కె. ఎన్. వై. పతంజలి
కాకర్లపూడి యోగ నారసింహ పతంజలి (మార్చి 29, 1952 - మార్చి 11, 2009) తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, ఆయుర్వేద వైద్యుడు.
పతంజలి | |
---|---|
జననం | కాకర్లపూడి నరసింగ యోగ పతంజలి 1952 మార్చి 29 అలమండ, విజయనగరం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
మరణం | 2009 మార్చి 11 | (వయసు 56)
వృత్తి | విలేఖరి, సంపాదకుడు, రచయిత |
జీవిత భాగస్వామి | ప్రమీల |
పిల్లలు | శాంతి, నీలిమ, షాలిని |
తల్లిదండ్రులు |
|
జీవిత చరిత్ర
మార్చుజననం, కుటుంబ నేపథ్యం
మార్చుపతంజలి 1952 మార్చి 29న ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లాలోని (ప్రస్తుతం విజయనగరం జిల్లాలో) అలమండ గ్రామంలో జన్మించాడు. తండ్రి వేంకట విజయగోపాలరాజు, తల్లి సీతాదేవి.[1] వారిది క్షత్రియ కుటుంబం. వారిది వాశిష్ట గోత్రం, అతని కుటుంబపు చుట్టపక్కాల్లోని ఆంధ్రదేశంలోని పలు జమీందారీ, రాచ కుటుంబాల సహా విజయనగర సంస్థానాధీశులైన పూసపాటి వంశీకులు కూడా రక్త సంబంధీకులే. ఆలమండ గ్రామం రాజులకు పుట్ట. వేటలు చేయడాలు, పౌరుషాలు ప్రదర్శించుకోవడాలు, సరదాలకు డబ్బు ఖర్చుచేయడాలు, బంధువర్గానికి భారీ మర్యాదలు చేయడాలు- వంటి రాచ అలవాట్లు పతంజలి జన్మించేనాటికి ఊరిలో బంధువులు ఎందరి ఇళ్ళలోనో ఉన్నా పతంజలి తండ్రి గోపాలరాజు మాత్రం ఆధునికంగా ఉండేవాడు.[2] పతంజలికి ఒక అన్న, నలుగురు తమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు.[3]
పతంజలి తండ్రి గోపాలరాజు అలోపతీ, యునానీ, ఆయుర్వేద వైద్యాల కలగలుపు అయిన లైసెన్షియేట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ (ఎల్.ఐ.ఎం.) చదువుకుని వైద్యం చేసేవాడు. గోపాలరాజు వైద్యంతో పాటుగా ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు, పాశ్చాత్య సాహిత్యం, భారతీయ సాహిత్యం, వేదాంతం వంటి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసేవాడు.[1] అతను ఇంట్లో పెద్ద ఎత్తున ఆంగ్లం, సంస్కృతం, తెలుగు గ్రంథాలను, వివిధ శాస్త్రాలకు చెందిన పత్రికలను తెప్పించుకుని భారీ గ్రంథాలయం ఏర్పాటుచేసుకున్నాడు. భారతీయ శాస్త్రాల మీద తనకున్న ఇష్టం కారణంగానే రెండవ కుమారుడి పేరు సంస్కృత వ్యాకరణానికి మహాభాష్యాన్ని, యోగసూత్రాలను అందించిన పతంజలి పేరు (యోగ నారసింహ పతంజలి) పెట్టుకున్నాడు. అతని తర్వాత పుట్టిన మగపిల్లలకు వివిధ దర్శనాలను, వేదాంతాన్ని అందించిన మహర్షులు గౌతముడు (న్యాయ గౌతమశంకర్), కణాదుడు (వైశేషిక కణాద సూర్య ప్రభాకర్), జైమిని (భగవాన్ కృష్ణ మీమాంస జైమిని), వ్యాసుడు (వేదాంత వ్యాసప్రసాద్) పేర్లను గోపాలరాజు పెట్టుకున్నాడు.[3]
పతంజలికి, అతని సోదరులకు సాహిత్యాభిలాష తండ్రి నుంచి నుంచి వారసత్వంగా వచ్చింది. తండ్రి నుంచి వైద్యాన్ని కూడా పతంజలి తర్వాత్తర్వాత పుణికిపుచ్చుకున్నాడు.
