వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 06వ వారం

చార్లెస్ డార్విన్

చార్లెస్ రాబర్ట్ డార్విన్ (1809 ఫిబ్రవరి 12, – 1882 ఏప్రిల్ 19) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది. డార్విన్, ఒక ప్రకృతి శాస్త్రవేత్తగా, జియాలజిస్టుగా, బయాలజిస్టుగా, రచయితగా ప్రసిద్ధుడు. ఒక వైద్యుని వద్ద సహాయకుడిగాను, రెండేళ్ళ పాటు వైద్య విద్యార్థిగాను ఉన్న డార్విన్, ఆధ్యాత్మిక విద్య చదువుకున్నాడు. జంతు చర్మాల్లో గడ్డి లాంటి వాటిని కూరి వాటిని బ్రతికున్నవి లాగా కనబడేలా చేసే పనిలో శిక్షణ పొందాడు. ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయంపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు తమ ఉమ్మడి పూర్వీకుల నుంచి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయని డార్విన్ వివరించాడు. ఈ సిద్ధాంతం సర్వత్రా ఆమోదం పొందింది. విజ్ఞాన శాస్త్రంలో ఇది ఒక మౌలికమైన భావనగా భావిస్తారు. ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్‌ తో కలసి ప్రచురించిన పరిశోధనా పత్రంలో అతను, తన శాస్త్రీయ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం, ప్రకృతివరణం అని పిలిచే ఒక ప్రక్రియ వల్ల ఈ శాఖలుగా చీలడం జరుగుతూ వచ్చింది. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలను వ్యతిరేకించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి ఒక రకమైన తోక లేని కోతి (వాలిడి) జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది.
(ఇంకా…)