వీరబొబ్బిలి (పాత్ర)

వీరబొబ్బిలి ప్రముఖ పాత్రికేయుడు, రచయిత కె.ఎన్.వై.పతంజలి రాసిన పలు నవలల్లోని కాల్పనిక పాత్ర. రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు నవలల్లో వీరబొబ్బిలి ఒక ముఖ్యమైన పాత్ర. వీరబొబ్బిలి పాత్ర ఒక మాట్లాడే కుక్క. భేషజాలకు పోయి బొబ్బిలి పాత్ర వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ పండిస్తుంది. వీరబొబ్బిలి కావడానికి కుక్కే అయినా మనుషుల్లో జమకట్టుకుంటుంది. పైగా తాను మేలైన కుక్కననీ, మహాజాతైన కుక్కననీ, తాండ్రపాపారాయుడి వారసులింట పుట్టినదాన్ననీ గొప్పగా చెప్పుకుంటుంది.

వీరబొబ్బిలి
రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు పాత్ర
మొదటి దర్శనం1983
చివరి దర్శనం1995
సృష్టికర్తకె.ఎన్‌.వై.పతంజలి
సమాచారం
Aliasగ్రామసింహం
Speciesకుక్క
లింగంమగది

నవలలు

మార్చు

ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు కె.ఎన్.వై.పతంజలి ఈ పాత్ర సృష్టికర్త. 1983లో పతంజలి రచించిన రాజుగోరు నవలలో వీరబొబ్బిలి పాత్ర తొలిసారి కనిపిస్తుంది. ఆపైన వరుస నవలల్లాంటి వీరబొబ్బిలి(1984), గోపాత్రుడు(1992), పిలకతిరుగుడు పువ్వు(1995)ల్లో ఈ పాత్ర కొనసాగింది.

రాజుగోరు

మార్చు

రాజుగోరు నవలలోనే తొలిసారి బొబ్బిలి పాత్రను చిత్రీకరించారు పతంజలి. అలమండ రాజులందరూ సేరీవేటకు వెళ్ళిన సమయంలోనే బొబ్బిలి వేటకుక్క కనుక దాన్నీ తీసుకువెళ్తారు. గోపాత్రుడు బొబ్బిలి తాడు పట్టుకుని వేటజట్టులో ఉంటాడు. ఒంటి పంది దగ్గరకి వచ్చినప్పుడు గోపాత్రుడు వేటజట్టు తప్పిపోయి చెట్టెక్కుతాడు. బొబ్బిలి కూడా వేటజట్టు నుంచి తప్పించుకుని గోపాత్రుణ్ణి కనిపెట్టి వచ్చి తాపీగా కబుర్లు చెప్తుంది. ఒంటి పంది ముట్టెతో కొడుతుందేమోనని భయపడి తిరిగివచ్చిందని తెలిసి గోపాత్రుడు చీచీ... బయపడి ఇలాగొచ్చీసీవ? నువ్వేం వేటకుక్కవీ అని చీదరించుకుంటాడు. బయ్యవేసి చెట్టెక్కిపోయిన వేటగాడికి నాపాటి కుక్క చాల్దేటి..? అని సమాధానమివ్వడమే కాక నీకు వేట కొత్త కాబట్టీ అలాగనీసీవు గానీ ఒంటి పంది మీదికీ, పిల్లల్ని తిప్పుతున్న పెట్టపందిమీదికీ, ఏతు పంది మీదికీ వేటకుక్కలు వెళ్ళకూడదోయీ. ప్రాణాపాయం అంటూ తన జాగ్రత్త చెబుతుంది. అప్పుడే ఆ ప్రాంతంలోకే ఒంటి పంది రావడం గమనించి అధాటున చెట్టెక్కి దాక్కుంటుంది. తర్వాత జరిగిన వేటలో తల్లితో పాటు పిల్ల పందుల వెంటపడతారు వేటజట్టు. తల్లితో మనకెందుకు అని పిల్లని వేరుజేసి దానిపై తన ప్రతాపం చూపిస్తుంది. పందిని మొత్తంగా తానే తినాలన్న తహతహతో రాజులు ఈటెతో పొడిచే అవకాశమూ ఇవ్వదు.[1]

