వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు

వికీపీడియాలోని వ్యాసాలను నమ్మదగ్గ మూలాల నుంచి స్వీకరించిన అంశాలతో రూపొందించాలి, ఆ అంశానికి సంబంధించిన నమ్మదగ్గ మూలాల్లో ప్రముఖమైనవి, ప్రాధాన్యత ఉన్నవీ అయిన అన్ని కోణాలను వ్యాసం ప్రతిబింబించాలి. ఒకవేళ ఒక అంశానికి సంబంధించి నమ్మదగ్గ మూలాలు ఏమీ లేకపోతే ఆ అంశం గురించి వ్యాసం ఉండరాదు.
మూలాలు నమ్మదగ్గవి కావడానికి అవసరమైన ప్రాతిపదికలు వివరించడం, నమ్మదగ్గవి కాని మూలాలను గుర్తించేందుకు సహాయపడడం ఈ మార్గదర్శక పేజీ ప్రధాన లక్ష్యాలు. ఈ మార్గదర్శకాలు (చర్చించి, నిర్ధారించాకా) అన్ని విషయపు పేజీలకు, జాబితాలకు, ఏ మినహాయింపూ లేకుండా వర్తిస్తాయి. జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసాలకు, కులాల గురించిన వ్యాసాలకు (చర్చించి నిర్ధారించాల్సిన అంశం) మిగిలిన అన్ని వ్యాసాలతో సమానంగానే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి, కానీ వాటిపై ప్రత్యేకించి దాడి జరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా పరిశీలించాలి.

మూలాలు

మార్చు

వ్యాసంలో ఒక సమాచారాన్ని నిర్ధారించడానికి ఆధారంగా పనికివచ్చే పుస్తకాలు, వెబ్‌సైట్లు, జర్నల్స్, పత్రికలు, వీడియోలు వంటివాటన్నిటినీ మూలాలుగానే ఈ మార్గదర్శక పేజీ పేర్కొంటుంది. వీటిని ప్రధానంగా మూడుగా విభజించవచ్చు:

ప్రాథమిక మూలాలు

మార్చు

ఒక అంశానికి నేరుగా సంబంధించిన మూలాలను ప్రాథమిక మూలాలు అనవచ్చు, ఇవి ఆ అంశానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు రాసేవి. ఉదాహరణకు ఒక సంఘటనకు ప్రత్యక్ష సాక్షుల కథనం, ఒక వ్యక్తి ఆత్మకథ, ఒక సందర్భంలో స్థానిక పత్రికా విలేకరి ప్రత్యక్ష కథనం వంటివి ప్రాథమిక మూలాలు. ప్రాథమిక మూలాల ఆధారంగా వ్యాసంలో పెద్ద భాగాలను కానీ, విశ్లేషణాత్మకమైన అంశాలను కానీ రాయకూడదు, అలానే మొత్తం వ్యాసాన్ని ప్రాథమిక మూలం ఆధారంగా రాయడమూ తగదు. ప్రాథమిక మూలాల నమ్మదగ్గవిగానూ, ఉపయోగకరంగానూ ఉండే సందర్బాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మౌలిక పరిశోధన కాకుండా జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో చేసే సూచనలు ఇవి.

 • ప్రాథమిక మూలాల్లో కనిపించే వర్ణనలు ఒక ఆ అంశంపై లోతైన అవగాహన లేని సామాన్యమైన విద్యావంతుడు స్వయంగా పరిశీలించి నిర్ణయించుకోగలిగిన సందర్భంలో మాత్రమే చేర్చాలి. అలా చేర్చిన సందర్భంలో కూడా ఫలానా వ్యక్తి లేక ఫలానా దస్త్రం ప్రకారం అన్న విషయం స్పష్టంగా రాయాలి.
 • ప్రాథమిక మూలాలలోని వర్ణనలు, విశేషాలను ఆధారం చేసుకుని విశ్లేషణలు, అభిప్రాయాలు, వివరణలు చేర్చకూడదు.
 • ఒక వివాదాస్పదమైన అంశంపై పరస్పరం వ్యతిరేకమైన రెండు ప్రాథమిక మూలాలు లభ్యమవుతూ, ఏ కథనాన్ని నిర్థారించగల ద్వితీయ స్థాయి మూలం లభ్యం కాని సందర్భాల్లో రెండు అంశాల్లో ఒక దాన్ని సమర్థించకుండా రెండిటినీ రాయాలి.

