వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 25వ వారం

జిడ్డు కృష్ణమూర్తి

జిడ్డు కృష్ణమూర్తి (11 మే 1895 - 17 ఫిబ్రబరి 1986) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు. ఈయనను చార్లెస్ లెడ్ బీటర్, అనీబిసెంట్ దివ్యజ్ఞాన సాంప్రదాయ ప్రకారం పెంచారు. ఆయన ఒక విశ్వ గురువుగా సమాజంలో జ్ఞానోదయానికి బాటలు వేస్తాడని భావించారు. 1922 నుంచి ఆయనను జీవిత గమనాన్ని మార్చిన అనేక సంఘటనలు, ఆధ్యాత్మిక అనుభవాల వల్ల కృష్ణమూర్తి తనపై మోపిన బాధ్యతను తిరస్కరించాడు. నెమ్మదిగా దివ్యజ్ఞాన సమాజం నుంచి వెలుపలికి వచ్చేశాడు. తర్వాత విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఆధ్యాత్మికం, సామాజిక విషయాల గురించి అనేక ప్రసంగాలు చేశాడు. ప్రతి ఒక్కరు ప్రవక్త, మతం, తత్వాలు మొదలైన వాటిని దాటి ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండాలని ఉద్బోధించాడు.

కృష్ణమూర్తి తన మిగిలిన జీవితాన్ని ప్రపంచ పర్యటనలు చేస్తూ, చిన్న పెద్ద జన సమూహాలతో మాట్లాడుతూ గడిపాడు. చాలా పుస్తకాలు రాశాడు. వాటిలో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ (1954), కృష్ణమూర్తి నోట్‌బుక్ (1976) ముఖ్యమైనవి. ఆయన ప్రసంగాలు, సంవాదాలు చాలావరకు ప్రచురింపబడ్డాయి. ఆయన చివరి ప్రసంగం చనిపోవడానికి ఒక నెల ముందు 1986 జనవరి నెలలో అమెరికాలోని ఓహై లోని తన ఇంటిలో జరిగింది. ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. ఆయన అనుయాయులు కొంతమంది ఆయన పేరు మీదుగా భారతదేశం, అమెరికా, బ్రిటన్ దేశాలలో స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు నడుపుతున్నారు. ఇవి ఆయన భావాలను, రచనలను వివిధ భాషల్లో, వివిధ మాధ్యమాల రూపంలో ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నాయి.
(ఇంకా…)