వికీపీడియా:2007 సమీక్ష/సెప్టెంబరు 2007 వ్యాసం

ఈ వ్యాసాన్ని నేను జ్యోతిగారి కోరిక మేరకు "ఈవారం కంప్యూటర్" పత్రిక కోసం వ్రాశాను. --కాసుబాబు 17:53, 19 సెప్టెంబర్ 2007 (UTC)


14 సెప్టెంబర్ 2007 - తెలుగు వికీపీడియా ప్రగతి

వికీపీడియా మార్చు

వికీపీడియా అనేది వివిధ భాషలలో వెబ్ ఆధారంగా, స్వచ్ఛంద రచయితలచే కూర్చబడుతున్న ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఆంగ్లంలో http://en.wikipedia.org/wiki/Main_Page అన్న వెబ్‌సైటులో దీనిని మీరు చూడవచ్చును. 2001లో ఆంగ్లంలో ప్రారంభమైన ఈ వికీపీడియా ఇప్పుడు 200 పైగా భాషలలో విస్తరించింది.

వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది. వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు.

• వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.

• వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. అవసరమైనచోట వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. • వికీపీడియాలోని విషయ సంగ్రహం GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు (GFDL) కింద పూర్తిగా ఉచితం. ఏ వ్యాసం కూడా, ఏ ఒక్కరికీ స్వంతమూ కాదు, ఎవరి నియంత్రణా ఉండదు. కాబట్టి మీరు చేసే రచనలను ఎవరిష్టం వచ్చినట్లు వారు మార్పులు, చేర్పులు చెయ్యవచ్చు.

• వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి.

• వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, దానివలన వచ్చే నష్టమేమీ ఉండదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.

తెలుగు వికిపీడియా మార్చు

తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అటుకుల దగ్గర నుండి అణుబాంబు దాకా ప్రతీ విషయాన్ని వివరిస్తూ సాగే విశాల, విశిష్ట విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచెయ్యడమంటే మామూలు విషయం కాదు. అటువంటి బృహత్కార్యాన్ని సాధించేందుకు నడుం కట్టారు, తెలుగువారు. ఐతే ఈ పనికి పూనుకున్నది ప్రభుత్వము, లక్ష్మీ పుత్రులూ కాదు.., కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వందల మంది ఇందులో భాగస్తులు.

ఒక్కసారి http://te.wikipedia.org/wiki/ చూడండి. అనేకమంది ఔత్సాహికులు తమ తీరిక సమయాలలో ఎన్నో విషయాలను తెలుగులో తెలుగువారికోసం పొందు పరుస్తున్నారు. రాసిలోనూ, వాసిలోనూ మొదటి 20 స్థానాల సరసన తెలుగు వికీని నిలబెట్టాలని వికీ కార్మికులు శ్రమిస్తున్నారు. మీరూ ముందుకు రండి. సహకరించండి.

ఆరంభం మార్చు

తెలుగు వికిపీడియా డిసెంబర్ 9, 2003 న ప్రారంభమైనది. మొదలు పెట్టిన వ్యక్తి వివరాలు ఇక్కడ నమోదు చేయబడలేదు. దాదాపు సంవత్సరం పాటు తెలుగు వికీపీడియాలో కదలిక చాలా తక్కువ (బహుశా మొదలు పెట్టినవారు తెలుగు వ్రాయడంలోని ఇబ్బందుల విషయంలో శ్రద్ధ పెట్టి ఉంటారు.) తెలుగులో వ్రాసే సాఫ్ట్వేర్ సమస్యలు, సభ్యుల కొరత, చాలా మందికి దీనిని గురించి తెలియకపోవడం వలన (ఈ సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి) మొదటిలో ప్రగతి చాలా నిదానంగా ఉన్నది. తరువాత కొంత వేగం అందుకొన్నది.

సభ్యులు

• 2005 సంవత్సరాంతానికి షుమారు 250 మంది సభ్యులు చేరారు.

• 2006 సంవత్సరాంతానికి షుమారు 1500 మంది సభ్యులయ్యారు

• ప్రస్తుతము 3,022 మంది నమోదు చేసుకున్న సభ్యులు కలరు. అందులో 10 మంది నిర్వాహకులు

వ్యాసాలు

• 1000 వ్యాసాల మైలురాయిని ఆగష్టు 17,2005 న ‘వినాయకుడు’ వ్యాసముతో చేరుకుంది.

