వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 41వ వారం

ఆలీ (నటుడు)

ఆలీ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత. 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషిస్తుంటాడు. ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత దేవుడు మామయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. ప్రేమఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తో పాటు ఆలీ కూడా మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంద చాట అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు సినిమాల్లో వాడుకున్నారు. అటు పిమ్మట యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు.
(ఇంకా…)