వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 40వ వారం

మహాత్మా గాంధీ

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. చిన్నతనమునుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరిబాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ). చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. పోర్ బందర్ లోను, రాజ్‌కోట్ లోను అతను చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము అతను మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు.
(ఇంకా…)