వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 11వ వారం

ఐరోపా సమాఖ్య

యూరోపియన్ యూనియన్ (ఇయు) ప్రధానంగా ఐరోపాలో ఉన్న 27 సభ్య దేశాల రాజకీయ, ఆర్థిక సమాఖ్య. దీని సభ్యదేశాల మొత్తం విస్తీర్ణం 42,33,255 చ.కి.మీ. మొత్తం జనాభా 44.7 కోట్లు. ఇయు ప్రామాణికమైన చట్టాల ద్వారా అన్ని సభ్య దేశాలలో అంతర్గత సింగిల్ మార్కెట్‌ను అభివృద్ధి చేసింది. సభ్యులు ఏ అంశాలపై కలిసి పనిచెయ్యాలని అనుకున్నారో ఆ అంశాలపై మాత్రమే ఈ చట్టాలు చేస్తారు. ఈ అంతర్గత మార్కెట్లో ప్రజలు, వస్తువులు, సేవలు, మూలధనం స్వేచ్ఛగా కదిలేలా చూడడం ఇయు విధానాల లక్ష్యం. న్యాయ, అంతర్గత రక్షణ వ్యవహారాలలో చట్టాన్ని రూపొందించడం, వాణిజ్యం, వ్యవసాయం, మత్స్యకార, ప్రాంతీయ అభివృద్ధిపై కామన్ విధానాలను ఏర్పరచడం కూడా ఇయు విధానాల లక్ష్యం. షెంజెన్ ప్రాంతంలో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ నియంత్రణలు రద్దు చేసారు. 1999 లో ఒక ద్రవ్య యూనియన్‌ను స్థాపించారు. ఇది 2002 లో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఇందులో ఉన్న 19 సభ్య దేశాలు యూరో కరెన్సీని వాడతారు. 1993 లో మాస్ట్రిక్ట్ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇయు, యూరోపియన్ పౌరసత్వం ఉనికి లోకి వచ్చాయి. ఇయు మూలాలు యూరోపియన్ బొగ్గు, ఉక్కు సంఘం (ECSC), యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (EEC) లలో ఉన్నాయి. 1951 పారిస్ ఒప్పందం, 1957 రోమ్ ఒప్పందం ద్వారా పై సంఘాలు ఏర్పడ్డాయి.
(ఇంకా…)