అలమండలో బాల్యం
మార్చుపతంజలి బాల్యం అలమండ గ్రామంలోనే సాగింది. రెండున్నర ఎకరాల సువిశాల క్షేత్రంలో చుట్టూ ప్రకారం మధ్యలో నాలుగిళ్ళ లోగిట్లో అతను పెరిగాడు. ఊరికి కొద్ది దూరంలోనే కొండలు, అడవి ఉండేవి. గ్రామంలోకి అప్పుడప్పుడూ చొరబడే అడవి జంతువులకు తోడు రకరకాల జంతువులను సీతాదేవి, గోపాలరాజు పెంచేవారు. ఇంట్లోనూ, బయటా ఉండే రకరకాల జంతువులు, పక్షులూ, ఇంటికి వైద్యం చేయించుకోవడానికి వచ్చే రకరకాల సామాన్యులూ, పేదలూ, తన బంధువర్గంలో రకరకాల వ్యక్తుల మాటతీరు, ఆలోచనా విధానం, గ్రామ జీవితం- ఇవన్నీ చిన్నతనం నుంచీ పతంజలి పరిశీలించేవాడు.[4][3]
అందరూ బుచ్చి అని పిలుచుకునే అతని మేనమామ ఉప్పలపాటి అప్పల నరసింహరాజుతో పతంజలికి, అతని తమ్ముళ్ళకి మంచి సాన్నిహిత్యం ఉండేది.[4] తన అక్క సీతమ్మ ఇంట్లోనే పెరిగినవాడు కావడంతో బుడతనపల్లి రాజేరు నుంచి ఎప్పడు తోచితే అప్పుడు అలమండ వచ్చి అక్కా బావల ఇంట్లో ఉండేవాడు బుచ్చి. బుచ్చిమామ వేట జట్లలో ఉండేవాడు, ఎంతో తిరిగినవాడు. అతను విన్న, చూసిన వేట కథలను, ఇతర విశేషాలను వేళాకోళం, వెక్కిరింతలతో హాస్యంగా వినిపిస్తే పతంజలి మరీ మరీ చెప్పించుకుని వినేవాడు. వీటికి తోడు ఎనిమిదేళ్ళ వయసు నుంచి ఇంట్లో దొరికిన ప్రతీ పుస్తకాన్ని ఆసక్తిగా చదవడం మొదలుపెట్టాడు. ఆ దశలోనే మామ చెప్పిన కథలను, తాను చదివే కథల్లాగా రాయాలన్న ఆసక్తి పుట్టుకువచ్చింది.[5]
విద్యాభ్యాసం, సాహిత్యాధ్యయనం
మార్చుగోవాడ చక్కెర కర్మాగారంలో పతంజలి మేనమామలు పనిచేస్తూ ఉండడంతో, వారు కాస్త పర్యవేక్షిస్తూ ఉండే వీలుంటుందని, మెరుగైన విద్య లభిస్తుందని పతంజలిని నేటి విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలోని బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివించారు. హైస్కూలు దశకు వచ్చేసరికి పతంజలి చదువు చోడవరం నుంచి నేటి విజయనగరం జిల్లాలో భాగమైన కొత్తవలసకు మారింది. ఈ దశలో పతంజలి తెలుగు డిటెక్టివ్ నవలలు విపరీతంగా చదవడం మొదలుపెట్టాడు. కొమ్మూరి సాంబశివరావు, విశ్వప్రసాద్ వంటి రచయితలు రాసిన అపరాధ పరిశోధక నవలలు క్షుణ్ణంగా, ఆసక్తిగా చదువుకునేవాడు.[5] ఐతే, వీటిని చెత్తపుస్తకాలుగా లెక్కించి, ఇవి చదివినందుకు పతంజలిని అతని తండ్రి చితకబాదేవాడు.[6] ఈ వేడిలోనే 1963లో పదకొండేళ్ళ వయసులోనే పతంజలి తన జీవితంలో తొలి నవలగా "అస్థిపంజరం" అన్న అపరాధ పరిశోధక నవల రాశాడు.[7] దాదాపు అదే వయసులో చైనా యుద్ధం గురించి ఓ కవిత కూడా అల్లాడు.[8] కొన్నాళ్ళకు పతంజలి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, చలం రాసిన స్త్రీ చదివాడు. ఆ రెండు పుస్తకాలూ అతనిని చాలా కుదిపివేశాయి.[6]