• 2000 వ్యాసాల మైలురాయిని నవంబర్ 23,2005 న చేరుకుంది. • డిసెంబర్ 12, 2006 న తెవికీ 25000 వ్యాసాలకు చేరుకుంది.

• జూన్ 26, 2007న తెవికీ 30000 వ్యాసాలకు చేరుకుంది.

• ప్రస్తుతము తెలుగు వికిపీడియాలో 36,259 పైచిలుకు వ్యాసాలున్నాయి.

• వికీపీడియాకు సంబంధించిన పేజీలు, "చర్చ" పేజీలు, "మొలక" పేజీలు, "దారిమార్పు" పేజీలు, మరియు వ్యాసాలుగా పరిగణించుటకు వీలుకాని ఇతర పేజీలు కలుపుకొని డేటాబేసులో మొత్తము 57,133 పేజీలు ఉన్నాయి.

• తెలుగు వికీపీడియా ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 179,084 పేజీ దిద్దుబాట్లు జరిగాయి. అంటే - సగటున పేజీకి 3.13 దిద్దుబాట్లు.


ఇతర భారతీయ వికీపీడియాలతో తులన మార్చు

వికీపీడియా ప్రగతిని అంచనా వేయడానికి సాధారణంగా వాడే కొలమానాలు (1) వ్యాసాల సంఖ్య (2) సభ్యుల సంఖ్య (3) దిద్దుబాట్ల సంఖ్య (4) సగటు దిద్దుబాట్లు

ఈ విషయంలో మిగిలిన భారతీయ వికీపీడియాలతో పోలికలిలా ఉన్నాయి (వెయ్యి వ్యాసాలు పైబడిన వాటినే పోలికలకు పరిగణించాము).

వ్యాసాల సంఖ్య: (1) తెలుగు 36,259 (2) మణిపురి 20,828 (3) బెంగాలీ 16,264 (4) హిందీ 13,526. ప్రపంచ భాషలలో 25,000 వ్యాసాలు పైబడి ఉన్న 43 భాషలలో తెలుగు వికీపీడియా ఒకటి. (పోలిక కోసం - అన్నింటికంటె పెద్దదైన ఆంగ్ల వికీపీడియాలో 20,07,845 వ్యాసాలున్నాయి. తరువాతి పెద్దదైన జర్మను భాష వికీపీడియాలో 6,38,816 వ్యాసాలున్నాయి.)


సభ్యుల సంఖ్య: (1) మళయాళం 3,267 (2) తెలుగు 3,022 (3) హిందీ 2,341 (4) తమిళం 2,135


దిద్దుబాట్ల సంఖ్య: (1) బెంగాలీ 211,823 (2) తెలుగు 179,084 (3) తమిళం 162,053 (4) మణిపురి 151,191


సగటు దిద్దుబాట్లు: (1) తమిళం 5.8 (2) మణిపురి 5.2 (3) హిందీ, మళయాళం 4.6 (4) మరాఠీ 4.5 (తెలుగు 3.1 సగటు దిద్దుబాట్లతో 6వ స్థానంలో ఉంది)


తెలుగు వికీపీడియా ప్రస్తుత స్థాయి మార్చు

పై గణాంకాలను బట్టీ, ఇతర సూచికలను బట్టీ తెలుగు వికీపీడియా భారతీయ భాషల వికీపీడియాలలో అగ్రస్థానంలో గానీ రెండవ స్థానంలో గానీ ఉన్నదని చెప్పుకోవచ్చును (కొలమాన విధానాన్ననుసరించి). ఆంగ్ల వికీ వంటివాటితో పోలిస్తే అంతరం చాలా చాలా ఎక్కువ.


