వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/నివేదిక

ప్రధాన పేజీచర్చకార్యక్రమ
ప్రణాళిక
కమిటీలుసన్నాహక
సమావేశాలు
స్కాలర్‌షిప్స్నివేదికభావి కార్యాచరణ
తెవికీ పండగ

తెలుగు వికీపీడియా 20 వ వార్షికోత్సవం 2024 జనవరి 26-28 తేదీలలో విశాఖపట్నంలో జరిగింది. సిఐఎస్ ఎ2కె ఆర్థిక, నిర్వహణా సహకారంతో తెలుగు వికీమీడియన్లం ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించాం. 30 మంది అహ్వానితులైన వికీపీడియన్లు, ఐదుగురు వికీయేతర అతిథులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రత్యేకంగా తెవికీ పండగ అనే పేరు పెట్టి, ఒక లోగో తయారు చేయించాం.

జనవరి 26, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు. 27, 28 శని, ఆదివారాలు. ఈ మూడు రోజుల్లో, విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్లో జరిగిన తెవికీ పండగ విశేషాలు ఇవి.

తొలిరోజు

మార్చు

ప్రయాణం, పరిచయాలు, పలకరింపులు, నగర సందర్శన, కులాసా దిలాసా

2024 జనవరి 26. గణతంత్ర దినోత్సవం. ఉదయం నుండి వికీమీడియన్లు రావడం మొదలైంది. పదీ పదకొండు గంటలకల్లా దాదాపుగా అందరూ వచ్చేసారు. హైదరాబాదు నుండి వచ్చిన ప్రత్యేక రైలు బాగా ఆలస్యం కావడం వలన కొందరు హోటలుకు చేరుకునేటప్పటికి మరింత ఆలస్యమైంది.

 
యాత్రికులతో చారిత్రికులు

అందరూ డైనింగ్ హాల్లో కలిసి భోజనాలు చేసారు. రెండు గంటలకు రెండు మినీ బస్సుల్లో బయలుదేరి విశాఖ సందర్శనకు వెళ్ళారు. ముందుగా రాస్ హిల్ పైకి ఎక్కి, అక్కడి విశేషాలైన చర్చి, దర్గా, వెంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించారు. విశాఖ నగర చరిత్ర గురించి చెప్పేందుకు స్వచ్ఛందంగా వచ్చిన విశాఖ నగర చారిత్రికులు, జయశ్రీ హట్టంగడి గారు వికీమీడియన్లకు రాస్ హిల్ చరిత్రను వివరించారు.

ఆ తరువాత వికీమీడియన్లు రామకృష్ణా బీచికి చేరుకుని ఆ సాయంత్రం ఆహ్లాదంగా గడిపారు. రాత్రి 8 గంటలకు హోటలుకు చేరుకున్నారు.

రాత్రి భోజనం అయ్యాక, హోటలు సమావేశ స్థలంలో అందరూ చేరి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. మరుసటి రోజు జరగాల్సిన కార్యక్రమం గురించి నిర్వాహకులు చర్చించుకున్నారు. కశ్యప్ గారు వికీమీడియన్లందరినీ ఒకచోట చేర్చి వికీపీడియా గురించి మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఒక బొమ్మ రూపంలో వెయ్యమని చిన్న ఆట ఆడించారు. అందరూ తమ అభిప్రాయాన్ని బొమ్మ రూపంలో వేసి చూపించారు.

రెండవ రోజు

మార్చు

అతిథులు, అభిప్రాయాలు, ఆలోచనలు, గోష్ఠులు

 
అతిథులు, వికీమీడియన్ల బృందం వెనక సగర్వంగా నిల్చున్న డాల్ఫిన్ హోటల్

వార్షికోత్సవంలో చర్చలు గోష్ఠులూ మొదలైన రోజు ఇది. ఉదయం వికీమీడియన్ల రిజిస్ట్రేషను కార్యక్రమం జరిగింది. విజె సుశీల గారు సమావేశాల్లో వికీపీడియన్లు పాటించవలసిన ప్రవర్తనా నియమావఌని వివరించారు. ఆ తరువాత హోటలు ప్రాంగణంలో ఫొటోలు దిగారు.

