వెన్నేటి సత్యనారాయణ
వెన్నేటి సత్యనారాయణ ... వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుంచి బర్తరఫ్ అయ్యారు. తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు విక్రమహాలు నిర్మించి, పలు కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చారు. ఈ హాలు నిర్మాణానికి రాజా విక్రమదేవ వర్మ ఆర్ధికంగా సాయం అందించడంతో విక్రమ్ హాలుగా పేరు పెట్టారు.
ఉప్పు సత్యాగ్రహంలో జైలు శిక్ష
మార్చువెన్నేటి సత్యనారాయణ 1885లో రాజమండ్రి గ్రామీణ ప్రాంతం కాతేరులో జన్మించారు. 1907లోరాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బి.ఏ.చదువుతుండగా వందేమాతరం ఉద్యమంలో పాల్గొని కళాశాల నుంచి బర్తరఫ్ అయ్యారు. 1922,23ల్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని బ్రిటిషు వారి లాఠీ దెబ్బలకు గురయ్యారు. ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. న్యాయవాద వృత్తిలో కొనసాగిన సత్యనారాయణ హోమ్ రూల్ ఉద్యమంలో కోర్టులను బహిష్కరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళలు చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. చేనేత, పట్టు ఉత్పత్తి , తేనె ఉత్పత్తి వంటి కుటీర పరిశ్రమలలో శిక్షణ ఇవ్వడంలో అతను తన సహకారాన్ని అందించారు. 1936-37లో అప్పటి పోలీసు మైదానంగా వ్యవహరించే, ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం పేరిట గల సుబ్రమణ్య మైదానంలో సుమారు 1000 చ.అ.ల విస్తీర్ణంలో కమ్యూనిటీ హాలు నిర్మించారు. ఈ హాల్‌ను "తూర్పు గోదావరి ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ మ్యూజియం"గా కలెక్టర్ ప్రెసిడెంట్‌గా అండ్ ఎక్స్ అఫీషియోగా తాను సెక్రటరీగా నమోదు చేసుకున్నారు. కొందరు సభ్యులను చేర్చుకొని విద్యావైజ్ఞానిక సాంస్కృతిక కార్యకలపాలను నిర్వహించేవారు. కమ్యూనిటీ హాలు ఆర్థికంగా స్వతంత్రంగా అభివృద్ధి చెందాలన్నదే ఆయన లక్ష్యం. అందుకే దంపుడు బియ్యం కేంద్రానికి, రాట్నాలపై నూలు తీయడానికి, ఖద్దరు విక్రయ కేంద్రానికి తదితర కుటీర పరిశ్రమలకు అద్దెకు ఇచ్చారు.
విక్రమ్ హాలుగా
మార్చుఒరిస్సాలోని జయపూర్ సంస్థానాధీశులు రాజా రాజా విక్రమదేవ వర్మ దాదాపు రూ. 50000/- ఉదార విరాళం ఇవ్వడంతో హాలుకు "విక్రమ్ హాల్" అని పేరు పెట్టారు. ఈ ప్రదేశం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రంగా మారింది. విక్రమహాలుకు మాయబజార్ అనే పేరు కూడా వాడుకలో ఉండేది. విక్రమహాలు వెనుకనే వెన్నేటి ఒక మేడ తరహాలో కట్టుకుని క్రింద భాగంలో నివాసం ఉంటూ, పై భాగం అద్దెకిచ్చేవారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా కూదా పనిచేసిన సత్యనారాయణ 1955లో కన్నుమూశారు.వెన్నేటితో పాటు స్వాతంత్య్ర సమరయోధులు డా.బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం, దువ్వూరి సుబ్బమ్మ, డా. వి.వి.దీక్షితులు, డా. ఏ.బి. నాగేశ్వరరావు, క్రొవ్విడి లింగరాజు, చుండ్రుపట్ల హనుమంతరావు, డాక్టర్ పాలకోడేటి గురుమూర్తి, కె.వి.ఆర్. స్వామి నాయుడు, డాక్టర్ కె.ఎల్. నరసింహారావు, నాళం చిన భీమరాజు, పైడిమర్రి సత్యనారాయణ మూర్తి, జెండా వీరుడు దేవత శ్రీరామమూర్తి, వాడ్రేవు వెంకప్పారావు తదితరుల చిత్రపటాలు హాలులో ప్రదర్శించడంతో స్వాతంత్య్ర స్ఫూర్తికి దర్పణంగా నిలుస్తోంది.
