విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమం

(విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నుండి దారిమార్పు చెందింది)

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమం విశాఖపట్టణంలో ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం[1] ముందుండి నడిపించాడు. టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటి నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించారు.[2]

విశాఖ ఉక్కు కర్మాగారం, ప్రధాన ముఖద్వారం

1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసింది. 26వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి 10 వేలకోట్ల రూపాయలతో 20 ఎకరాల భూమినిచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకరించింది. 1977లో నిర్మాణం మొదలైంది. 1979లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.3897.28 కోట్ల అంచనాతో 3.4 మిలియన్‌ టన్నుల సామర్థ్యం గల కర్మాగార నిర్మాణం ప్రారంభించారు. కానీ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురుకావడం, ప్రభుత్వాలు మారడం వలన ఇది పూర్తవడానికి 20 ఏళ్లు పట్టింది. 1987 డిసెంబరు నాటికి కర్మాగారం నిర్మాణం పూర్తయ్యింది. 1990 సెప్టెంబరులో ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పటికి నిర్మాణ వ్యయం రూ.9 వేల కోట్లకు చేరుకుంది. 1994లో మొదటిసారిగా రూ.50 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. 1992 ఆగస్టు 8న అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేశాడు. మొదట్లో ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే మొదటగా నిలిచింది. కానీ కర్మాగారం నిర్మాణం కోసం నిధులు లేకపోవడంతో ఇతర సంస్థలపై ఆధారపడటంతో 1998-2000 సంవత్సరంలో ఖాయిలా పరిశ్రమగా మిగిలింది. ఈ సందర్భంగా ఉక్కుకార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఉక్కువడ్డీలను ఈక్విటీగా మార్చడం జరిగింది. ఆ తర్వాత ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచశ్రేణి ఉక్కు కర్మాగారంగా నిలబడింది. త్వరలోనే ఈ కర్మాగారం మినిరత్న నుంచి నవరత్న స్థాయికి చేరుకుంది.[3]

మూలాలు మార్చు

  1. కె.ఆర్, దీపక్ (నవంబరు 10, 2004). "హిందూ". కస్తూరి అండ్ సన్స్. హిందూ బిజినెస్ లైన్. Retrieved 5 May 2016.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-05. Retrieved 2016-05-06.
  3. Andhra, Voice. "andhravoice". Andhravoice. Andhravoice. Retrieved 5 May 2016.[permanent dead link]