వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/అనువాద పరికరం
ఇతర భాషల వికీపీడీయాల్లోని వ్యాసాలను తెలుగు లోకి అనువదించేందుకు తెలుగు వికీపీడియాలో అంతర్భాగంగా ఒక అనువాద పరికరం ఉంది. యాంత్రికానువాద సౌకర్యం ఉన్న ఉపకరణం ఇది. ఈ పరికరంలో గూగుల్, యాండెక్స్, మిన్‌ట్ అనే మూడు అనువాద యంత్రాలున్నాయి. వాటిలో ఏ యంత్రాన్నైనా వాడి అనువాదం చెయ్యవచ్చు.
వికీపీడియాకు కొత్త అయినా ఈ పరికరాన్ని వాడొచ్చు. అనువాద పరికరం వాడాలంటే కనీస అనుభవం అంటూ పరిమితి ఏమీ లేదు. అయితే వికీ పద్ధతుల గురించి తెలుసుకునేందుకు కొన్నాళ్ళు నేరుగా దిద్దుబాట్లు చేస్తే మంచిది.
అనువాద యంత్రంతో ఉపయోగాలు
మార్చుఈ పరికరం మీ పనిని కొంత సులభతరం చేస్తుంది. యంత్రం ద్వారా చేసే ఈ అనువాదం కొంతవరకు బాగానే ఉంటుంది. దాన్ని సరిచేసి ప్రచురించవచ్చు. తొందరగా అయిపోతుంది. దాని వలన కింది ఉపయోగాలున్నాయి.
- యంత్రం చాలా వేగంగా అనువదిస్తుంది. అనువాద పరికరం వాడితే, మీరు మరింత వేగంగా అనువాదాలు చెయ్యవచ్చు.
- మూలం పేజీకి సంబంధించిన పేజీ తెలుగులో ఈసరికే ఉంటే, పరికరం అది చూపిస్తుంది.
- మూలం లోని మూసలు అనువాదం లోకి కూడా వస్తాయి
- మూలంలో ఉన్న వికీలింకులు అనువాదం లోకి కూడా వస్తాయి. ఒకవేళ లింకు లక్ష్యం పేజీ తెవికీలో లేకపోతే, ఆ లింకులు రావు. ఆ విధంగా ఎర్రలింకులు ఏర్పడకుండా ఉంటాయి
- మూలంలో ఉన్న వర్గాలు తెవికీలో కూడా ఉంటే అవి ఆటోమాటిగ్గా అనువాదం లోకి వచ్చేస్తాయి.
- మూలంలో ఉన్న పట్టికలు అనువాదం లోకి వచ్చేస్తాయి, పట్టిక లోని సమాచారం అనువాదమౌతుంది.
లోపాలు
మార్చుఈ యంత్రం వలన ఒకే ఒక్క ఇబ్బంది ఉంది -అసహజమైన భాష. యాంత్రికానువాదం అసహజంగా ఉంటుంది. మరియు లాంటి దోషాలతో పాటు, కర్మణి వాక్యాలను విరివిగా రాస్తుంది. వీటిని సవరించి భాషను సహజంగా ఉండేలా తీర్చిదిద్దాకనే ప్రచురించాలి. అయితే ఆ అనువాదాన్ని సవరించడం తేలిగ్గానే అయిపోతుంది.