ఇలా పతంజలి కొత్తవలసలో ప్రీ యూనివర్శిటీ కోర్సు వరకూ పూర్తిచేసుకున్నాడు. బీ.కాం. చదువుకోవడానికి అన్నదమ్ములతో కలసి విజయనగరంలోని అద్దెగదిలో మకాం పెట్టాడు. రోజూ క్యారియర్ అలమండ నుంచే వచ్చేది.[9] ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయంగా శ్రీకాకుళం జిల్లాలో నక్సలిజం వ్యాపిస్తూ ఉన్న కాలమూ, తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ తీసుకువచ్చిన ఆవేశంతో అరసం, విరసం వంటి ఉద్యమాల నుంచి క్రమేణా దిగంబర సాహిత్య ఉద్యమం ప్రారంభమవుతున్న కాలమూ పాఠకుడిగా, ఔత్సాహిక బాల కవిగా, ఆపై యువకవిగా పతంజలి రూపుదిద్దుకుంటున్న కాలమూ 1960లు, తొలి 70లు.[7] ఈ ప్రభావం అంతా పతంజలిపై పడింది. విజయనగరంలో సోదరులతో కలిసి భారతీయ, పాశ్చాత్య సాహిత్యంలో గొప్ప గొప్ప రచనలు ఎన్నిటినో చదివాడు. రావిశాస్త్రిని, గురజాడను ఆరాధించేవాడు. తన చుట్టూ ఉన్న తెలుగు సాహిత్య వాతావరణాన్ని అవగాహన చేసుకునేవాడు. 1968లో "చివరి రాత్రి" అనే కథానికతో మొదలుపెట్టి దానికి కొనసాగింపుగా మరిన్ని కథలు రాశాడు. గొప్ప రచయితలను పోలినట్టు రాయాలన్న తమకంతో ఉండేవాడు.[8]
పాత్రికేయ రంగంలోకి
మార్చుడిగ్రీ పూర్తయ్యాకా పతంజలికి తెలిసిన ఓ పెద్దమనిషి ఈనాడు పత్రికలో ఏదోక ఉద్యోగం ఇవ్వమని సిఫార్సు చేస్తే అనుకోని విధంగా వారు సబ్ ఎడిటర్ ఉద్యోగాన్నిచ్చారు. అలా 1975 నుంచీ పతంజలి ఈనాడు పత్రికలో సబ్ ఎడిటర్ అయ్యాడు. ఆ సంవత్సరమే విశాఖపట్టణం జిల్లాకు చెందిన తుమ్మపాల గ్రామస్తులైన దంతులూరి బంగార్రాజు, శకుంతలాదేవి దంపతుల కుమార్తె ప్రమీలతో పతంజలి వివాహం జరిగింది. ఇలా ఉద్యోగరీత్యా విశాఖపట్టణం నగరానికి మకాం మారాక అక్కడి ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ప్రపంచ సాహిత్యాన్ని లోతుగా, విస్తారంగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. దాస్తొయెవ్‌స్కీ, బెర్‌టోల్డ్ బ్రెహ్ట్, నికోలాయ్ గోగోల్, మార్క్ ట్వేయిన్, ఆస్కార్ వైల్డ్, అంటోన్ చెకోవ్ వంటి పలువురు ప్రపంచ స్థాయి రచయితల కథలు, నవలలు, నాటకాలు క్షుణ్ణంగా, ఇష్టంగా చదువుకోవడం మొదలుపెట్టాడు.[10] విస్తృతాధ్యయనం వల్ల పతంజలికి అనుకరించాలన్న ధోరణి పోయింది.[11] అదే సమయంలో తాను రాస్తున్నవి ఆ రచయితల స్థాయితో పోల్చుకుని సరిగా లేవేమోనన్న న్యూనత వల్ల సాహిత్య సృష్టి కూడా తగ్గింది.[12] ఆ సమయంలోనూ, అంతకుముందూ రాసిన కథలను "దిక్కుమాలిన కాలేజీ" పేరుతో ప్రమీలా పబ్లికేషన్స్ నెలకొల్పి 1976 జూలైలో ప్రచురించాడు.[13] క్రమేణా ఈనాడు ఉపసంపాదకుడిగా పతంజలి విజయవాడ పత్రికాఫీసులో పనిచేయడానికి వెళ్ళాడు.[14]
ఖాకీ వనం - పెంపుడు జంతువులు