తెలుగు వికీపీడియన్ల ప్రస్తుత లక్ష్యాలు మార్చు

తెలుగు భాషపైనున్న అభిమానం, అందుకు తోడ్పడాలనే ఉత్సాహం ఎక్కువ మంది తెలుగు వికీపీడియా శ్రామికుల మూలధనం. నిజానికి వికీపీడియా మౌలిక లక్ష్యం భాషాభిమానం కాదు. ‘విజ్ఞానాన్ని అందించడం’. అయితే ఈ విజ్ఞానాన్ని ‘తెలుగు’లో కూర్చడం ద్వారా వికీపీడియన్లు తెలుగు భాష చైతన్యానికి, సంపన్నతకు దోహదం చేయగలమని ఆశిస్తున్నారు. వారి ప్రస్తుత ప్రధాన లక్ష్యాలు:

• తెలుగువారికి వికీపీడియాను సుపరిచితమైన సమాచార స్థానంగా పరిచయం చేయాలి

• మరిందరు సభ్యులను చేర్చాలి. ఒక్కో సభ్యుడు తన వూరిగురించో, తన పనిగురించో కనీసం ఒక పేరా అయినా ‘తెలుగు’లో వికీపీడియాలో పొందుపరచాలి.

• భారతీయ భాషల వికీ పీడియాలలో మొదటి స్థానాన్ని సురక్షితం చేసుకొనేలాగా కృషిని కొనసాగించాలి.

• కనీసం వేయి విశేష వ్యాసాలను కూర్చాలి. అంటే ఈ వ్యాసాల నాణ్యతా ప్రమాణాలు అంతర్జాతీయ వ్యాస రచనా విధానానికి ఏ మాత్రం తీసిపోకుండా ఉండాలి. చదువరులకు ఇవి విశేషంగా ఉపయోగ పడాలి.

• మొలకలుగా ఉన్న అనేక వ్యాసాలు – ముఖ్యంగా సినిమాల గురించీ, ఆంధ్ర ప్రదేశ్…లోని గ్రామాల గురించీ రూపొందించిన ప్రారంభ వ్యాసాలు – విస్తరించి ఉపయోగకరమైన వ్యాసాలుగా, కనీసం రెండేసి పేజీల నిడివి ఉండేలాగా, తీర్చి దిద్దాలి.

స్వాగతం మార్చు

ఒక్కసారి http://te.wikipedia.org/wiki/ చూడండి. మొదటి పేజీలోనే "వికీపీడియాలో మీ ఊరు ఉందా?" అన్న లింకుపై నొక్కితే వివిధ జిల్లాలకు, వాటినుండి మండలాలకు, వాటినుండి గ్రామాలకు లింకులున్నాయి. మీ వూరి పేరుమీద ఇప్పటికే ఒకటి రెండు వాక్యాలు, లేదా ఎక్కువగా, ఎవరైనా వ్రాసి ఉండవచ్చును. దానికి మీరు వ్రాయాలనుకొన్నది అదనంగా చేర్చవచ్చును.

ఒకవేళ మీవూరి పేరుతో ఇప్పటికే ఒక పేజీ లేకపోతే మీరు సృష్టించవచ్చును. క్రొత్త పేజీలో ముందుగా వూరు పేరు, మండలం, జిల్లాలు తప్పక వ్రాయండి. తరువాత మిగిలిన విషయాలు వ్రాయండి. ఇదంతా తెలుగులోనే వ్రాయాలి. ఇప్పుడు వికీపీడియాలో తెలుగులో వ్రాయడం చాలా సులభం. అక్కడ సహాయం పేజీ కూడా ఉంది.


ఇదంతా చేయడానికి మీరు వికీలో సభ్యులుగా నమోదు చేసుకొనవలసిన అవుసరం లేదు. కాని సభ్యులుగా చేరితే కొన్ని సదుపాయాలున్నాయి. ఉదాహరణకు మీరు వ్రాసినదాని గురించి మీకు ఏవయినా సందేశాలు పంపడం సులభం అవుతుంది.

అక్కడితో ఆపకండి. ఇంకా వికీ క్రొత్త విషయాలు వ్రాస్తూ ఉండండి. ఉన్న వ్యాసాలు దిద్దుతూ ఉండండి. మీ సలహాలను, సూచనలను వ్రాస్తూ ఉండండి. క్రొత్తవారికి వికీని పరిచయం చేస్తూండండి. ఏవైనా సందేహాలుంటే తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి WikiTe-L@wikipedia.org కు లేదా teluguwiki@yahoo.co.in కు మెయిల్ చేయండి.