వికీపీడియా:చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి

Be bold!
Be bold!

ముందుకు రండి

మార్చు

వ్యాసాలను సరిదిద్దే విషయమై చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరిస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే.


మీరు వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారు, తప్పులు చూసి ఉంటారు, "ఈ తప్పుల్ని ఎందుకు సరిదిద్దడం లేదో" అని మీరు అనుకునే ఉంటారు. ఈ తప్పుల్ని మీరే సరిదిద్దడానికి వికీపీడియా అనుమతించడమే కాదు, కోరుతున్నది కూడా. కాస్త మర్యాద ఉంటే చాలు. అది పని చేస్తుంది, మీరే చూస్తారుగా!


సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. అవసరమైతే సమూలమైన మార్పులు చెయ్యండి. ఆ వ్యాసకర్త ఏమనుకుంటాడో అని సందేహించకండి. అసలు వికీ అంటేనే అది.


మీ రచనలను కూడా ఇతరులు అలాగే సరిదిద్దుతారు. మరీ వ్యక్తిగతంగా తీసుకోకండి. మనలాగే వాళ్ళు కూడా వికీపీడియాను ఉత్తమంగా తీర్చిదిద్దాలనుకునే వారే.

...కానీ, నిర్లక్ష్యంగా ఉండకండి!

మార్చు

ముఖ్యంగా కొత్తవారు వికీపీడియా ఉదారతకు ముచ్చటపడి, వెంటనే కార్యరంగంలోకి దూకుతారు. మంచిదే! కానీ ఒక్క విషయం: చొరవగా, జంకు లేకుండా సరిదిద్దండి అంటే, వివాదాస్పద విషయాలపై ఇప్పటికే ఉన్న వ్యాసాలలో పెద్దపెద్ద మార్పులు చెయ్యమని కాదు. ఎన్నో దిద్దుబాట్లు, చర్చల తరువాత ఈ వ్యాసాలు ప్రస్తుతపు రూపుకు వచ్చి ఉంటాయి. ఆ పేజీల్లో అజాగ్రత్తగా చేసిన ఏ చిన్న మార్పైనా తేనె తుట్టెను కదిపినట్లయి, ఇతర సభ్యులు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంటుంది. కొట్టొచ్చినట్లు కనబడే వ్యాకరణ దోషాలను సరిదిద్దవచ్చనుకోండి.

ఏదైనా వివాదాస్పద వ్యాసంలో దిద్దుబాట్లు చెయ్యాలనుకుంటే, వ్యాసాన్ని క్షుణ్ణంగా చదివి, చర్చా పేజీలో ఉన్న అభిప్రాయాలు, పేజీ చరితాలను కూడా చదివిన తరువాతే చెయ్యడం మంచిది. దీనివలన ఆ వ్యాసం ఎలా ఏర్పడిందో, దాని ప్రస్తుత స్థితి ఏమిటో తెలుస్తుంది.

వ్యాసంలో పెద్ద మార్పులు చెయ్యదలచి కూడా, మీ మార్పులను ఇతరులు ఎలా స్వీకరిస్తారో అనే శంక మీకు ఉంటే, ఇలా చెయ్యవచ్చు:

  1. మార్పులు అవసరమైన భాగాన్ని కాపీ చేసి, చర్చాపేజీ లో పెట్టి, ఆ భాగంలో మీ అభ్యంతరాలేమిటో తెలియజేయండి. (విషయం ఒక వాక్యానికి అటూఇటూగా ఉంటే)
  2. చర్చా పేజీలో మీ అభ్యంతరాలను రాయండి.(అభ్యంతరాలున్న భాగం మరీ పెద్దది అయితే)

స్పందనల కొరకు ఓ నాల్రోజులు ఆగండి. ఎవరూ అభ్యంతరపెట్టకపోతే, కానివ్వండి. వ్యాసంలో పెద్ద ఎత్తున తొలగింపులు ఉంటే, తొలగించిన భాగాలను చర్చా పేజీలో పెట్టి, మీ వివరణ రాయండి. అలాగే, వివరమైన దిద్దుబాటు సారాంశాన్ని తప్పక పెట్టండి.

బెదిరిపోకండి!

మార్చు

ఏవో బహు కొద్ది వివాదాస్పద వ్యాసాలు తప్పించి మిగతా అన్ని వ్యాసాల్లో కూడా మీరు సరైనవనుకొన్న మార్పులు చెయ్యవచ్చు, చెయ్యండి. ఈ వివాదాస్పదమైన వ్యాసాలు తెలిసిపోతూనే ఉంటాయి. తెలియకపోయినా పరవాలేదు, మీకు చర్చలలో పాల్గొనే ఉత్సాహం, ఓపిక ఉంటే, చొరవగా ముందుకు వచ్చి దిద్దుబాట్లు చెయ్యండి. వివాదాస్పద వ్యాసంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి, మీరే మొదటి వారు కాదు, మీరే చివరివారూ కాదు. ఏదేమైనా, ఒకటి మాత్రం వాస్తవం: వ్యాసంలో నుండి ఏదన్నా విషయాన్ని తొలగించేదానికన్నా వ్యాసంలో చేర్చే కొత్త సమాచారాన్ని ఎక్కువ హర్షిస్తారు.

విస్తృతమైన ప్రభావాలుండే చర్యలు, దిద్దుబాట్లు

మార్చు

మూసలను సరిదిద్దడం, చాలా లింకులున్న పేజీలను తరలించడం వంటి పనులు చేసేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి: ఎందుకంటే, ఈ చర్యలు ఆయా పేజీలనే కాక ఎన్నో ఇతర పేజీలను కూడా ప్రభావితం చేస్తాయి. ఇటువంటి మార్పులు చేసేముందు, సంబంధిత మార్గదర్శకాలను చదవడం మంచిది. అలాగే, ఇటువంటి మార్పుల వలన ప్రభావితమైన పేజీలను సరిదిద్దడానికి సిద్ధపడటం మర్యాదకరమైన చర్య.

ఇంకా చూడండి

మార్చు