మార్చు1979లో విజయవాడలో ఉండగా తన డైరీలో పోలీసు జీవితాల గురించి తోచింది నవలా రూపంలో రాయడం ప్రారంభించి విస్తరించాడు. అదే క్రమేణా విస్తరించి పోలీసు జీవితంలో చీకటి కోణాలను డాక్యుమెంట్ చేస్తూ ఖాకీవనం నవల పూర్తిచేశాడు.[15] నవలను విశాలాంధ్ర ప్రచురణాలయం నవలల పోటీకి పంపిస్తే ఎంపిక కాలేదు.[16] ఆపైన చతుర 1980 నవంబరు సంచికలో ప్రచురితమైంది. "నవలలోని వివరాలలో అధిక భాగం వివిధ దిన, వార పత్రికలనుండి సేకరించిన యదార్థాలే గానీ కల్పితాలు కావు" అని పతంజలి ఈ నవల గురించి చెప్పుకున్నాడు.[15] "శ్రీరంగం శ్రీనివాసరావు, చాగంటి సోమయాజులు, రాచకొండ విశ్వనాథశాస్త్రిలను" తన గురువులని పేర్కొంటూ, "వారి దివ్య స్మృతికి" ఖాకీవనం నవలను అంకితం చేశాడు.[17] పోలీసులు, అందులోనూ కింది స్థాయి ఉద్యోగుల, జీవితాల్లో ఉండే వెట్టి చాకిరీ, కష్టాలూ, ఇబ్బందులూ, ఉన్నతోద్యోగులు, వారి కుటుంబాలూ కూడా కింది స్థాయి ఉద్యోగస్తులను చులకనగా చూడడం, వాటి నుంచి పుట్టుకువచ్చే అణచివేత ధోరణి వంటివన్నీ నవల చిత్రీకరించింది. ఈ నవలలోని ప్రధాన సూత్రాన్ని వివరిస్తూ చింతకింది శ్రీనివాసరావు "పోలీసులూ మనుషులే. వారికీ మనసుంటుంది. వారికీ పెళ్ళాం పిల్లలుంటారు. అన్నిటికీ మించి ఆత్మగౌరవం ఉంటుంది. ఉద్యోగాల పేరిట ఆ గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన స్థితి వచ్చినప్పుడు వారి హృదయమూ దు:ఖ సంకులమవుతుందని" ఖాకీవనం నవల చూపిస్తుందని రాశాడు.[14] పోలీసుల జీవితాల గురించి వాస్తవికంగా, దానిలోని దైన్యం, క్రౌర్యం వివరంగా రాయడంతో పోలీసులు కక్షకట్టి పతంజలిని ఏమైనా చేస్తారేమోనని కొందరు, ఇతను నక్సలైట్ కావచ్చునని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ అంశాలతో నవల రాయడం "సాహసమేననీ", "అలా రాయడానికి తెగింపు" ఉండాలనీ, అదంతా పుష్కలంగా ఉండబట్టే పతంజలి రాశాడనీ శ్రీనివాసరావు వ్యాఖ్యానించాడు. అన్ని విధాలా నవల ఒక సంచలనాన్ని సృష్టించింది.[18]
ఖాకీవనం నవలలో పోలీసు వ్యవస్థలోని అమానుషత్వాన్ని ఎత్తి చూపిన వెంటనే పతంజలి పత్రికా రంగంలోని దుర్మార్గాలను వివరిస్తూ పెంపుడు జంతువులు నవల రాశాడు. ఈ నవల 1982లో వారం వారం అన్న వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైంది.[19] సాధారణంగా ఏదో ఒక పాయింట్ ఆధారంగానో, పాత్ర గురించి రాస్తూనో ప్రారంభిస్తే అలా కొనసాగే తరహాలో రాసే పతంజలి ఒక్క పెంపుడు జంతువులు నవలను మాత్రం తుదా మొదలు ముందుగానే ఖచ్చితంగా ఊహించుకుని ప్రారంభించి రాశానని చెప్పుకున్నాడు.