వీరబొబ్బిలి

మార్చు

గోపాత్రుడు

మార్చు

లక్షణాలు

మార్చు

వీరబొబ్బిలి పాత్ర జంతువు ఐనా మనుషులతో మాట్లాడుతూ ఉంటుంది. వీరబొబ్బిలి వేటకుక్క. అడవికి వెళ్ళి వేటగాళ్ళతో పాటుగా జంతువులను అదిలించి బెదిరించి చెండాడడం వేటకుక్కల పని. ఐతే బలమైన ఒంటి పంది ఎదురైతే పక్కనే ఉన్న చెట్టెక్కి కూచుంటుంది. బొబ్బిలి శారీరికంగా చాలా బలిష్టమైన కుక్క. ఫకీర్రాజు మాటల్లో ఎనుబోతులాగుంటుంది. మనిషి ఎత్తుండే కుక్కైనా అడవిలో వేటకు భయపడి పారిపోతుంది.

ప్రవర్తన

మార్చు

మనుషులతో మాట్లాడుతుంది కనుక మనిషిలా ప్రవర్తించాలనే ఉద్దేశం వీరబొబ్బిలిది. పైగా తాను మనుషుల కన్నా గొప్పదాన్నేనన్న విశ్వాసం కూడా ఉంటుంది.

వృత్తి

మార్చు

స్వతాహాగా వేటలో పందిని చూస్తే జడుసుకునే లక్షణమున్నా మామూలు సమయాల్లో మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోదు. మనం కష్టపడి వేటజేసి తేవడమేమిటి, రాజులు దొబ్బితినడమేమిటిని పందుల్ని పట్టడం లేదని చెప్పుకుంటుంది. తనకే భోజనం కావాల్సి వస్తే బంజరుకెళ్ళి కొండగొర్రె మొదలుకొని సింహాన్నైనా పట్టి రోజుకొకటి తినలేనా అనుకుంటూంటుంది. ఇక జన్మతః వేటకుక్కని కనుక కాపలా కుక్కలతో కలవకూడదనీ, కాపలాకాయకూడదనీ దాని నియమం పెట్టుకుంటుంది. పైగా ఇంటికి దొంగ వస్తే కాపలా కుక్క కాదు కనుక అతనిపై అరవకుండా సహకరించి దొంగ తిండి పంచుకుంటుంది.

అభిప్రాయాలు

మార్చు

ఫకీర్రాజు స్నేహితుడు గోపాత్రుడు భూమి బల్లపరుపుగా ఉందని ప్రకటించినప్పుడు మొదట ఆ విశ్వాసాన్ని సమర్థించింది బొబ్బిలి.

ప్రాచుర్యం

మార్చు

వీరబొబ్బిలి పాత్ర తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధి పొందింది. అద్భుతమైన హాస్యానికి మానవ ప్రవర్తనలోని లోపాలను జోడించి చెప్పే ఈ వ్యంగ్య పాత్ర సాహిత్యంలో చిరంజీవిగా నిలిచింది. పతంజలిభాష్యం పుస్తక పరిచయంలో సమీక్షకుడు మురళీ ఈ పాత్రను గురించి ప్రస్తావిస్తూ 'నేను ఫలానా రచయిత రచనలు చదివాను' అని చెప్పుకోడాన్ని కొందరి విషయంలో మనం గర్వంగా ఫీలవుతాం. నాకు సంబంధించి ఆ కొందరు రచయితల జాబితాలో పతంజలిది తిరుగులేని స్థానం. తను సృష్టించిన ఒక్క 'వీరబొబ్బిలి' పాత్ర చాలు, పతంజలి రచనలు ఎందుకు చదవాలో చెప్పడానికి. అంటారు.

మూలాలు

మార్చు
  1. పతంజలి సాహిత్యం-మొదటి సంపుటం:రాజుగోరు:పతంజలి:పేజీ.175-242