తరువాతి కార్యక్రమాన్ని వికీపీడియన్ మీనాగాయత్రి నిర్వహించారు. ముందుగా ఆహ్వానంపై విచ్చేసిన అతిథుల పరిచయ కార్యక్రమం జరిగింది. కింది అతిథులను పరిచయం చేసారు. అతిథులు:

  • మన్నం వెంకట రాయుడు
  • కాకర్ల సజయ
  • మామిడి హరికృష్ణ
  • కందర్ప ఆదిత్య
  • వీవెన్

ఆ తరువాత వికీపీడియా ప్రస్థానాన్ని తెలిపే ప్రజెంటేషను జరిగింది. వికీమీడియా ఫౌండేషనుతో మొదలుపెట్టి, వివిధ వికీమీడియా ప్రాజెక్టులను, తెలుగులో వివిధ ప్రాజెక్టులనూ వాటి ప్రస్థానాన్నీ తెలియజేసారు. ఈ ప్రజెంటేషనులో అక్కడక్కడా వివిధ తెలుగు వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పడిన వాడుకరుల గురించి క్లుప్త పరిచయాన్ని ప్రదర్శించారు. 30 పైచిలుకు వికీమీడియన్ల కృషిని పదచిత్రాలుగా తయారుచేసి, వాటిని ఆడియో ఫైళ్ళుగా చేయగా కొన్నిటిని వినిపించారు. ఆహూతులంతా ఆ ఆడియోలను విని వాటిపట్ల తమ హర్షామోదాలను చప్పట్ల రూపంలో వినిపించారు.

చివరి రోజున ఈ పదచిత్రాలన్నిటినీ కలిపి తయారుచేసిన పుస్తకాలను వికీమీడియన్లకు ఇచ్చారు.

 
తమతమ రంగాల్లో రాణకెక్కిన వారిని వేదికెక్కించారు. చర్చలో మాట్లాడుతున్న మామిడి హరికృష్ణ, మన్నవ వెంకట రాయుడు, కందర్ప ఆదిత్య, కాకర్ల సజయ గార్లు, సంధానకర్త వీవెన్ గారు

ఆ తరువాత ఐదుగురు అతిథులూ వేదికపై కూచుని తెలుగులో కంటెంటు ఉత్పత్తి విషయమై తాము చేస్తున్న కృషి గురించి చర్చించారు. ఈ చర్చను వీవెన్ గారు మోడరేట్ చేసారు.

భోజన విరామం

ఆ తరువాత వికీమీడియన్లందరూ 5 బృందాలుగా విడిపోయి ఒక్కో అతిథితో - వివిధ రంగాల్లో జరుగుతున్న విజ్ఞానసృష్టి, తెలుగు వికీపీడియాకు సంబంధించి ఇతర రంగాల వారు అందించగల తోడ్పాటు వగైరా విషయాలపై చర్చించారు. ఆ కార్యక్రమం ముగింపులో, ఆయా బృందాలు తమ తమ చర్చల్లో వెలువడ్డ అంశాలను క్రోడీకరించి, ఆ అంశాలను సమావేశంలో వినిపించారు.

పై కార్యక్రమం కాగానే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార విజేత తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి గారి ప్రసంగం జరిగింది. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం, ఆ సాయంత్రం వికీమీడియన్లందరూ శాస్త్రి గారితో కలిసి ఫైర్ సైడ్ టాక్ అనే కార్యక్రమాన్ని జరపవలసి ఉంది. అయితే శాస్త్రి గారికి త్వరగా తిరిగి వెళ్ళవలసిన అవసరం ఏర్పడినందున, దాని బదులు ఈ ప్రసంగం జరిగింది.

ప్రసంగంలో శాస్త్రి గారు, పర్యావరణం గురించి, తాను చేస్తున్న కృషి గురించీ ప్రసంగించారు. పూణేలో తన చదువు గురించి, ఇతర విశేషాల గురించీ చెప్పారు.