[20] అనుకోకుండా పత్రికా రంగంలోకి వచ్చిన పతంజలి తన కళ్ళముందే జరుగుతున్న విషయాలను సేకరించి పత్రికా రంగం ఎలాంటి గతిలో సాగుతుందో చూపుతూ ఈ నవల రాశాడు. ఇందులో సాధారణమైన విలేకరి స్థాయి నుంచి పత్రిక సంపాదకుడి వరకూ అన్ని స్థాయిల్లోనూ పాత్రికేయులు అనుభవించే పరిస్థితులను పాఠకుల ముందు ఉంచాడు. మొత్తంగా దీని గురించి విశ్లేషిస్తూ చింతకింది శ్రీనివాసరావు "పత్రికా వ్యవస్థ పాడయిన తీరును సాకల్యంగా విశదీకరిస్తూ పతంజలి రాసిన సమగ్ర నవల అని పెంపుడు జంతువులు" గురించి విశ్లేషించాడు.[21] ఈ నవలను పతంజలి తన అన్నదమ్ములు, చెల్లెలికి అంకితమిచ్చాడు.[22]
వేట కథలు
మార్చు1984లో ఉదయం పత్రిక ప్రారంభం కావడంతోనే పతంజలి ఈనాడు నుంచి ఉదయానికి మారాడు. ఈ దశలో ఆయన వేట కథలు రాయడం మొదలుపెట్టాడు. అడవి జంతువులు, వాటిని వేటాడే జట్లు, వేట- వీటి చుట్టూ ఉన్న అంశాలకు సంబంధించిన కథలు ఇవి. పతంజలి చిన్నతనం గడచిన అలమండ గ్రామం అడవికి దగ్గరలో ఉంది. అలమండ క్షత్రియ కుటుంబాల వారు పతంజలి చిన్నతనంలో కూడా తరచు వేటకు వెళ్ళేవారు. వేట జట్లలో తిరిగినవారు చెప్పిన సంగతులు విన్న అనుభవం, స్వయంగా కొన్ని వేటజట్లతో అడవుల్లో, కొండల్లో తిరిగిన అనుభవం కూడా పతంజలికి ఉండేది. అడవి, వేటగాళ్ళు, వారి ఉపకరణాలు, వేటకు సంబంధించిన పదజాలం, జంతువులు వంటివాటి గురించి మంచి అవగాహన, అనుభవం ఉన్నవాడు.[23] అన్నిటికన్నా మిన్నగా తనకు, తన అన్నదమ్ములకు చిన్నతనంలో మేమమామ బుచ్చి (ఉప్పలపాటి అప్పల నరసింహరాజు) తాను చూసిన, విన్న వేట కథలు వీటి రచనలో ఎంతగానో పనికివచ్చాయి. అందుకే ఈ కథలను బుచ్చి మావయ్యకే అంకితమిస్తూ "ఇందులో అత్యధిక భాగం" అతను చెప్పినవేనని రాసుకున్నాడు.[24] చూడికి వచ్చిన జంతువు చేతలు అర్థం చేసుకోకుండా అనాలోచితంగా తన బావగారింటి పెంపుడు అడవి పందిని బుచ్చిబాబు చంపడం (సీతమ్మలోగిట్లో), వేట జట్లకు సవాలుగా మారిన అడవి పందిని జగన్నాథరాజు వేటజట్టు చంపడం (తురువోలు పంది), ఎందరినో పట్టుకుని చీరేసిన ఎలుగు బంటిని జనం పట్టుకుని చంపడం (అదర్రా బంటి), ఎలుగుబంటి చేస్తున్న దారుణాలకు కోపగించుకుని ఒక వ్యక్తి సాహసంగా దాన్ని పట్టుకుని మిగిలిన ఊరి జనాన్ని దాన్ని చంపమని అడిగితే నాకెందుకని వారు వెనకడుగు వేస్తే చివరకు బంటిచేతిలో ఆ సాహసవంతుడు అన్యాయంగా చనిపోవడం (ఊరు దగా చేసింది), బ్రతుకు పోరాటంలో ఎక్కడో కొండవాలునున్న వెదురు కర్రలు కొట్టి మోపుచేసి తెచ్చుకునే ఆశన్న దొర వీపు మీదున్న మోపు మీద ఓ పులి ఎక్కితే వాటంగా ఊరి దాకా వచ్చి చివరకు జాగ్రత్తగా దాని బారి నుంచి తప్పించుకుని బ్రతికిపోవడం (ఆశన్నదొర) వంటి కథాంశాలు తీసుకుని పతంజలి ఈ కథలు రాశాడు.[25] 1984లో వేటకథలన్నీ సీరియల్‌గా ఉదయం పత్రికలో ప్రచురితమయ్యాయి.[26]
