వృత్రాసురుడు

వేదవాజ్మయములోని ఒక రాక్షసుడు
ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.

శుకుడు పరీక్షిత్తు మహారాజుకి మహాభాగవత కథను వివరిస్తూ గురువు ప్రాశస్త్యం చెబుతూ వృత్రాసుర వృత్తాంతాన్ని వివరిస్తాడు. ఈ వృత్తాంతం భాగవతంలో షష్టస్కందములో వివరించబడుతుంది.

ఇంద్రుడు సభ - ఇంద్రుడు బృహస్పతిని ఉపేక్షించుట

మార్చు

ఒకరోజు ఇంద్రుడు సభ తీర్చి ఉండగా దేవతల గురువు అయిన బృహస్పతి అక్కడకు వస్తాడు. అందరి వద్ద పూజలు అందుకొంటున్న ఇంద్రుడు తన గురువు వస్తే లేచి గౌరవించకుండా ఉదాసీనంగా ఉంటాడు. ఆ విధంగా అగౌరవించబడ్డ బృహస్పతి ఖిన్నుడై తన గృహానికి వెళ్తాడు. ఆ తరువాత ఇంద్రుడు తాను చేసిన తప్పును గ్రహించి బృహస్పతి ఇంటికి బయలుదేరుతాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని గ్రహించి బృహస్పతి ఇంద్రునికి కనిపించకుండా అంతర్థానమౌతాడు. ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తప్పిందని అసురులకు తెలిసి, అసురులు శుక్రాచార్యుల అనుగ్రహంతో యుద్ధం ప్రకటించి ఇంద్రాదులను ఓడించి స్వర్గం నుండి తరుముతారు. అప్పుడు ఇంద్రుడు ఏమి చేయాలో తోచక బ్రహ్మవద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెబుతాడు.

రాక్షసులు స్వర్గాన్ని అధిరోహించుట-ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళుట-బ్రహ్మ విశ్వరూపుని గురువుగా అర్థించమని సూచించుట

మార్చు

అప్పుడు బ్రహ్మ విషయాన్ని గ్రహించి ఇంద్రునితో వారికి గురువు అవసరం ఉందని చెప్పి, త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురువుగా ఉండమని అర్థించమని చెబుతాడు. విశ్వరూపుడు చాల పిన్నవయస్సులో ఎన్నో యాగాలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు. ఇంద్రుడు బ్రహ్మ సూచన ప్రకారం విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురుస్థానాన్ని తీసుకోవలసిందిగా, తమకు స్వర్గం లభించే మార్గం ప్రసాదించి, ఆ స్వర్గసుఖాలు ఆనందించమని కోరుతాడు. విశ్వరూపునికి మూడు ముఖాలు ఉంటాయి. ఆయన ఒక ముఖంతో హవిస్సు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు. మరో ముఖంతో సురాపానం చేస్తాడు. మూడో ముఖంతో సోమరసం త్రాగుతాడు. యజ్ఞాలలో విశ్వరూపుడు మొదట తనకు తరతమ భేదం ఉండదని, బ్రహ్మజ్ఞానం కలవాడినని, తాను తన జీవనం పొలంలో పడిపోయిన ఒడ్లు ఏరుకొని జీవనం చేస్తుంటానని అంటాడు. "నేను మీ కోరిక మన్నించి నేను గురుత్వం వహించి మీకు పౌరోహిత్యం చేస్తే, మీ కోరికలకొఱకు నేను యజ్ఞాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది" అని అనగా, ఇంద్రాదులు, విశ్వరూపుని మరింత వేడుకోగా వారి కోరిక మన్నించి గురుత్వం వహిస్తాడు.