సాయంత్రం 7 గంటలకు తెవికీ 20 వ వార్షికోత్సవ కేకును కోసారు. టీషర్టులు పంచారు.

రాత్రి భోజనం, ముగింపు

చివరి రోజు

మార్చు

తెవికీ సమీక్ష

వికీమీడియన్ల పదచిత్రాల ఆడియోలను వినిపించారు.

ఆ తరువాత, తెవికీ కంటెంటుపై స్వతంత్ర పరిశీలకులు చేసిన సమీక్షను విడుదల చేసారు. నలుగురు వ్యక్తులు తెవికీలో భాషపై, వ్యాసాల నాణ్యతపై చేసిన ఈ సమీక్షను ప్రత్యూష గారు ఆన్ లైనులో విడుదల చేసారు. తెవికీలో భాషా నాణ్యత మెరుగుపడాల్సి ఉందని ఆమె నొక్కిచెప్పారు. కొందరు వికీపీడియన్లు ఆ నివేదికపై తమ స్పందనను తెలియజేసారు. ఆ నివేదిక బాగుందని వారు అభిప్రాయపడ్డారు.

భోజన విరామం

తరువాతి కార్యక్రమంలో వికీమీడియన్లందరూ వికీల్లో తమతమ అనుభవాలను, వికీల భవిష్యత్తుపై తమ భావాలను ఒక్కరొక్కరుగా పంచుకున్నారు. ఎంచుకున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారు తమ ఆలోచనలు చెప్పారు. వారు చెప్పినవాటిని నోట్సు రాసుకుంటూ, వీడియో రికార్డు కూడా చేసారు.

వార్షికోత్సవాలకు వచ్చినవాళ్ళందరి సంతకాలతో, రాని ప్రముఖ వికీపీడియన్ల ఉద్దేశించి ఒక ఉత్తరం రాసారు.

తెవికీ 20 వ వార్షికోత్సవ సందర్భంగా ప్రచురించిన క్యాలెండర్లు, ఎందరో వికీమీడియన్లు పుస్తకాలనూ అందరికీ పంపిణీ చేసారు.

కార్యక్రమం ముగిసింది. వికీమీడియన్లందరూ ఎవరి స్వస్థలాలకు వాళ్ళు వెళ్ళిపోయారు.

ఇతర విశేషాలు

మార్చు
  • హోటల్లో 4,5,6 అంతస్థుల్లో ఒక్కో గదికీ ఇద్దరు ఉండేలా, గదులు కేటాయించారు
  • కొందరు వికీమీడియన్లు కుటుంబ సమేతంగా వచ్చారు.
  • గ్రౌండ్ ఫ్లోరులో సమావేశ స్థలం, దాన్ని ఆనుకునే భోజనాల హాలు ఉన్నాయి
  • పొద్దున్నే ఎవరికి వారు హోటలు గ్రౌండ్ ఫ్లోరు లోని రెస్టారెంటుకు వెళ్ళి బ్రేక్ ఫాస్టు తినడంతో రోజు మొదలయ్యేది.
  • వసతి సౌకర్యాలు, భోజన సౌకర్యాల పట్ల ఎవరికీ ఇబ్బంది కలిగినట్లు నిర్వాహకుల దృష్టికి రాలేదు
  • వికీమీడియన్లు వివిధ రకాలైన తినుబండారాలను సమావేశానికి తెచ్చారు. గుడికి వెళ్ళినవాళ్ళు ప్రసాదాలు తెచ్చారు.
  • దాదాపు 35 మంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కానీ ఎక్కడా సమయ పాలనకు, క్రమశిక్షణకూ భంగం కలగలేదు.
  • కొందరు వికీపీడియన్లు విశాఖ లోని కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు
  • కొందరు రెండవ, మూడవ రోజుల్లో తెల్లవారక ముందే బీచికి వెళ్ళి వచ్చారు
  • కొందరు విశాఖలో పలు ప్రాంతాల ఫోటోలు తీసి వికీ లవ్స్ వైజాగ్ పోటీలో ఆ చిత్రాలను కామన్స్ లోకి ఎక్కించారు
  • కొందరు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్ళి వచ్చారు
  • మొత్తం అన్ని కార్యక్రమాల్లోనూ వికీమీడియన్లకు ఎంతో కొంత విజ్ఞాన లబ్ధి కలిగేలా వాటిని రూపొందించినట్లుగా అనిపించింది. (చివరికి విశాఖ నగర సందర్శనకు కూడా అందరినీ ఒక చరిత్ర టీచరు గారి వెంట పంపించారు.)
  • కార్యక్రమ నిర్వహణలో సిఐఎస్ ఎ2కె తరఫున వారి అధికారులు తన్వీర్ హాసన్, నివాస్ గార్లు చురుగ్గా పాల్గొన్నారు