వ్యంగ్య రచనలు
మార్చు1982 వరకూ రాసిన ఖాకీవనం, పెంపుడు జంతువులు నవలలను తన మొదటి దశలోని నవలలుగా పతంజలి స్వయంగా చెప్పుకున్నాడు. ఇవి జర్నలిస్టిక్ ధోరణితో, వేరొకరి జీవితంలోకి తొంగి చూసి రాసినవని, వాటికి అంతగా ప్రాధాన్యత లేదని పతంజలి లెక్కకట్టాడు.[27] 1983లో పతంజలి రాజుగోరు నవలను రాశాడు. ఇది ఆ ఏడాది ఏప్రిల్ నెలలో చతుర మాసపత్రికలో ప్రచురితమైంది.[28] ఈ నవల పతంజలి నవలా రచనలో రెండవ దశకు ఆరంభంగా నిలిచింది. రాజుగారు నవల "నాకు బాగా తెలిసిన జీవితాన్ని సాహితీకరించాలని" అనుకుని రాసినట్టు చెప్పుకున్నాడు.[27] పతంజలి తమ కుటుంబాల్లో చూసిన ఒక సన్నివేశాన్ని రాయడం మొదలుపెడితే క్రమేపీ రాజుగోరు నవల అయింది.[20] దీనికి కథా స్థలం తన స్వగ్రామం అలమండ, దానితో పాటు కలగాడ వంటి చుట్టుపక్కల గ్రామాలూ. రాజుల మర్యాదలు, వారి తిండితిప్పలు, వారి వెటకారాలూ, వారి చుట్టూ ఉండే ఇతర జనమూ అన్నిటినీ నవలలో చిత్రీకరించాడు. ఇందులో ఒకనాటి వైభవాలు పోయినా ఆ వాసనలు పోని రాచ కుటుంబాలను వ్యంగ్యంగా చూపించాడు పతంజలి.[29] అలాగే ఈ నవలతో పతంజలి తనకు బాగా ఇష్టమైన, వాటమైన వ్యంగ్యాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. మనుషులతో పాటుగా వీరబొబ్బిలి (మాట్లాడే కుక్క), ఫకీర్రాజు, గోపాత్రుడు వంటి పాత్రలను రాజుగోరు నవలలోనే పుట్టించాడు పతంజలి. ఈ పాత్రలు తర్వాత "వీరబొబ్బిలి", "గోపాత్రుడు", "పిలక తిరుగుడు పువ్వు" నవలల్లో కనిపిస్తాయి.[30][31] రాజుగోరు నవలను తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు.[32]
దీని తర్వాత మాట్లాడే కుక్క పాత్ర వీరబొబ్బిలి ప్రధాన పాత్రగా "వీరబొబ్బిలి" నవలగా రాశాడు. దీన్ని ఒక విధంగా రాజుగోరు నవలకు రెండవ భాగంగా భావించవచ్చు. వీరబొబ్బిలి పాత్ర గురించి వివరంగా రాస్తూ పోతూండే సరికి క్రమేపీ అది నవలా రూపం సంతరించుకుందని పతంజలి గుర్తుచేసుకున్నాడు. 1984లో ఆంధ్రజ్యోతి పత్రిక దీపావళి సంచికలో ఇది తొలిసారిగా ప్రచురితమైంది. వ్యంగ్యం, హాస్యం కలగలసి సాగే వీరబొబ్బిలి పాత్ర యాదృచ్ఛికంగా పుట్టినది కాదనీ, అదొక నెపం అనీ,[31] "మనుషుల్లో ఉండే ఆభిజాత్యాన్ని, తాను అందరికంటె అధికమనే తత్వాన్ని బొబ్బిలితో చెప్పించి"నట్టు అతని జీవిత చరిత్రకారుడు చింతకింది శ్రీనివాసరావు వ్యాఖ్యానించాడు.[33]
పురస్కారాలు
మార్చుపతంజలికి ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి. వీటిలో ప్రధానమైనవి:
- రావిశాస్త్రి రచనా పురస్కారం
- చాసో స్ఫూర్తి పురస్కారం
- కృష్ణవంశీ 'సింధూరం' సినిమాకు ఆయనకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు దక్కింది.
