వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 05వ వారం
గద్దర్ |
---|
గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు (1949 జనవరి 31 - 2023, ఆగస్టు 6) విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన "గదర్ పార్టీ" కు గుర్తుగా తీసుకోవడం జరిగింది. గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నాడు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వాడు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఆ తర్వాత అతను అనేక పాటలు రాసాడు. 1972 లో పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు జన నాట్య మండలి ఏర్పడింది.
|