విశ్వరూపుడు నారాయణ కవచం ప్రాశస్త్యం చెప్పటం-నారాయణ కవచం ఉపదేశించుట

మార్చు
దస్త్రం:Narayanakavaca prasasthi.jpg
నారాయణ కవచ ప్రాశస్త్యం

తరువాత అసురుల సామర్థ్యాన్ని అంచనా వేసి, ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశం చేశారు విశ్వరూపుడు. నారాయణ కవచం విశేషం చెబుతూ ఒకప్పుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని అనునిత్యం పఠిస్తూ ఒక ఎడారిలో ప్రాణాలు విడిచి పెట్టేశాడు. నారాయణ కవచం తేజస్సు అస్థికలను పాటేసింది. ఆ విధంగా ప్రాణాలు విడిచిన కౌశికుడు అస్థిపంజరం ఎడారిలో పడి ఉండిపోయింది. ఒకరోజు చిత్రవధుడు అనే గంధర్వుడు భార్యలతో కలిసి ఆకాశమార్గంలో విమానంలో ఆమార్గంగుండా వెళ్తుండగా విమానం అక్కడి వరకు వచ్చి కౌశికుడి అస్థికలు ఉన్న ప్రదేశం వద్ద ఆగిఫొయింది, విమానం క్రింద పడిపోయింది. అప్పుడు గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు. అప్పుడు వాలకీయుడు అనే మహర్షి అక్కడకు వచ్చి చిత్రవధుడికి కౌశికుడి వృత్తాంతం తెలిపి, నారాయణ కవచం ప్రభావం వల్ల విమానం ఆగిఫొయిందని, ఆ అస్థికలను సరస్వతీ నదిలో నిమర్జనం చేసి, ఆచమానం చేస్తే విమానం కదులుతుందని తెలిపి అక్కడనుండి వెళ్ళిపోతాడు ఆ మహర్షి. చిత్రవధుడు వాలకీయుడు చెప్పినట్లు చేస్తే విమానం ముందుకు కదిలిందని విశ్వరూపుడు నారాయణ కవచ మహత్యాన్ని తెలుపుతూ ఇంద్రునికి నారాయణ కవచాన్ని ఉపదేశిస్తాడు. నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు అసురులపైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకొన్నాడు.

ఇంద్రుడు విశ్వరూపుడితో అమరావతిలో ఉన్న భాగ్యాలు ఆనందించమని చెబితే విశ్వరూపుడు, గురువులకు శిష్యులే ధనం అని చెబుతాడు. విశ్వరూపుడు యజ్ఞాలలో హవిస్సులు తీసుకొని అని ఇంద్రాదులకు ఇస్తుండేవాడు.

విశ్వరూపుడు రాక్షసుల కోరిక మేరపు హవిస్సులు రాక్షసులకు ఇచ్చుట-ఇంద్రుడు విశ్వరూపుని తలలు నరుకుట

మార్చు

విశ్వరూపుడు తల్లి రచన రాక్షస వంశానికి చెందినది. అందుచేత అసురులు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అసురులకు మేనమామ అయిన విశ్వరూపుడిని, యజ్ఞాలలో హవిస్సులను ఇంద్రుడికి తెలియకుండ తమకు ఇవ్వమని కోరుతారు. బ్రహ్మ జ్ఞానం కలిగి తరతమ భేదాలు లేని విశ్వరూపుడు, రాక్షసులు కోరినవిధంగా ఆ హవిస్సులలో కొంతభాగం రాక్షసులకు ఇస్తుండేవాడు. కొద్దిరోజుల తరువాత ఇంద్రుడికి ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ విడిచి తన వద్దనున్న చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను నరికి వేస్తాడు.

ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకం పంచుట-వరాలు ఇచ్చుట

మార్చు

సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది.అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్టగా మారిపోయింది. ఆ మూడు పక్షులు విశ్వరూపుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లో రొదగా ఉండేవి. వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి, భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావుభాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు. భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతటతాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాలయందు కొద్దిపాళ్ళు ఎక్కువసుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం.

త్వష్ట ప్రజాపతి యజ్ఞం చేసి వృత్రాసురుని పొందుట- వృత్రాసురుడు ఇంద్రుడి మీదకు వచ్చుట

మార్చు

తన కుమారుడైన విశ్వరూపుడి మరణవార్త త్వష్ట ప్రజాపతికి తెలుస్తుంది. త్వష్ట ప్రజాపతి ఇంద్రుని సంహరించే కొడుకు కోరుతూ ఒక పెద్ద యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞపరిసమాప్తి సమయానికి యజ్ఞ గుండం నుండి ఒక పెద్దరూపం ఆ యజ్ఞ గుండంలో నుండి బయటకు వచ్చింది. ఆ విధంగా పుట్టిన వేంటనే ఆ రూపం బ్రహ్మాండం అంతా వ్యాపించేసింది. బ్రహ్మాండం అంతా నిండి పోయింది కావున దానికి వృత్రాసురుడు అని నామకరణం జరిగింది. ఆ వృత్రాసురుడు ఆకాశాన్ని చప్పరించాడు, గ్రహాలను నాకాడు, ఇంద్రుడు ఎక్కడ ఉంటాడని గర్జనచేశాడు. ఆ విషయం తెలిసిన ఇంద్రుడు తన సైన్యాన్ని అంతా తీసుకొని వృత్రాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు. దిక్పాలురు వేసిన అస్త్రాలన్ని వృత్రాసురుడు గుర్రిటితో తీసుకొని నోటిలోవేసుకొని చప్పరించాడు.అప్పుడు ఇంద్రుడు ఏమి చేయాలో పాలుపోక బ్రహ్మ వద్దకు వెళ్ళాడు.