పతంజలి నాటకోత్సవాలు
మార్చుపతంజలి నాటకోత్సవాలు థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగాయి. సాహిత్యానికీ, రంగస్థలానికీ మధ్య వంతెన కట్టే కృషిలో నిమగ్నమయి వున్న పెద్ది రామారావు నిర్దేశకత్వంలో హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు చంద్రశేఖర్ ఇండ్ల, నరేశ్ బూర్ల, శివ ఈ ప్రయోగానికి నాంది పలికారు.
మరణం
మార్చుగత కొంతకాలంగా కాలేయ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2009, మార్చి 11 న కన్నుమూశారు. అతని గురించి ఆయన స్నేహితులు, అభిమానులు, తోటి ఉద్యోగులూ, ఇతరులూ రాసిన వ్యాసాల సంకలనం పతంజలి తలపులు.
పతంజలి పుస్తకాల చిత్రమాలిక
మార్చు-
పతంజలి రచనలు
-
పతంజలి రచనలు
-
పతంజలి రచనలు
-
పతంజలి రచనలు
-
పతంజలి రచనలు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 10.
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 9.
- ↑ 3.0 3.1 3.2 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 11.
- ↑ 4.0 4.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 12.
- ↑ 5.0 5.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 13.
- ↑ 6.0 6.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 14.
- ↑ 7.0 7.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 16.
- ↑ 8.0 8.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 17.
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 15.
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 18.
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 19.
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 20.
- ↑ పతంజలి తలపులు 2011, p. 243
- ↑ 14.0 14.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 65.
- ↑ 15.0 15.1 పతంజలి సాహిత్యం మొదటి సంపుటం 2012, p. 74 harv error: multiple targets (2×): CITEREFపతంజలి_సాహిత్యం_మొదటి_సంపుటం2012 (help)
- ↑ పతంజలి తలపులు 2011, p. 101
- ↑ పతంజలి సాహిత్యం మొదటి సంపుటం 2012, p. 1 harv error: multiple targets (2×): CITEREFపతంజలి_సాహిత్యం_మొదటి_సంపుటం2012 (help)
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 67.
- ↑ పతంజలి సాహిత్యం మొదటి సంపుటం 2012, p. 174 harv error: multiple targets (2×): CITEREFపతంజలి_సాహిత్యం_మొదటి_సంపుటం2012 (help)
- ↑ 20.0 20.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 64.
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, pp. 67–69.
- ↑ పతంజలి సాహిత్యం మొదటి సంపుటం 2012, p. 75 harv error: multiple targets (2×): CITEREFపతంజలి_సాహిత్యం_మొదటి_సంపుటం2012 (help)
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 45.
- ↑ పతంజలి సాహిత్యం రెండవ సంపుటం 2012, p. 77
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, pp. 45–54.
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 122.
- ↑ 27.0 27.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 63.
- ↑ పతంజలి సాహిత్యం మొదటి సంపుటం 2012, p. 242 harv error: multiple targets (2×): CITEREFపతంజలి_సాహిత్యం_మొదటి_సంపుటం2012 (help)
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, pp. 70–71.
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 72.
- ↑ 31.0 31.1 చింతకింది శ్రీనివాసరావు 2017, p. 75.
- ↑ పతంజలి సాహిత్యం మొదటి సంపుటం 2012, p. 175 harv error: multiple targets (2×): CITEREFపతంజలి_సాహిత్యం_మొదటి_సంపుటం2012 (help)
- ↑ చింతకింది శ్రీనివాసరావు 2017, p. 77.
ఆధార గ్రంథాలు
మార్చు- చింతకింది శ్రీనివాసరావు (2017), కె.ఎన్.వై.పతంజలి, బెంగళూరు: సాహిత్య అకాదెమీ
- పతంజలి తలపులు, విజయవాడ: సాహితీ మిత్రులు, 2011
- కె.ఎన్.వై.పతంజలి (2012), పతంజలి సాహిత్యం, vol. 1, బెంగళూరు: మనసు ఫౌండేషన్
- కె.ఎన్.వై.పతంజలి (2012), పతంజలి సాహిత్యం, vol. 2, బెంగళూరు: మనసు ఫౌండేషన్