విమాన వెంకటేశ్వరస్వామి

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయమైన ఆనందనిలయం మీద ఉత్తర దిశగా పైన ఉండే వేంకటేశ్వరస్వామి విగ్రహం, విమాన వేంకటేశ్వరస్వామి విగ్రహం. విజయనగర చక్రవర్తిగా నరసింహరాయలు ఉన్న కాలంలో వైఖానస పారంపర్య అర్చకుడి స్థానం ఖాళీ కావడంతో ఆపద్ధర్మంగా, శ్రీవారి అర్చకత్వాన్ని మధ్వ సాధువు, గురువు వ్యాసరాయలు పన్నెండేళ్ళ పాటు నిర్వహించాడు. ఆ కాలంలోనే వ్యాసరాయలు ఆనందనిలయం విమానంపై ఉన్న శ్రీనివాసుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠచేసి దాన్నే విమాన వేంకటేశ్వరుడిగా ప్రచారానికి తీసుకువచ్చాడు. దర్శనం కాకుండా వెళ్ళిపోవాల్సి వచ్చినవారు ఆ రోజుల్లో విమాన వేంకటేశ్వరుడిని దర్శించి తిరిగివెళ్ళేవారు. ఇప్పటికీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణంగా వెళ్తూ విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. 1982లో ఆనందనిలయ విమానం బంగారుపూత పూస్తున్నప్పుడు విమాన వేంకటేశ్వరుణ్ణి గుర్తుపట్టడానికి వెండి మకరతోరణం పెట్టించి, బాణం గుర్తుతో సూచించారు. విమాన వేంకటేశ్వరుడి ఎదుటే నిత్యం వేదపారాయణ చేయడం, స్వామిని దర్శించుకోవడానికి కానీ, ఆలయం వారు నియమించడం వల్ల కానీ వచ్చిన మధ్వపండితులు విమాన వేంకటేశ్వరుడి ఎదుటే కూర్చొని పారాయణలు చేయడం సంప్రదాయం. అయితే తిరుమలలో ఏకమూర్తి ఆరాధన విధానం ఉండడంతో ఈ విగ్రహానికి ఇతర దేవతామూర్తులకు లాగానే శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు నివేదించిన ప్రసాదాన్నే తిరిగి నివేదిస్తూంటారు.

చరిత్ర

మార్చు

తిరుమల ఆలయంలో సాళువ నరసింహరాయల కాలంలో శ్రీరప్పాయనీ అన్న వంశపారంపర్య వైఖానస అర్చకుడు వేంకటేశ్వరస్వామి ఆభరణాలు దొంగతనం చేశాడు. అందువల్ల నరసింహరాయలు అతనికి శిక్ష విధించాడు. అతని ఆస్తి జప్తు చేసుకుని, మరణశిక్ష విధించాడని కొందరు, దేశబహిష్కారం చేశాడని మరికొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆలయ అర్చకునిగా వంశపారంపర్య వైఖానస అర్చకుడిని పదవి నుంచి తొలగించడంతో అతని స్థానంలో అతని కుమారుడు బాగా చిన్నవాడు కావడంతో వ్యాసరాయ మఠస్థాపకుడైన మధ్వ సన్యాసి, వ్యాసరాయలు పన్నెండేళ్ళ పాటు తిరుమల ఆలయ ప్రధానార్చకునిగా బాధ్యత నెరవేర్చాడు.

అప్పటికి శ్రీవారి ఆలయంలోని ప్రధానాలయమైన ఆనందనిలయ విమానంపై వాయువ్య దిశగా ఓ శ్రీనివాసుని శిల్పం ఉంది. వ్యాసరాయలు అర్చకునిగా ఉండగా, ఆయనే ఆ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. శ్రీవారి ఆనందనిలయ విమానంపై ఉండడంతో విమాన వేంకటేశ్వరుడన్న పేరు పెట్టి, భక్తులలో ఆ విగ్రహానికి ఒక ప్రాచుర్యం తీసుకువచ్చాడు.

