వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 01వ వారం

రామావతారము

రామావతారము త్రేతాయుగములోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖుడు. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలున్నాయి. భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు, సంబంధిత గ్రంథాలు, జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడు వ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణ కర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని, ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది. ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి కంబర్ వ్రాసిన కంబరామాయణము; 16వ శతాబ్దికి చెందిన తులసీదాస్ రచన రామచరిత మానసము.
(ఇంకా…)