వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 12వ వారం

అతడు అడవిని జయించాడు

అతడు అడవిని జయించాడు, డా. పి. కేశవరెడ్డి రాసిన తెలుగు నవల. మొదట 1984 లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. నవలగా 1985 లో తొలిసారి విజయవాడ నవోదయ పబ్లిషర్స్‌ సంస్థ ప్రచురించింది. ఆ తరువాత పలు సంస్థలు ఈ నవలను ప్రచురించాయి. పరిమాణం రీత్యా చిన్న నవల అయిన దీన్ని నవలిక అనవచ్చు. నేషనల్ బుక్ ట్రస్టు వారు ఈ నవలను 14 భారతీయ భాషల్లోకి అనువదింపజేసి ప్రచురించారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దీన్ని రేడియో నాటకంగా ప్రసారం చేసింది. ఇద్దరు తెలుగు సినిమా దర్శకులు ఈ నవలను సినిమాగా రూపొందించాలని సంకల్పించారు. అడవిని, అందులోని చెట్లు, మొక్కలు, తీగలు, జంతువులు, పక్షులు మొదలైనవాటిని, వాటి స్వభావాలను, ప్రవర్తనలనూ సవివరంగా వర్ణించడం ఈ నవల ప్రత్యేకత. రచయిత స్వయంగా అడువుల్లో సన్నిహితంగా జీవించి ఉంటే తప్ప, ఇంత విపులంగా రాయడం సాధ్యం కాదని కొందరు అన్నారు. అదే విషయాన్ని నిజామాబాదు ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగినపుడు కేశవరెడ్డి, "ఈ ప్రశ్న చాలామంది అడిగారు. దాన్లో అంత గొప్పేముంది అని అనిపిస్తుంది. చిన్నప్పటినుండి మా పొలాల్లో తిరిగినవాణ్ణి. అక్కడే అనేక జంతువులు పక్షులనూ చూసాను, ఆ అనుభవాలను అడవికి అన్వయించాను, అంతే" అన్నాడు. పుస్తకంలో కథనపు భాష శైలి పత్రికా భాష లోనే సాగుతుంది. నిరక్షరాస్యుడైన ముసలివాని మాటలు, సహజం గానే, చిత్తూరు జిల్లా మాండలికంలో ఉంటాయి. అయితే ముసలివాని స్వగతం ఆ మాండలికంలో కాక, ప్రామాణికమైన పత్రికా భాష లోనే సాగుతుంది. అతడు అంతరంగంలో అనుకునే మాటలు అతని యాసలో కాకుండా ప్రౌఢమైన భాషలో ఉన్నాయెందుకు అనే వ్యాఖ్యకు సమాధానంగా కేశవరెడ్డి, "ముసలివాడు బయటికి చెప్పే మాటలు కావవి, అవి నిశ్శబ్ద సంభాషణలు, కేవలం ఆలోచనలే. ఆలోచనలకు భాషేమీ ఉండదు", అని చెప్పాడు.
(ఇంకా…)