ పారిశ్రామిక నగరం, సముద్ర మట్టానికి  28 మీటర్లు దిగువన ఉంది. దేశంలోనే  అతి పెద్ద ఓడరేవు, ఏకైక మెట్రోపోలిటిన్ సిటీ అయిన బాకు, అటు కాస్పియన్ సముద్ర తీరప్రాంతం లోను, ఇటు కాకసస్ పర్వత ప్రాంతంలోను విస్తరించిన నగరాలన్నిటిలో కూడా అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. 2021 అంచనాల ప్రకారం ఈ నగర జనాభా 23,71,000. ఈ నగరం, అజర్‌బైజాన్ శాస్త్రీయ, సాంస్కృతిక, ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా వుంది. ఇక్కడ నెలకొనివున్న కఠిన వాతావరణం, సంవత్సరం పొడుగునా వీచే ఉధృతమైన గాలుల కారణంగా ఈ నగరానికి "విండ్స్ నగరం" అనే పేరు స్థిరపడింది. ఈ నగరాన్ని బాకీ లేదా బాకే అని కూడా పిలుస్తారు.

బాకు ఆర్థిక వ్యవస్థకు మూలాధారం పెట్రోలియం. చమురు ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ నగరం, ప్రపంచంలోని అతి పురాతన చమురు ఉత్పత్తి ప్రాంతంగా కూడా పేరుపొందింది. 20 వ శతాబ్దం ప్రారంభం నాటికి బాకు చమురు క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్దది, ఒక విధంగా చెప్పాలంటే ఈ నగర చరిత్ర పెట్రోలియం అదృష్టంతో ముడిపడివుంది. ఇక్కడ జరిగిన చమురు విజృంభణ, ఈ నగరాభివృద్ధికి దోహదపడటమే కాక యావత్ దేశ రూపు రేఖలను సైతం మార్చివేసింది. చమురు ప్రాసెసింగ్‌తో పాటు, చమురు పరిశ్రమ కు సంబంధించిన పరికరాల ఉత్పత్తికి ఈ నగరం ఒక పెద్ద కేంద్రం.
(ఇంకా…)