ద్వితీయ స్థాయి మూలాలు

మార్చు

ద్వితీయ స్థాయి మూలాలు ప్రాథమిక మూలాలు, ద్వితీయ స్థాయి మూలాలు వంటివి ఆధారం చేసుకుని తయారుచేసే విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక మూలాలు. ఉదాహరణకు ప్రత్యక్ష సాక్షుల కథనాలకు తోడు, గణాంకాలను స్వీకరించి పరిశోధించి నిర్ధారణకు వస్తూ వ్యాసాన్ని రాస్తే అది ద్వితీయ స్థాయి మూలం అవుతుంది. అలానే ఆత్మకథను, ఆ వ్యక్తి గురించిన పలు ద్వితీయ స్థాయి మూలాలను మథించి రాసే జీవిత చరిత్ర ద్వితీయ స్థాయి మూలం అవుతుంది. ప్రాథమిక, తృతీయ స్థాయి మూలాలతో పాటు అదే సమాచారాన్ని నిర్ధారించగల ద్వితీయ స్థాయి మూలాలు దొరుకుతూంటే ద్వితీయ స్థాయి మూలాలనే ఎంచుకోవాలి, వికీపీడియా వ్యాసాలు మౌలికంగా ద్వితీయ స్థాయి మూలాల ఆధారంగా నిర్మించాలి.

తృతీయ స్థాయి మూలాలు

మార్చు

ప్రాథమిక, ద్వితీయ స్థాయి మూలాల నుంచి సమాచారాన్ని విషయపరంగా కానీ, సూచికగా కానీ క్రోడీకరిస్తూ రూపొందించేవి తృతీయ స్థాయి మూలాలు. విజ్ఞాన సర్వస్వాలు, పాఠ్యపుస్తకాలు, పెద్ద బాలశిక్ష వంటివి తృతీయ స్థాయి మూలాలు. విజ్ఞాన సర్వస్వాలు, పరిచయ స్థాయిలోని పాఠ్యపుస్తకాలు వంటివి మూలాలుగా ఉపయోగపడతాయి. అయితే వికీపీడియా తృతీయ స్థాయి మూలం అయినా, వికీపీడియా వ్యాసాలను మూలాలుగా వినియోగించకూడదు.

స్వీకరించరాని మూలాలు

మార్చు
 • బ్లాగులు: బ్లాగులు స్వంత అభిప్రాయ ప్రకటనకు వేదికలు. బ్లాగుని వ్యక్తులు స్వంతంగా ప్రచురిస్తారు. వీటిలో సమాచారానికి, అభిప్రాయాలకు ఆధారాలు, మూలాలు ఖచ్చితంగా ఉండాలని నియమం లేదు. అందుకే బ్లాగులను వికీపీడియా వ్యాసాలకు మూలాలుగా ఉపయోగించడం తగదు. కొన్ని బ్లాగులు ఇందుకు భిన్నంగా చక్కని విశ్లేషణతో, మూలాల సహితంగా, ప్రామాణికంగా ఉండే వీలున్నా వాటిని నిర్ధారించడం కష్టం.
 • స్వీకరించరాని వెబ్‌సైట్లు: స్వీకరించరాని వెబ్‌సైట్లు పేజీలో, దాని చర్చా పేజీలో జరిగిన చర్చల ఆధారంగా నిర్ధారించే కొన్ని గాసిపింగ్, అప్రామాణిక వెబ్‌సైట్లను మూలాలుగా ఇవ్వరాదు. పుకార్లు, ప్రచారం వంటివి ప్రధానంగా ఉండే వెబ్‌సైట్లు ఇందలో జాబితా వేయాలి.
 • సామాజిక మాధ్యమాలు: సామాజిక మాధ్యమాలు సాధారణంగా అస్థిరమైన ప్రాథమిక మూలాల కిందకు వస్తాయి. ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు తమ అభిప్రాయాలు, ప్రకటనలు వెల్లడిస్తున్నారన్నది వాస్తవమే. కానీ అవి ప్రాధాన్యత కలిగిన విషయాలైతే ప్రధాన స్రవంతి పత్రికా మాధ్యమాల్లో ప్రచురితమౌతున్నాయి. కాబట్టి నేరుగా సామాజిక మాధ్యమాలను మూలాలుగా ఇవ్వరాదు, ఆయా ప్రకటనలు, వాగ్యుద్ధాలను కవర్ చేసే పత్రికలు, వెబ్‌సైట్ల వార్తలను మాత్రమే మూలాలుగా ఇస్తూ సందర్భశుద్ధితో రాయాల్సివుంటుంది.

