విశ్వవరం మోహన్‌రెడ్డి

విశ్వవరం మోహన్‌రెడ్డి రైతాంగ సాయుధ పోరాటాల యోధుడు, విప్లవ కారుడు.

విశ్వవరం మోహన్‌రెడ్డి
జననంవిశ్వవరం మోహన్‌రెడ్డి
1954
India ఆత్మకూరు, నల్గొండ జిల్లా, తెలంగాణ
మరణం2017
వృత్తివిప్లవ కారుడు

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

విశ్వవరం మోహన్‌రెడ్డి 1954 లో నల్గొండ జిల్లా, సూర్యాపేట తాలూకా, ఆత్మకూరు గ్రామంలో జన్మించాడు. అతనిది కమ్యూనిస్టు కుటుంబం తండ్రి పత్తిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని సీపీఐ(ఎమ్‌–ఎల్‌)లో పనిచేసేవాడు. పదోతరగతిదాకా ఆత్మకూరులో చదివిన మోహన్, ఇంటర్‌ సూర్యాపేటలోను, డిగ్రీ కోదాడలోను చదివాడు. తర్వాత ఉస్మానియాలో తత్వశాస్త్రంలో ఎమ్.ఏ. చేసాడు.[1]

జీవిత విశేషాలు మార్చు

నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటాల ఉత్తేజంతో ఆవిర్భవించిన విప్లవ విద్యార్థి సంస్థ పీడీఎస్‌యూలో మోహన్ చేరాడు. నల్గొండ జిల్లాలోను, హైదరాబాద్‌లోను పీడీఎస్‌యూ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కోదాడలో డిగ్రీ చేసే రోజుల్లోనే మోహన్‌ విద్యార్థి నాయకుడుగా ఎదిగాడు. 1978లో ఎమ్‌ఫిల్‌ చేయటానికి మోహన్ ఢిల్లీలోని జేఎన్‌యూలో చేరాడు. జేఎన్‌యూ మోహన్‌ జీవితాన్ని మార్చేసింది. అక్కడ వుండగానే మోహన్‌కి ‘మాస్‌లైన్‌’ పత్రిక బృందంతో పరిచయం ఏర్పడింది. ‍‍సీపీఐ (ఎమ్‌ఎల్‌) సీఆర్‌సీ నాయకులైన టి.జి. జాకబ్‌, కె.మురళీధర్ కలిసి జేఎన్‌యూ పక్కనే వున్న మునిర్కా గ్రామం నుంచి ‘మాస్‌లైన్‌’ను వెలువరించేవారు. ఆ కాలంలో సీఆర్‌సీ భారతదేశ మావోయిస్టు ఉద్యమంలో ప్రాధాన్యం కలిగిన సిద్ధాంత, రాజకీయ కృషి చేయటమే కాక సాంప్రదాయక ఎమ్‌.ఫిల్‌ వైఖరుల నుంచి విడగొట్టుకుని భారత విప్లవానికి ఒక నూతన పంథాను రూపొందించింది. భారతదేశం అర్ధ వలస–అర్ధ భూస్వామ్య దేశం, ఫ్యూడ లిజానికి, అశేష ప్రజానీకానికి మధ్య వున్న వైరుధ్యమే ఇక్కడ ప్రధాన వైరుధ్యం. దీన్ని పరిష్కరించటానికి సాగే నూతన ప్రజాస్వామిక విప్లవానికి వ్యవసాయక విప్లవం ఇరుసు– ఇదీ సాధారణ ఎమ్‌ఎల్‌ పంథా. దీనికి భిన్నంగా సీఆర్‌సీ, భారతదేశం ఒక నయా వలస దేశమని, సామ్రాజ్యవాదానికి, భారత ఉపఖండంలోని వివిధ జాతులకు మధ్య వున్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యమని, ఈ వైరుధ్యాన్ని పరిష్కరించటానికి సాగే నూతన ప్రజాస్వామిక విప్లవం సామ్రాజ్యవాద వ్యతిరేక జాతులవిముక్తి పోరాటాల రూపంలో వుంటుందని, ఇంకా కుల నిర్మూలనా పోరాటం, స్త్రీ విముక్తి పోరాటాలు కూడా విప్లవానికి ఎంతో ప్రాధాన్యం కలిగిన పోరాటాలని పేర్కొంది. ఎర్ర విప్లవానికి ప్రతిగా పచ్చ విప్లవం (గ్రీన్‌ రివల్యూషన్‌) సాగుతోందని, దీని ఫలితంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఒక ప్రత్యేక తరహా పెట్టుబడిదారీ సంబంధాలు రూపొందుతున్నాయని సీఆర్‌సీ విశ్లేషించింది. అప్పటికే సాంప్రదాయక ఎమ్ఎల్‌ అవగాహన పట్ల అసంతృప్తితో వున్న మోహన్‌ సీఆర్‌సీ నూతన పంథాని ఆమోదించాడు.

ఎమ్‌.ఫిల్‌ థీసిస్‌ పూర్తిచేసాడో లేదో తెలియదు కాని మోహన్‌ పూర్తికాలం విప్లవ కార్యకర్తగా ఆంధ్రాకు తిరిగివచ్చాడు. జేఎన్‌ యూలో సహాధ్యాయి, సన్నిహిత మిత్రుడు, నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర అధ్యాపకుడు అయిన సుబ్రమణ్యం క్వార్టర్స్‌లో వుంటూ తన కృషి ప్రారంభించాడు. కొన్నాళ్ళు అధ్యయనం మీద కేంద్రీకరించి కొన్ని అవగాహనా పత్రాలను రూపొందించాడు. తర్వాత అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సీఆర్‌సీ నాయకత్వంలో విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేశాడు. నాగార్జున వర్సిటీలో వున్న కాలంలోనే దళిత ఎన్‌ఎమ్‌ఆర్ కార్మికులను సమీకరించి వర్సిటీ యాజమాన్యం ప్రదర్శించిన కుల వివక్షకు వ్యతిరేకంగా మిలిటెంట్ దళిత పోరాటాన్ని నిర్మించాడు. ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సుబ్రమణ్యాన్ని వర్సిటీ యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. ఈ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా అనేక నెలల పాటు ఉద్యమం సాగింది. గుంటూరు జిల్లాలోనే కాకుండా కోస్తాంధ్రలోని అనేక జిల్లాల్లో ఈ ఉద్యమ ప్రభావం వున్నది. కారంచేడు హత్యాకాండ తర్వాత కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రారంభమైన నూతన దళిత చైతన్యం, దళిత ఆత్మ గౌరవ ఉద్యమంలో ఇది ఒక భాగం. ఈ ఉద్యమక్రమంలోనే మోహన్, కులనిర్మూలనా జాతి విముక్తి పోరాటం అనే అవగాహననూ అభివృద్ధి చేసాడు.

మరణం మార్చు

బ్రెయిన్‌స్ట్రోక్‌ తో సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

మూలాలు మార్చు

  1. విశ్వవరం మోహన్‌రెడ్డి. "విలక్షణ విప్లవ మేధావి". ఆంధ్రజ్యోతి. Retrieved 8 September 2017.[permanent dead link]

బయటి లంకెలు మార్చు