అయితే తిరుమల వేంకటేశ్వరుని నగలు ధరించిన 12మంది అర్చకులను రాజు శిరచ్ఛేదం చేశాడనీ, ఆ కారణంగా పట్టుకున్న బ్రహ్మహత్యాదోషాన్ని నివారించుకునేందుకు, వ్యాసరాయలు 12 సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారి ప్రధానాలయాన్ని మూయించి లోపలే ఉండి పూజలు చేశాడనీ, ఆ సందర్భంగా భక్తులు ఇబ్బందిపడకుండా వారికి దర్శనం అయ్యేందుకు విమాన వేంకటేశ్వరస్వామిని ప్రతిష్ఠించాడనీ కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఐతే ఇలా ఆలయాన్ని మూశారనీ, 12 మంది అర్చకులు మరణించారనీ చెప్పేందుకు ఆధారాలు లేవు.

1982లో మహాసంప్రోక్షణతో ఈ ఆనందనిలయ విమానానికి బంగారు పూత మళ్ళీ పూసే పని జరిగింది. భక్తులకు విమాన వేంకటేశ్వరుడు సులభంగా కనిపించడానికి వీలుగా ఆ విగ్రహం మీద వెండి మకరతోరణాన్ని పెట్టించి, ప్రాకారం మీద బాణం గుర్తుతో విమాన వేంకటేశ్వరుడిని సూచిస్తూండేలా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్ ఏర్పాటుచేశాడు.[1]

ప్రాధాన్యత

మార్చు

శ్రీవారి మూలవిరాట్టును దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా ఆలయం చుట్టూ తిరిగివచ్చేదారిలో, భక్తులు హుండీ వద్దకు వెళ్ళే ముందు, విమాన వేంకటేశ్వరస్వామిని ఉత్తర భాగంలో మెట్లు, గట్టు ఎక్కి మరీ దర్శనం చేసుకుంటూంటారు. పూర్వం ఏ కారణంతోనైనా తిరుమల వచ్చినా వేంకటేశ్వరస్వామి దర్శనం దొరకక వెనుతిరగాల్సివస్తే, విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వేంకటేశ్వరస్వామి దర్శనం అయినట్టే భావించేవారు.[1]

సేవలు

మార్చు

శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిత్యం జరిగే వేదపారాయణ విషయంలో విమాన వేంకటేశ్వరస్వామికి ప్రాధాన్యత ఉంది. దేవాలయంలో జరిగే వేదపారాయణ వ్యాసరాయల కాలం నుంచి ప్రస్తుత కాలం వరకూ నిత్యం విమాన వేంకటేశ్వరుని ఎదుటే చేయడం సంప్రదాయం. మధ్వపండితులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కానీ, ప్రత్యేకించి తితిదే ఏర్పాటుచేసినప్పుడు కానీ విమాన వేంకటేశ్వరుని ముందు కూర్చుని వేంకటాచల మాహాత్మ్యం, శ్రీనివాస కళ్యాణం వంటివి పారాయణ చేయడం, సర్వమూల గ్రంథ పారాయణ చేయడం ఆచారంగా వస్తోంది.[1]

నిత్యం వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మూలవిరాట్టు (ధ్రువబేరం) కు నివేదించిన నైవేద్యాన్నే తిరిగి విమాన వేంకటేశ్వరస్వామికి నివేదిస్తారు. విమాన వేంకటేశ్వరుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన జరిగినా కూడా, తిరుమలలో ఏకమూర్తి ఆరాధనే అమలులో ఉండడం వల్ల ఆలయంలోని మూలవిరాట్టుకు, క్షేత్రంలో నివసించేందుకు వేంకటేశ్వరుడికి అనుమతినిచ్చాడని పురాణగాథలు. భూవరాహ స్వామికి తప్ప వేరే ఏ విగ్రహానికీ ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టే సంప్రదాయం లేదు. శ్రీవారికి నివేదించిన నైవేద్యాన్నే తిరిగి ఆయా దేవతామూర్తులకు నివేదించడం తిరుమలలోని పద్ధతి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 పి. వి. ఆర్. కె., ప్రసాద్ (ఆగస్టు 2013). "దుష్టగ్రహకూటమిలో రాజ్యం దానం". In జి.వల్లీశ్వర్ (ed.). తిరుమల చరితామృతం. ఎమెస్కో బుక్స్.