ఇంద్రుడు మహావిష్ణువు ని అర్థించుట- దధీచి మహర్షి వెన్నుముక ని అర్థించమని కోరుట

మార్చు

అది చూసి నిశ్చేష్టులై ఏమి చేయాలో తోచక మహావిష్ణువు వద్దకు వెళ్ళి తమ బాధ మొర పెట్టుకొన్నారు. ఆ ఆర్తత్రాణ పరాయణుడు గదా, శంఖ, చక్రముతో కౌస్తుభంతో, పద్మాలతో, శ్రీవత్సంతో, వనమాలతో వారికి ప్రత్యక్ష్యమైయ్యాడు అభయ ప్రకటన చేశాడు. వారి రాకకు కారణాన్ని వివరించమనగా జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. ఆప్పుడు మహావిస్ణువు వృత్రాసురుడి వధ దధీచి మహర్షి వెన్నుముక నుండి తయారు చేసిన వజ్రాయుధం వల్ల మాత్రమే జరుగుతుంది అని తెలిపాడు.

దధీచి మహర్షిని ఇంద్రుడు వెన్నుముక అర్థించమని కోరుట - దధీచి మహర్షి వృత్తాంతం

మార్చు

ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీ మహావిష్ణువు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి వెన్నెముక కోరవలసిందిగా చెబుతాడు. ఆ మాట విని ఇంద్రుడు వృత్రాసురుడుని సంహరించడం వల్ల మళ్ళి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొంటుందని ఆలోచిస్తుండగా దిక్పాలురు శ్రీమహావిష్ణువు చెప్పినట్లు చేయవలసినదని, వచ్చిన బ్రహ్మహత్యపాతకం అశ్వమేధయాగం చేయడం వల్ల పోయేటట్లు తాము చేస్తామని ఊరట పరుస్తారు. ఇంద్రుడు దిక్పాలురతో దధీచీ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. దధీచీ మహర్షిని శరీరాన్ని కోరడానికి ఇంద్రుడు ముందుకు వెళ్లక పోవడం చూసి, దిక్పారులు ఇంద్రుడుని ముందుకు తోస్తారు. అప్పుడు ఇంద్రుడు వృత్తాంతాన్ని చెప్పి తనకు దధీచి శరీరాన్ని ఇవ్వవలసినదిగా కోరుతాడు. దధీచీ మహర్షి అప్పటికే రెండు సార్లు జన్మ పొందినవాడు. ఇదివరలో అశ్వనీ దేవతలు దధీచి మహర్షీ వద్దకు వెచ్చి అశ్వశిరము అనే విద్య కోరుతారు, అప్పుడు దధీచీ తాను యాగం చేసుకొంటున్నాని కొంతకాలం తరువాత వస్తే ఆ విద్య ఉపదేశం చేస్తానని చెప్పగా వారు వెళ్ళిపోతారు. అశ్వనీదేవతలు అట్లా వెళ్ళిన వేంటనే ఇంద్రుడు వచ్చి వారికి విద్యని భోధిస్తే వారు అమరులు అవుతారు ఆ విద్యని భోధిస్తే నిన్ను సంహరిస్తానని దధీచితో చెబుతాడు. తరువాత అశ్వనీదేవతలు దధీచి వద్దకు రాగా దధీచీ ఇంద్రుడు వచ్చి వెళ్ళిన కథ చెబుతాడు. అప్పుడు అశ్వనీదేవతలు తరుణోపాయంగా వారు ముందే తాము దధీచి తలనరికేటట్లు, ఆ గుఱ్ఱం తలని అక్కడ అమర్చేటట్లు చేస్తానని, అప్పుడు అశ్వశిరస్సుతో అశ్వశిర విద్య బోధించిన వేంటనే తాము దధీచి తమకు విద్య బోధించనట్లు అరుస్తామని, ఆ మాట విని ఇంద్రుడు వచ్చి అశ్వశిరాన్ని నరికి వేస్తాడని, ఆ తరువాత దేవవైద్యులమైన మేము దధీచీ అసలు శిరస్సు ఉంచి ప్రాణ ప్రతిష్ఠ చేస్తామని చెబుతారు. ఆ విధంగా దధీచి అప్పటికే రెండు సార్లు జన్మ ఎత్తినవాడు. దధీచి ఎల్లకాలములో నారాయణ కవచమును స్తుతిస్తూ నరనరాలలో, ఎముకలలో నారాయణ మంత్ర ప్రభావితమైనది. అప్పుడు ఇంద్రుడు తన వృత్తాంతం చెప్పి శరీరాన్ని కోరగా దధీచి మహర్షి ఎవరైన తన శరీరాన్ని అచ్యుతుడు వచ్చి అడిగిన ఇచ్చేస్తాడా, సత్వ గుణ సంపద కలిగిన తన శరీరాన్ని తునకలు చేసి ఎముకలు ఏరి విశ్వకర్మ చేత ఒక ఆయుధం చేసి ఆఏముకలని హింస చేయడానికి వాడుతారా! అని అనగా దేవేంద్రుడు తమకు ఇప్పుడు గత్యంతరము లేదని తమని కాపాడమని అర్థిస్తాడు. అప్పుడు దధీచీ మహర్షి ఏదో పరిహాసానికి ఆ ప్రశ్న వేశాను కాని ఈ శరీరం తనది కాదని ఈశ్వరుడిదని, తన యోగ విద్యతో తనలో ఉన్న ప్రాణావాయువును పైకి లేపి అనంతంలో కలిపి, శరీరాన్ని పడగొట్టేశాడు. అప్పుడు ఇంద్రాదులు ఆ శరీరాన్ని కోసి ఎముకలు విశ్వకర్మ కిచ్చి ఆ విశ్వకర్మ చేత నూరంచులు కలిగిన వజ్రాయుధం తయారు చేయించారు.

