వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 03వ వారం

కుటుంబం

కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు కుటుంబవ్యవస్థను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతు సమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది. "కుటుంబం"లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం. ఈ లక్షణాలు ఒకో సమాజంలో ఒకో విధంగా వర్తిస్తుంటాయి.కుటుంబవ్యవస్థకు ఉన్న ఒక ప్రాథమిక గుణం - శారీరకంగా గాని, సామాజికంగా గాని వ్యక్తులను (లేదా జీవులను) పునరుత్పత్తి చేయడం. కనుక కుటుంబంలో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి. పిల్లల పరంగా చూసినట్లయితే కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలు - పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం అనవచ్చును. అదే పెద్దల దృష్టినుండి చూసినట్లయితే జాతి పునరుత్పత్తి కుటుంబలక్ష్యంగా కనిపిస్తుంది.
(ఇంకా…)