జాగ్రత్త వహించాల్సిన సందర్భాలు

మార్చు
 • సంపాదకీయాలు, అభిప్రాయాలు, ఓప్-ఎడ్‌లు: నమ్మదగ్గ మూలాలైన పత్రికల్లోనే ప్రచురితమైనా అభిప్రాయాలు, ఓపీనియన్ పీస్‌లు, ఓప్-ఎడ్‌లు, ఎడిటోరిల్స్ వంటివాటిని మూలాలుగా తీసుకున్నప్పుడు వాటిలోని గణాంకాలు, వాస్తవాలు తీసుకోవాలి. అభిప్రాయాలను, విశ్లేషణను తీసుకోవాల్సివస్తే ఆ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్న వ్యక్తి పేరు ప్రస్తావిస్తూ రాయాలి, ఒకవేళ బైలైన్ లేని సందర్భంలో ఫలానా పత్రిక సంపాదకీయం ప్రకారం అని రాయాలి. సంపాదకీయాలు, ఒపీనీయన్ పీస్‌లు, కాలమ్స్ వంటివి ఆయా వ్యక్తుల అభిప్రాయాలకు విశ్వసించదగ్గ మూలాలు, కానీ వాస్తవాలను రాయడానికి నమ్మదగ్గ మూలాలు కావు.
 • శాస్త్ర సాంకేతిక అంశాలకు వార్తల కన్నా పరిశోధనలు సరైనవి: శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాల్లో ఫలానా పరిశోధన ప్రకారం కాఫీ మంచిదనో, ఫలానా పరిశోధన ప్రకారం నడక సరైనది కాదనో పత్రికల్లో వార్తలు వస్తూంటాయి. ఈ వార్తలు సాధారణంగా ఆసక్తిని లక్ష్యంగా చేసుకుంటాయి తప్ప వాస్తవాలు, పరిశోధన వెల్లడించవు. కాబట్టి పరిశోధనల గురించి వార్తలకు బదులు పరిశోధన పత్రాలను (ద్వితీయ స్థాయి మూలాలు) ఆధారంగా తీసుకోవడం మేలు.
 • పుకార్ల వార్తలు తీసుకోవద్దు: ప్రశ్నార్థకంతో ముగుస్తూండేవి, ఇలాగని గుసగుసలు అనడం పుకార్ల లక్షణం. వికీపీడియా పుకార్లకు వేదిక కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫలానా అంశంపై ఇలా భారీ ఎత్తున పుకార్లు వచ్చాయన్న సమీక్ష ధోరణిలోని వార్తలు తప్ప, పుకార్లతో నిండివుండే వార్తలను స్వీకరించకూడదు.
 • ఇ-కామర్స్ ర్యాంకింగులు: ఇ-కామర్స్ వెబ్‌సైట్ల ర్యాంకింగుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఫలానా పుస్తకం టాప్-టెన్ లిస్టులో ఉంది అని ఏదోక ఇ-కామర్స్ వెబ్‌సైట్ చెప్తే దాన్ని నేరుగా స్వీకరించరాదు. పత్రికా మూలాల్లో ప్రస్తావించగలిగినంత ప్రాధాన్యత కలిగినదైతే స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇవి అందించే జాబితాకు స్థిరమైన మూలం ఉండకపోవచ్చు, అంతేకాక వెండర్ ప్రకటించినవి సరైనవా కాదా అన్నది నిర్ధారించేందుకు ఏ విధమైన వీలూ పత్రికలకు, పరిశోధకులకు ఉండదు, కాబట్టి ప్రస్తావనార్హం కాదు.