ఇంద్రుడు వృత్రాసురుడుని వధించుట

మార్చు

అలా తయరు చేసిన వజ్రాయుధం తీసుకొని తన సైన్యముతో ఐరావతం ఎక్కి వృత్రాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అలా యుద్ధానికి వచ్చిన ఇంద్రునిచూచి వృత్రాసురుడు ఇంద్రుడితో ఒరేయ్ నువ్వేనా ఇంద్రుడివి, నువ్వేనా నా అన్న విశ్వరూపుడుని సంహరించింది, నువ్వు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన ఉపాయంతో దధీచి ఎముకలతో వజ్రాయుధం చేయించుకోవడానికి వచ్చావు. ఈ రోజు నిన్ను సంహరిస్తాను, లేదు లేదు, నీకు శ్రీమన్నారాయణుడి అండఉండడం వల్ల నేనే మరణిస్తాను అని అనగా ఇంద్రుడు ఆశ్చర్యపోయి తన శూలంతో ఐరావతాన్ని ఒక పోటు పొడుస్తాడు. అలా పోటు పొడవడం వల్ల ఇంద్రుడు ఐరావతం నుండి క్రిందపడి పోతాడు.

వృత్రాసుర వధ బ్రహ్మహత్యపాతకం చుట్టుకొనుట - ఇంద్రుడు ఈశాన్యం దిక్కున తామర పువ్వులొ దాగుకొనుట

