వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 16వ వారం

బ్రిటిషు భారతదేశంలో వెట్టి చాకిరీ వ్యవస్థ

భారతీయ వెట్టి చాకిరీ వ్యవస్థ బ్రిటిషు వారు 19 వ శతాబ్దంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన నిర్బంధ కార్మిక వ్యవస్థ. ఒక పరిమిత కాలానికి చేసుకునే ఒప్పందం ప్రకారం కార్మికులు పనిచేస్తారు కాబట్టి దీన్ని ఒప్పంద కార్మిక వ్యవస్థ అనే వారు. ఒక పరిమిత కాలం పాటు సాగే బానిసత్వం లాంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో పదహారు లక్షలకు పైబడిన సంఖ్యలో భారతీయులను శ్రామికులుగా వివిధ ఐరోపా వలస రాజ్యాలకు రవాణా చేశారు. బ్రిటిషు సామ్రాజ్యంలో 1833 లోను, ఫ్రెంచ్ వలస దేశాల్లో 1848 లోను, డచ్ సామ్రాజ్యంలో 1863 లోనూ బానిసత్వాన్ని నిర్మూలించిన తర్వాత ఈ వ్యవస్థ విస్తరించింది. ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ 1920ల వరకు కొనసాగింది. ఈనాడు కరిబియన్ దేశాలు, నాటల్ (దక్షిణాఫ్రికా), తూర్పు ఆఫ్రికా, మారిషస్, శ్రీలంక, మలేషియా, మయన్మార్, ఫిజీ వంటి దేశాల్లో ప్రవాస భారతీయ సమాజం ఉందంటే దానికి మూలం ఈ కార్మిక వ్యవస్థే. ఇండో-కరిబియన్, ఇండో-ఆఫ్రికన్, ఇండో-ఫిజియన్, ఇండో-మలేషియన్, ఇండో-సింగపూర్ జనాభా పెరుగుదలకూ ఈ వ్యవస్థే దోహదం చేసింది. ఈ వ్యవస్థలో ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులను హీనంగా కూలీ అని పిలిచేవారు. వివిధ వలస దేశాల్లో వారి పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉండేవి. వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. ఒప్పందంలో నియమాలు ఉన్నప్పటికీ వాటిని పాటించేవారు కాదు. ఒప్పంద కాలపరిమితి తీరిపోయాక కూడా ఏదో విధంగా వాళ్లను వెనక్కి పోనీయకుండా నిర్బంధంగా అక్కడే ఉంచేలా యజమానులు కుటిల ప్రయత్నాలు చేసేవాళ్ళు.
(ఇంకా…)