వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 35వ వారం

అయోధ్య వివాదం

అయోధ్య వివాదం భారతదేశంలో రాజకీయ, చారిత్రక, సామాజిక, మతపరమైన వివాదం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలోని ఒక స్థలంపై కేంద్రీకృతమై ఉంది. కనీసం 18వ శతాబ్దం నుండి హిందువులు తమ ఆరాధ్య దైవం రాముని జన్మస్థలంగా పరిగణిస్తున్న స్థలం ఇది. ఆ ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదు చరిత్ర, దాని స్థానం, అక్కడ హిందూ దేవాలయం ఉండేదా, మసీదును నిర్మించేందుకు దాన్ని కూల్చేసారా అనే దాని చుట్టూ సమస్య తిరిగింది. బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశం రామ జన్మస్థలంగా చెప్పబడుతోందనేందుకు ఆధారాలు కనీసం 1822 నుండి ఉన్నాయి. ఫైజాబాద్ కోర్టులో సూపరింటెండెంట్ అయిన హఫీజుల్లా 1822లో కోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో అతను, "బాబరు చక్రవర్తి స్థాపించిన మసీదు, రాముడి జన్మస్థలం వద్ద ఉంది" అని పేర్కొన్నాడు. 1855లో స్థానిక ముస్లింలు సమీపంలోని హనుమాన్ గఢీ దేవాలయం పూర్వపు మసీదు స్థలంలో నిర్మించబడిందని భావించారు. ఆ ఆలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు, ఫలితంగా హింసాత్మక ఘర్షణలు జరిగి అనేక మంది ముస్లింల మరణానికి దారితీశాయి. 1857 లో, బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ జన్మస్థలం అనుకునే స్థలంలో ఒక చబుత్రాను (వేదిక) నిర్మించారు. ఈ వివాదం పర్యవసానంగా 1885 లో బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ జన్మస్థలానికి గుర్తుగా భావించే చబుత్ర చుట్టూ ఆలయాన్ని నిర్మించనీయాలని అభ్యర్థిస్తూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ స్థలంపై హిందూ పక్షానికి యాజమాన్య హక్కులు లేవని పేర్కొంటూ తిరస్కరించబడింది.
(ఇంకా…)