ధన్యవాదాలు

మార్చు
  • మన ఆహ్వానం మేరకు విశాఖ సమావేశాల్లో పాల్గొని విజ్ఞాన సముపార్జన, వితరణ వంటి అంశాలపై తమ ఆలోచనలను పంచుకున్న తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి, మన్నవ వెంకట రాయుడు, మామిడి హరికృష్ణ, కందర్ప ఆదిత్య, కాకర్ల సజయ, వీవెన్ గార్లకు ధన్యవాదాలు
  • తెలుగు వికీపీడియాతో ఏ సంబంధమూ లేకపోయినా, అందులోని వ్యాసాల నాణ్యతను పరిశీలించి సమీక్షించమని అడగ్గానే ఒప్పుకుని చక్కటి సమీక్షా నివేదికను అందించిన ప్రత్యూష, ముప్పాళ్ళ అప్పారాచ్వు, కొండుభొట్ల చంద్రశేఖర్, అలోక్ నంద ప్రసాద్, శశిధరరెడ్డి గార్లకు మనందరి ధన్యవాదాలు.
  • తొలిరోజు విశాఖ సందర్శనలో వికీపీడియన్లకు రాస్ హిల్ చరిత్రను వివరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జయశ్రీ హట్టంగడి గారికి మన ధన్యవాదాలు.
  • ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ప్రముఖంగా తోడ్పడినది - సిఐఎస్ ఎ2కె సంస్థ. వారి ఆర్థిక, మేథోసహకారాల కారణంగానే ఇది ఇంత విజయవంతంగా జరిగింది. తగినన్ని ఆర్థిక వనరులను కేటాయించడంలోనే కాక, కార్యక్రమాల రూపకల్పనలో సంస్థ నేత తన్వీర్ హాసన్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు కూడా ఈ ఉత్సవాల విజయానికి ఎంతో ఉపకరించాయి. అందుకుగాను ఆ సంస్థకు, తన్వీర్ హాసన్ గారికీ తెలుగు వికీమీడియన్లందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.
  • సిఐఎస్‌కే చెందిన నివాస్ గారు ఈ ఉత్సవాల ఏర్పాటులో ఎంతో కృషి చేసారు. క్యాలెండర్ల రూపకల్పన, ప్రయాణ ఏర్పాట్ల వంటి సన్నాహకాల నుండి విశాఖలో ఉత్సవ కార్యక్రమాల నిర్వహణ వరకూ ఆయన ఎన్నో బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆయనకు మన ధన్యవాదాలు
  • చక్కటి క్యాలెండరును తయారుచేయడంలోను, ఎందరో మహానుభావులు పుస్తకం రూపకల్పన నుండి ముద్రణ వరకూనూ సహకరించినవారందరికి మన ధన్యవాదాలు
  • డాల్ఫిన్ హోటల్లో మనందరి వసతి సౌకర్యాలు చూసిన ఉద్యోగులకు, ముఖ్యంగా అన్నం పెట్టిన నలభీములకు, అన్నపూర్ణలకూ మనస్సులో నమస్సులు.

చిత్రాలు

మార్చు