మార్చు

వాహనము లేక ఆయుధం లేక క్రిందపడిన ఇంద్రుడిని చూసి ఆయుధం తీసుకోమని, ఆయుధం లేని వానితో యుద్ధం చేయనని, తాను ఇంద్రుడు చేతులలోనే నారాయణ పతి పొందుతాను అని చెబుతాడు. వృత్రాసురుడి యుద్ధనీతికి ఆశ్చర్యపడి ఇంద్రుడు కారణం అడుగుతాడు. అప్పుడు వృత్రాసురుడు తాను తన సొదరుడి మరణానికి కారణమైన ఇంద్రుడిని చంపడానికి పుట్టాను కాబట్టి తన కర్తవ్యం నిర్వహిస్తున్నాను అని అంటాడు. యుద్ధం జరుగుతుండగా వృత్రాసురుడు ఇంద్రుడిని మ్రింగివేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడి ఉదరములో నారాయణ మంత్ర ప్రభావం వల్ల జీర్ణం కాకుండా, తన వజ్రాయుధంతో పొట్ట చీల్చి బయట పడతాడు. తరువాత తన వజ్రాయుధంతో వృత్రాసురుడి తలని నరకడం ప్రారంభించి ఉత్తరాయన దక్షిణాయాన మధ్యాకాలములో నరుకుతాడు. ఆ విధంగా వృత్రాసురుడి వధ జరుగుతుంది. వృత్తాసురుడి వధ జరిగిన వెంటనే అందరు దిక్పాలురు వారి గృహములకు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వృత్రాసురుడు వధ జరిగిందో మళ్ళీ బ్రహ్మ హత్యాపాతకం ఇంద్రుడిని వెంబడిస్తుంది, ఇంద్రుడు తన రక్షణ కోసం అన్ని దిక్కులు తిరిగితాడు. ఎక్కడా శరణు దొరకదు. చివరికి ఈశాన్య దిక్కు వైపు వెళ్తాడు. బ్రహ్మహత్యాపాతకం ఈశాన్యం వైపు రాలేక పోతుంది. ఇంద్రుడు ఈశాన్యం దిక్కులో ఉన్న ఒక కమలంలో దూరి అక్కడ నారాయణ మంత్రం ఒక వెయ్యి సంవత్సరాలు పఠిస్తాడు. అక్కడ స్వర్గములో ఇంద్రుడి పదవి ఖాళీగా ఉండకూడదు కాబట్టి నహుషుడిని ఇంద్రుడీ పదవిలో కూర్చోబెడాతాడు. నహుషుడు శచీదేవీని కామించి ఆమెను అనుభవించ దలుస్తాడు. అప్పుడు శచీదేవి ఆర్తత్రాయణపరాయణుడైన నారాయణుడిని ప్రార్థించగా తరుణోపాయంగా నహుషుడికి శచీదేవి వద్దకు సప్తరుషులు మోస్తున్న పల్లకీలో రమ్మని కోరమంటాడు. నహుషుడు ఆవిధంగా సప్తరుషుల పల్లకీలో వస్తుండగా, అగస్త్య మహర్షి పొట్టిగా ఉండడం వల్ల పల్లకీ ఒక ప్రక్కకు ఒరిగిపోతుంది. దానికి కోపించి నహుషుడు అగస్త్య మహర్షిని ఒక తన్ను తంటాడు. అప్పుడు అగస్త్యుడు నహుషుడిని శపిస్తాడు. తరువాత అందరు దేవతలు ఇంద్రుడిని తామర పువ్వు నుండి తీసుకొని వచ్చి అశ్వమేధ యాగం చేయించి బ్రహ్మహత్యాపాతకం నివృత్తి చేస్తారు.

వృత్రాసురుడు పూర్వ జన్మ వృత్తాంతం

మార్చు

రాక్షసుడైన వృత్రాసురుడికి విష్ణుభక్తి యెలా కలిగింది అని సందేహం . అందుకు అతని పూర్వ్జ జన్మ వాసనే కారణం. కిందటి జన్మలో అతడు చిత్రకేతుడనే రాజు. ఆ రాజుకి కోటి మంది భార్యలు ఉన్నా సంతానం కలుగలేదు. అందుకని చాలా విచారిస్తూ ఉంటే ఒక నాడు అంగీరస మహాముని అతని దగ్గరకు వచ్చి, "సకల భోగాలూ అనుభవిస్తున్నా నీకీ విచారం ఎందుకు" అని అడిగాడు. " అన్నీ తెలిసిన వారైనా మీకు తెలియకుండా ఉండదు. ఐనా నా నోటి నుండి వినాలనే అలా అడుగుతున్నారు" అని తన విచారానికి కారణం ఆ మహామునికి విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముని, రాజు చేత స్వయంగా యాగం చేయించి, " ఈ యాగప్రసాదం వలన , రాజా, నీకు తప్పక కొడుకు పుడతాడు. వాడి వలన నీకమితానందమే కాకుండా దుఃఖం కూడా కలుగుతుంది" అని చెప్పి దీవించి వెళ్లిపోయాడు.

