వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/పబ్లిక్ డొమైన్
- పబ్లిక్ డొమైన్ వివరాలు
- పుస్తకాలు, ఫోటోలు, పెయింటింగ్స్, వ్యాసాలు, వీడియోలు, ఆడియోలు వంటి మానవ సృజన నుంచి పుట్టే కృతులకు సాధారణంగా సృష్టికర్తకు కాపీహక్కులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ సృష్టికర్త మరణానంతరం ఇవి వారి వారసులకు, ఇళ్ళు, కంపెనీలు తరహాలో సంక్రమిస్తాయి. అయితే ఆ కృతుల మీద ఎల్లకాలమూ వారికే హక్కులు ఉంటాయా? అలా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, వారి నుంచి మనవలకు తరతరాలుగా కాపీహక్కులనేవి సంక్రమిస్తూ ఉంటాయా?
- సంక్రమించవు. కాపీహక్కులు ఒక నిర్ణీత కాలం వరకే చెల్లుతాయి. దాన్నే కాపీరైట్ టరం అంటారు. ఆ గడువు తీరిపోగానే దానిపై కాపీహక్కుదారులకు ఉండే హక్కులు పోయి, ప్రజలందరి పరమైపోతాయి. అలా కావడాన్నే పబ్లిక్ డొమైన్ అంటారు.
- అయితే ఈ కాపీరైట్ టరం అన్నది ఎంతకాలం పాటు ఉంటుంది?
- సాధారణంగా ప్రతీ దేశానికి ఓ కాపీహక్కుల చట్టం ఉంటుంది. ఆ చట్టంలో ఆ దేశపు కృతులపై ఎవరికి, ఎంతకాలం పాటు కాపీహక్కులు ఉంటాయన్నది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కాపీహక్కుదారు మరణించిన నాటి నుంచి 25 సంవత్సరాల నుంచి 100 ఏళ్ళ దాకా, కొన్ని సందర్భాల్లో ప్రచురించిన 25 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ దాకా ఈ కాపీహక్కులు వర్తించవచ్చు.
- భారత కాపీహక్కుల చట్టాల ప్రకారం ఎన్నేళ్ళకు కాపీహక్కులు చెల్లిపోతాయి?
- భారత కాపీహక్కుల చట్టం 1957 (తదనంతరం దానికి జరిగిన సవరణలు) ప్రకారం సాహిత్య, నాటక రచనలకు, సంగీత నొటేషన్లకు, చిత్రకళా కృతులకు దాని సృష్టికర్త మరణించిన అరవై సంవత్సరాలు గడిచాకా తర్వాతి జనవరి 1 నాటికి చెల్లిపోతాయి.
- కృతికర్త పేరు తెలియని, కలంపేరుతో రాసి అసలు వ్యక్తి ఎవరో తెలియని కృతులు, కృతికర్త మరణానంతరం బయటకు వచ్చిన కృతులు, సినిమాలు, ఇతర వీడియో రికార్డింగులు, సౌండ్ రికార్డింగులు (పాటలు వగైరా దీనికిందకే వస్తాయి), ఫోటోగ్రాఫ్‌లు (ఈ క్రమంలో ఇంకా ఉన్నాయి, వివరంగా తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి) వంటివాటికి కాపీహక్కుల పరిధి వేరుగా ఉంటుంది. ఇలాంటి కృతులు మొట్టమొదట ప్రచురితమైన తేదీ నుంచి అరవై ఏళ్ళు లెక్కపెట్టి, వెంటనే వచ్చే జనవరి 1 నాటికి కాపీహక్కులు చెల్లిపోతాయని గమనించాలి.
- మిగిలిన దేశాల సంగతి ఏమిటి?
- ఆయా దేశాల కాపీహక్కుల పరిధి ఎంతెంత ఉందో తెలుసుకోవాలంటే ఈ జాబితా చూడండి.
- వికీపీడియాలో ఉపయోగం
వికీపీడియా, దాని సోదర ప్రాజెక్టులు కాపీహక్కుల విషయంలో ఎవరైనా ముందస్తు అనుమతులు అవసరం లేకుండా స్వేచ్ఛగా పంచుకుని, తిరిగి వినియోగించుకునే వీలుండే కృతులే సాధారణంగా వాడతాయి. ఇందువల్ల ఎవరికీ కాపీహక్కులు కానీ, అనుమతులు తీసుకోవాల్సిన అవసరం కానీ లేని కారణంగా పబ్లిక్ డొమైన్ కృతులు వికీపీడియాలో, సోదర ప్రాజెక్టుల్లో ఔచిత్యాన్ని బట్టి వాడుకోవచ్చు. లక్షలాది సంఖ్యలో పబ్లిక్ డొమైన్ కృతులు వికీమీడియా కామన్సులో ఉన్నాయి. వీటిలో ఫోటోలు, చిత్రాలు, వీడియోలు, ఆడియోలు, పుస్తకాలు వంటివి ఉన్నాయి. పై లెక్కలు చూసుకుని, ఒక కృతి పబ్లిక్ డొమైన్లో ఉంది - విజ్ఞానపరంగా వికీమీడియా ప్రాజెక్టులకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా కామన్సులో ఎక్కించవచ్చు.