విన్నకోట పెద్దన

విన్నకోట పెద్దన 15వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, ప్రథమ తెలుగు లాక్షణికుడు. ఇతడు కావ్యాలంకారమనే లక్షణగ్రంధాన్ని రచించాడు. ఇతడు కౌశిక గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు.[1] తండ్రి గోవిందరాజు. నివాస స్థానము రాజమహేంద్రవరము. తాను రచించిన కావ్యాలంకారచూడామణి అనే అలంకార గ్రంథమును రాజమహేంద్రపురాధీశ్వరుడను ఎలమంచిలి చాళుక్య వంశానికి చెందిన విశ్వేశ్వరునికి అంకితము చేసెను.[2] ఈ విశ్వేశ్వరుడు రాజరాజ నరేంద్రునకు ఏడవ మనుమడు అని,15వ శతాబ్దానికి చెందిన వాడని భావన.

విన్నకోట పెద్దన వ్యాకరణాంశములతోపాటు చందోలంకార రూపమగు కావ్య లక్షణాలను కూడా చేర్చి కావ్యాలంకార చూడామణిని తెలుగు పద్య రూపంలో రచించాడు.[3] తొమ్మిది ఉల్లాసాలుగా విభజించి విన్నకోట పెద్దన రచించిన ఈ లక్షణ గ్రంథంలో మొదటి ఆరు అధ్యాయాలు కావ్య లక్షణాల గురించి, తరువాతి రెండు అధ్యాయాలు ఛందస్సు గురించి ఉంటాయి. తొమ్మిదో అధ్యాయంలో పెద్దన తెలుగు వ్యాకరణాన్ని 171 పద్యాలలో వివరిస్తాడు. “ఆంధ్రభాషయున్ బ్రాకృతాన్వయ”మని ఆంధ్రభాషకు ప్రాకృతమని మరో పేరు కలదని చెప్పుతాడు. తెలుఁగు అన్న పదం త్రిలింగ శబ్దభవమన్న ప్రతిపాదన కూడా మొదటిసారి ఈ వ్యాకరణంలోనే కనిపిస్తుంది.[4]

తత్త్రిలింగపదము తద్భవమగుటచేఁ
దెలుఁగుదేశమనఁగఁ దేటపడియె
వెనుకఁ దెనుఁగుదేశమునునండ్రు కొందఱ
బ్బాస పంచగతులఁ బరగుచుండు (9.6)

విన్నకోట పెద్దన, ప్రద్యుమ్నచరిత్ర అనే మరో గ్రంథాన్ని రచించెనని శ్రీమామపల్లి రామకృష్ణ కవి తన కుమారసంభవము టిప్పణిలో పేర్కొనెను పెద్దన రాజమహేంద్రవనాన్ని వర్ణించినట్లు ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది

  సీసము గంభీర పంషు నాగస్త్రీల కశ్రాంత
        కేళీవిహార దీర్ఘిక యనంగ
      నిత్తాలసాల మన్యుల కుచ్చిదివిన్ బ్రాన్ కన్
        జేసి నదీర్ఘనిశ్రేణి యనన్ గన్
      జతురచాతుర్వర్ణ్య సంఘ మర్ధులపాలి
        రాజితకల్పకారామ యనన్ గన్
      భ్రాంత సుస్థితయైన భవజూట వాహిని
        భక్తి యుక్తి ప్రదస్ఫూర్తి యనన్ గ
      నెప్పుడును నొప్పు రాజమహేంద్రవరము
      ధరణిన్ గల్పించె నేరాజు తనదు పేర
      నట్టి రాజు మహేంద్రుని యనున్ గుమనుమన్
      డెసన్ గున్ జాళుక్య విశ్వనరేశ్వరుండు.

మూలాలు మార్చు

  1. History of Andhra Country 1000 A. D-1500 A. D. By Yashoda Devi
  2. History of Andhra Country 1000 A. D-1500 A. D. By Yashoda Devi
  3. వ్యాకరణం ఉపోద్ఘాతం
  4. "తెలుగు వ్యాకరణాల పరిచయం - సురేశ్ కొలిచాల". Archived from the original on 2012-08-30. Retrieved 2012-11-19.