ఆ రాజు, అందరిలోకీ గుణవంతురాలు, పెద్దదీ అయిన కృతద్యుతి రాణికి ఆ యాగ ప్రసాదమిచ్చాడు. ముని చెప్పినట్లుగానే కృతద్యుతి ఆ తరువాత ఒక చక్కటి పిల్లాడిని కన్నది. ఆ రోజు నుంచీ ఆ రాజు ప్రపంచమంతా ఆ రాజకుమారుడే. వాడు పెరిగి పెద్దవుతూంటే ఆ దంపతుల ఆనందం యేం చెప్పాలి? కొడుకు పుట్టిన దగ్గర నుంచీ రాజు కృతద్యుతి అంతఃపురంలోనే గడుపుతూంటే మిగతా రాణులకి అసూయ పుట్టుకొచ్చింది. కాని చేసేదేమీ లేక వాళ్లు కూడా బాబు అంటే యెంతో ముద్దు అన్నట్లు వచ్చి నటిస్తూ, ఆ పిల్లాడితో ఒంటరిగా ఉండే సమయం కోసం కాచుకుని చూడ మొదలు పెట్టారు.

ఒక నాడు ఆ సమయం చిక్కగానే ఆ పిల్లాడి పాలల్లో విషం కలిపారు. వాడు ఆ పాలు తాగి చచ్చిపోతే కృతద్యుతితో పాటు వారు కూడా దొంగయేడ్పులు మొదలుపెట్టారు. చిత్రకేతు దుఃఖంతో కృంగిపోయి పిచ్చివాడివలే చనిపోయిన పిల్లాడేనే తలచుకుంటూ, నిద్రాహారాలు మానివేసాడు. అప్పుడు అంగీరసుడు నారదునితో కలిసి వచ్చి, "అలా చనిపోయిన వారి గురించి పరితపించడం అవివేకం. ఇలా సంసారబంధంలో మునిగి జీవితం వ్యర్థం చేసుకోకు. ఆ నారాయణుని భక్తితో తపస్సు చేసి మోక్షం సంపాదించుకో" అని బోధపరిచాడు. నారదుడు నారాయణ మంత్రం ఉపదేశించాడు.

వారు చెప్పినట్లుగానే తపస్సు చేయగా నారాయణుడు ప్రత్యక్షమై, భక్తికి మెచ్చానంటూ, "ఆత్మానుసంధానం చేసుకో. దాని వలన నీవు సిద్ధుడవవుతావు" అని దీవించి ఒక విమానాన్ని చిత్రకేతుడికిచ్చి అంతర్థానమయ్యాడు. భగవంతుడు చెప్పినట్లే చేసి సిద్ధుడయి, శ్రీహరిని స్త్రోత్రం చేస్తూ తన కెక్కడ మనసైతే అక్కడికి దేవుడిచ్చిన విమానంలో విహరిస్తూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు. ఒక నాడు విమానంలో ఆకాశవిహారం చేస్తుండగా ఒక చోట శివుని చూశాడు. పార్వతిని తొడపై కూర్చుండబెట్టుకుని మునులతో సభ చేస్తునట్లు ఉన్నది చూసి, "శివుడు అలా నలుగురిలోనూ పార్వతిని కూర్చోబెట్టుకో దలచినా , పార్వతికైనా సిగ్గు ఉండొద్దూ? వీళ్లకి మతిపోతే, ఆ మునులైనా అక్కడి నుంచి లేచి వెళ్లిపోవద్దూ?" అని ఆ సభలోని వారికి వినపడేలా తన నిరసన వ్యక్తపరిచాడు.

మిగతావాళ్లు యేమీ అనలేదు కాని పార్వతి కోపంతో, "ఈ మహామునులకు తెలియని ధర్మపన్నాలు వీడికి తెలుసా? ఎలా విర్రవీగిపోతున్నాడో, చూసారా? పరమేశ్వరుడైన శివునికి తెలియని నీతులు వీడికి తెలిసినట్లు పొగరుపోతుతనంతో యేం విర్రవీగుతున్నాడో చూసారా? ఈ కండకావరానికి వీడు శిక్ష పొందవలసినదే. రాక్షసుడై పుట్టుగాక" అన్నది.

తన తప్పిదం తెలుసుకుని చిత్రకేతుడు, "నా ప్రారబ్ధమే నాకు నీ శాపం తెచ్చింది. నను మన్నించు దేవి" అని పార్వతిని వేడుకున్నాడు. ఆ శాప ఫలితమే చిత్రకేతుడు వృత్రాసురుడిగా పుట్టాడు. ఆ తరువాత దేవేంద్రుని చేతిలో నారాయణ శక్తి ఉన్న వజ్రాయుధంతో మరణించి, మరు జన్మలు లేకుండా విష్ణుపదం చేరుకున్నాడు.