బ్రేకింగ్ వార్తలు

మార్చు

బ్రేకింగ్-న్యూస్ రిపోర్టులలో తరచూ తీవ్రమైన తప్పులు ఉంటూ ఉంటాయి. ఒక ఎలక్ట్రానిక్ ప్రచురణగా, వికీపీడియా తాజాగా ఉంటుంది. ఉండాలి కూడా. కానీ వికీపీడియా వార్తాపత్రిక కాదు. ఇది నిజ సమయంలో వర్తమాన ఘటన యొక్క అన్ని వివరాలలోకి వెళ్లవలసిన అవసరం లేదు. తప్పుడు పుకార్లను వ్యాప్తి చేయడంలో సహాయం చేయడం కంటే విజ్ఞానసర్వస్వానికి వివరాలను జోడించే ముందు, ఘటన జరిగిన తరువాత ఒకటి రెండు రోజులు వేచి ఉండటం మంచిది. ఈ సమయంలో జర్నలిస్టులు మరింత సమాచారం సేకరించడం, వివిధ వార్తలను ధ్రువీకరించడం, దర్యాప్తు అధికారుల నుండి అధికారిక ప్రకటనలు రావడం జరుగుతుంది. మీడియాలో బ్రేకింగ్ న్యూస్ కన్స్యూమర్స్ హ్యాండ్‌బుక్[1] లో అనామక మూలాలు, ధృవీకరించని నివేదికలు, అలాగే ఇతర వార్తా మాధ్యమాలకు ఆపాదించబడిన నివేదికలు వంటి అవిశ్వసనీయమైన సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్నీ వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి అనేక సూచనలు ఉన్నాయి. బహుళ వనరులను కోరడం; ప్రత్యక్ష సాక్షుల నివేదికలను కోరడం; సంభావ్య బూటక వార్తల గురించి జాగ్రత్తగా ఉండటం, సామూహిక కాల్పుల్లో అదనపు దాడి చేసేవారి గురించిన నివేదికల గురించి సందేహంగా ఉండటం వంటివి ఇందులో భాగం.

ప్రారంభ వార్తా నివేదికలకు మూలాధారమైన క్లెయిమ్‌లను ప్రచురించిన వెంటనే వాటిని వెంటనే మెరుగైన-పరిశోధన హరిపిన వాటితో మార్చివేయాలి. ప్రత్యేకించి ఆ ఒరిజినల్ నివేదికలు సరికానివని తేలితే. బ్రేకింగ్-న్యూస్ కథనాలన్నీ, మినహాయింపే లేకుండా, ప్రాథమిక మూలాలే. వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి: వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం § ప్రాథమిక, ద్వితీయ, తృతీయ మూలాలు చూడండి.

బ్రేకింగ్-న్యూస్ ఈవెంట్ గురించిన వ్యాసాల పేజీల్లో పైన {{current}}, {{recent death}} వంటి మూసలను చేర్చవచ్చు. వ్యాసంలోని కొంత సమాచారం సరికాదని పాఠకులను హెచ్చరించడానికి, మెరుగైన మూలాలు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని చేర్చాల్సిన అవసరాన్ని తెలపడానికీ ఇవి పనికొస్తాయి. అయితే, ఈ మూసలను వార్తల్లోని విషయాలకు, లేదా వ్యక్తులపై వ్యాసాలకూ ఉపయోగించకూడదు; అలా చేస్తే వందల వేల వ్యాసాల్లో అటువంటి మూసలు ఉంటాయి. కానీ దానివలన పెద్దగా ప్రయోజనం ఉండదు.

మూలాలు

మార్చు
 1. "ది బ్రేకింగ్ న్యూస్ కన్స్యూమర్స్ హ్యాండ్‌బుక్". WNYC (in ఇంగ్లీష్). Archived from the original on 2019-02-28. Retrieved 2019-03-14.