సంగీత కార్యక్రమాలతో విక్రమ్ హాలుకి కళ
మార్చుకింది భాగంలో ఖాదీ భండార్, కుట్టు శిక్షణ, దక్షిణభారత హిందీ ప్రచార సభ హిందీ ప్రేమి మండలి, వినియోగదారుల సమస్యలు తీర్చే పరిష్కృతి ఇలా ఎన్నో కార్యక్రమాలతో సందడిగా ఉండేది. పైన హాలులో నాలుగు గోడలకు చుట్టూ స్వాతంత్య్ర సమరవీరుల చిత్రపటాలు,. హల్లు బయట ఒకవైపు ఆంధ్రకేసరి యువజన సమితి ఆఫీసు, మరోపక్క హిందీ ప్రేమీ మండలి ఆఫీసు ఉండేవి. ఇక హాలులో కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం తదితర రాజకీయ పార్టీల, ఎన్నో కార్మిక సంఘాల, విప్లవ సంఘాల సమావేశాలు; అఖిల పక్ష సమావేశాలు, సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, లెక్కకు మిక్కిలి నడిచేవి. విక్రమ హాలు కమిటీ పక్షాన శ్రీరామనవమి, స్వాతంత్య్ర దినోత్సవం వంటి కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తంగిరాల సత్యలక్ష్మీ దేవి 'స్వరలయ' సంస్థ పక్షాన గణపతి నవరాత్రులు నిర్వహించేవారు. సాగి శ్రీరామచంద్రమూర్తి ప్రతియేటా మంగళంపల్లి బాలమురళీకృష్ణ జన్మదిన సంగీత సభ పక్షాన కార్యక్రమాలు, వేదశాస్త్ర పరిషత్ పక్షాన ప్రముఖులతో ప్రవచనాలు, ఇలా లెక్కలేనన్ని కార్యక్రమాలు సాగేవి. బహిరంగ సభలకైతే సుబ్రహ్మణ్యం మైదానం, సమావేశాలకైతే విక్రమ హాలు అనేలా ఉండేది. ఒక్కోసారి సుబ్రహ్మణ్య మైదానంలో సభ జరుగుతుండగా, హఠాత్తుగా వర్షం వస్తే, సభ విక్రమ హాలులోకి మారిపోయేది. ఇందులో కొంతభాగం శిథిలావస్థకు చేరడం వలన ఇక్కడ సమావేశాలు తగ్గాయి. కిందిభాగంలో కూడా ఖాదీ భండార్ తప్ప మిగిలిన కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. అయితే గోదావరి సింగర్స్, రాకా సంస్థ, శ్రీహరి ఈవెంట్స్, నెలకో పున్నమి, సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ, సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ, స్వర రమణీయం, ఆనంద్ ఈవెంట్స్, రాయుడు ఈవెంట్స్, వంటి సంస్థలు శనివారాలు, ఆదివారాలలో సంగీత విభావరులు నిర్వహిస్తున్నాయి. వీటికి జనాలు బాగానే రావడంతో రాకా సాంస్కృతిక సంస్థ హాలును అందంగా తీర్చిదిద్ది, బయట కూడా బాగుచేయడంతో కళ వచ్చింది.
మూలాలు
మార్చు: పీఎస్ శర్మ రచించిన 'స్వతంత్ర సమరాంగణంలో గోదావరీతీరం' పుస్తకం(1987), తులసి గంగాధర రామారావు రచించిన స్వాతంత్య్ర సమిధలు పుస్తకం వివిధ పత్రికలలో కథనాలు, వ్యాసాలు