విజ్ఞాన సర్వస్వం

ఒక సంప్రదింపు గ్రంథప్రక్రియ
(విజ్ఞాన సర్వస్వము నుండి దారిమార్పు చెందింది)

విజ్ఞాన సర్వస్వం లేదా విజ్ఞాన కోశం అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు

జర్మన్ విజ్ఞాన సర్వస్వం పుస్తకాల దొంతరలు

లక్షణాలు

మార్చు

విషయ పరిజ్ఞానం, పరిధి, వర్గీకరణ పద్ధతి, ఉత్పత్తి మొదలైనవి ఒక విజ్ఞాన సర్వస్వాన్ని ఏర్పరుస్తాయి..విజ్ఞాన ర్వస్వాలెప్పుడూ సర్వ సమగ్రాలు కావు. ఎంత చెప్పినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ఒక వేళ అంతా చెప్పామనుకున్నా, అది కొంత కాలానికి పాతబడి కొత్త విజ్ఞానం వస్తూనే ఉంటుంది. అందువల్ల విజ్ఞాన సర్వస్వాల విశ్వ రూపాన్ని ఒక చిన్న సూత్రంలో నిబంధించి నిర్వచించడం అంత సులభం కాకపోవచ్చును.ఈదృష్టితో చూస్తే విజ్ఞాన సర్వస్వాల నిర్మాణంలో వాటికుండవలసిన లక్షణాలను ఈ క్రింది విధంగా చెప్పవచ్చు

 • ఇది అన్ని విషయాల గురించిన సమాచారం కలిగి ఉండవచ్చు. ఉదాహరణలు ఆంగ్లంలో ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, జర్మన్ లో బ్రాక్‌హస్ (Brockhaus) మొదలైనవి. ఇవే కొన్ని జాతులకు, సంస్కృతులకు సంబంధించిన సమాచారం కూడా కలిగి ఉండవచ్చు.
 • ఇవి ఒక రంగంలో ఇప్పటిదాకా కుడగట్టుకుంటూ వచ్చిన ముఖ్యమైన, అవసరమైన సమాచారాన్ని మాత్రమే భద్రపరచవచ్చు.
 • వీటికి ఒక ప్రామాణిక పద్ధతిలో విభజన, వర్గీకరణ కూడా అవసరం
 • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దీనికి సంబంధించిన సమాచార సేకరణ, నిరూపణ, సంక్షిప్తీకరణ మొదలైన ప్రక్రియల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
 • అవసరమైన చోట్ల విజ్ఞాన సాధనాలను (Knowledge Aids) సమకూర్చు కోవాలి. (బొమ్మలు, ఫొటోలు, పటాలు, పట్టికలు మొదలైనవి)
 • విషయ వివరణలు సరళంగా సుగ్రాహ్యంగా ఉండాలి.
 • రచనా శైలి గ్రంథం సొంతం ఒకే విధంగా సాగాలి.
 • కొత్తగా వస్తుండే విజ్ఞానాంశాలను ఎప్పటికప్పుడు పొందు పర్చడం ద్వారా విజ్ఞాన సర్వస్వం పునర్నవీకృతం అవుతుండాలి.

చరిత్ర

మార్చు

ఇప్పుడు విజ్ఞాన సర్వస్వాలుగా భావిస్తున్న వన్నీ 18 వ శతాబ్దంలో నిఘంటువు ఆధారంగా రూపొందించబడ్డవే. చారిత్రకంగా నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు రెండూ విద్యాధికుల చేత వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులచే రాయబడ్డవే. కానీ వాటి కూర్పులో మాత్రం తేడాలున్నాయి. సాధారణంగా నిఘంటువులో అక్షర క్రమంలో అమర్చిన పదాలు, వాటి నిర్వచనాలు, పర్యాయ పదాలు ఉంటాయి. కానీ విజ్ఞాన సర్వస్వంలో ఒక పదం గురించిన పూర్తి సమాచారం కూడా ఉంటుంది. ఉదాహరణలు పద వ్యుత్పత్తి, దాని పూర్వాపరాలు మొదలైనవి.

ప్రపంచ విజ్ఞాన సర్వస్వాలు

మార్చు

ప్రపంచంలో ఇదీ మొదటి విజ్ఞాన సర్వస్వం అని ఇదమిత్తంగా చెప్పలేం. కానీ చాలా దేశాల్లో, అనేక భాషల్లో వచ్చిన అనేక విజ్ఞాన సర్వస్వాలకు బ్రిటీష్ వారి 'ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఆదర్శమని మాత్రం చెప్పవచ్చు.

భారతీయ విజ్ఞాన సర్వస్వాలు

మార్చు

భారతదేశంలో సా.శ6 వ శతాబ్ధిలో వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత మొదటి భారతీయ విజ్ఞాన సర్వస్వంగా చెప్పవచ్చు. ఆ తర్వాత 12 వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడు రచించిన అభిలషితార్థ చింతామణిని మరో భారతీయ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనవచ్చును[1].

తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు

మార్చు
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము
తెలుగులో విజ్ఞాన సర్వస్వాలకు మూల పురుషుడుకొమర్రాజు వేంకట లక్ష్మణ రావు. ఆయన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, రాయప్రోలు సుబ్బారావు, మరియుమల్లంపల్లి సోమశేఖర శర్మ ల సహాయంతో తెలుగులో విజ్ఞాన సర్వస్వం కొరకు చేసిన ప్రయత్నం విశేషమైనది. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము అనే పేరుతో మూడు సంపుటాలను వెలువరించాడు.
 
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 1 (కాశీనాథుని నాగేశ్వరరావు పునఃముద్రణ) ముఖచిత్రం
 
ఆంధ్ర సర్వస్వం
ఆంధ్ర విజ్ఞానము
ఇది ఆరు సంపుటాలలో వెలువడిన విజ్ఞాన సర్వస్వం. దీన్ని దేవిడి జమీందార్ ప్రసాద భూపాలుడు సంకలనం చేసి, 1940 దశాబ్దంలో ముద్రించారు.
ఆంధ్ర సర్వస్వం
ఇది 1943 లో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడింది.[2]
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము
మామిడిపూడి వెంకటరంగయ్య గారి సంపాదకత్వంలో సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము పేరుతో ఏడు సంపుటాలు 1958-1969 మధ్య కాలంలో ప్రచురించారు.
 
విజ్ఞాన సర్వస్వం- సంపుటి 4 దర్శనములు-మతములు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడింది.
తెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగు భాషా సమితి వారు విషయాల క్రమంలో 16 సంపుటాలుగా తెలుగు విజ్ఞాన సర్వస్వం పేరుతో వెలువరించారు. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయములో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది.[3]
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం సంపాదకత్వంలో 8 సంపుటాలుగా సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం వెలువడింది. ఖండవల్లి లక్ష్మీరంజనం సంపాదకత్వంలోనే 3 సంపుటాలుగా ఆంధ్రదేశ చరిత్ర, భూగోళ సర్వస్వం వెలువడ్డాయి.

తెలుగు జిల్లాల సర్వస్వాలు

మార్చు
తెలంగాణ జిల్లాల సర్వస్వాలు
1993 నాటికి తెలంగాణ ప్రాంతంలో మూడు జిల్లాలకు మాత్రమే విజ్ఞాన సర్వస్వాలు వెలువడ్డాయి. ఆ తర్వాత విషయాలు వెలుగులోకి రావలసి ఉంది. వెలువడిన వాటి వివరాలు...
 1. నల్లగొండ జిల్లా సర్వస్వం: ఇది 1986లో వెలువడింది. తెలంగాణ ప్రాంతంలో వెలువడిన తొలి జిల్లా సర్వస్వంగా దీనిని పేర్కొనవచ్చును.
 2. ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం: ఇది 1990లో వెలువడింది.
 3. మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వం (1993) : ఇది ప్రముఖ పరిశోధకులు బి.ఎన్.శాస్త్రిసంపాదకత్వంలో వెలువడింది. కపిలవాయి లింగమూర్తి, మహ్మద్ హుస్సేన్, గంగాపురం హనుమచ్చర్మ మొదలగువారు ఈ సర్వస్వానికి తమ వంతు తోడ్పాటునందించారు.
రాయలసీమ జిల్లాల సర్వస్వాలు
రాయలసీమ ప్రాంతంలో 1993 నాటికి ఒక జిల్లాకు మాత్రమే సర్వస్వాన్ని వెలువరించినట్లు తెలుస్తుంది.
 1. కడప జిల్లా సర్వస్వం:
తీరాంధ్ర జిల్లాల సర్వస్వాలు
తీరాంధ్ర ప్రాంతంలో రెండు జిల్లాలకు సర్వస్వాలు వెలువడ్డాయి.
 1. గుంటూరు జిల్లా సర్వస్వం
 2. నెల్లూరు జిల్లా సర్వస్వం

అంతర్జాలంలో తెలుగు విజ్ఞాన వేదికలు

మార్చు
 
తెలుగు వికీపీడియా మొదటి పేజి తెరపట్టు

తెలుగు వికీపీడియా అవతరించకముందు, ఆ తరువాత కొంతమంది ఔత్సాహికులు తెలుగు విజ్ఞాన వేదికలను ఏర్పాటు చేశారు. వాటి వివరాలు

 1. ఆంధ్రభారతి
 2. తెలుపు (తెలుగు పుస్తకాలు)
 3. తెలుగు సాహిత్యము గురించి ఇంగ్లీషు,RTS కోడుతో Archived 2018-07-02 at the Wayback Machine
 4. తెలుగు వరల్డ్ (ఇంగ్లీషులో) Archived 2010-07-22 at the Wayback Machine

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, మనవి, సంపాదకులు:బి.ఎన్.శాస్త్రి, మూసీ ప్రచురణలు,హైదరాబాద్,1993,పుట-iii
 2. ఆంధ్ర సర్వస్వం సంపాదకుడు: మాగంటి బాపినీడు
 3. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంపుటి 4 దర్శనములు-మతములు

బయటి లింకులు

మార్చు
 • గుంజి వెంకటరత్నం (2012). తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు. తెలుగు అకాడమీ. Retrieved 2022-01-21.